చాలా హోంవర్క్ చేశాను.. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చాను: చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలు, మహిళలు, విద్యావంతులకు ప్రాధాన్యం ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు కల్పించామని, అయినా అసంతృప్తితో ఉన్నవారిని బుజ్జగించేది లేదన్నారు. ఓటర్లు డబ్బు ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
By: Garuda Media | 21 Nov 2026 10:45 PM ISTస్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు. సమాజంలో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలకు అవకాశం ఇచ్చామన్నారు. జడ్పీ చైర్మన్‌ల నుంచి స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్లు, మేయర్లు, కౌన్సిలర్లు, చైర్మన్ల వరకు అనేక రూపాల్లో అవకాశం కల్పించామన్నారు. ఈ క్రమంలో చాలానే హోం వర్క్ చేసినట్టు వివరించారు. ఇంతకన్నా ఎవరూ చేయలేరని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ.. కొందరు అలుగుతున్నారని.. వారిని బుజ్జగించేది లేదని తెగేసి చెప్పారు.
మాల, మాదిగ, కాపు, కమ్మ, క్షత్రియ, రెడ్డి.. ఇతర సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేశామన్నారు. మైనారిటీ హోదాలో ఏకంగా మచిలీపట్నం జిల్లా పరిషత్ చైర్మన్ పోస్టు ఇచ్చామన్నారు. ఎస్సీలకు ఎన్టీఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇలా.. ఒకటికాదు.. అన్ని ప్రాంతాల్లోనూ న్యాయం చేశామని వివరించారు. అదే సమయంలో పార్టీ కోసం కష్టపడ్డవారిని.. పార్టీ కోసం.. అనేక ఇబ్బందులు పడిన వారిని కూడా.. అక్కున చేర్చుకుని పదవులు ఇచ్చామన్నారు. ఇదంతా ప్రజల కోసం.. పనిచేసేవారిని వెలికి తీయాలన్న సదుద్దేశంతోనే నన్నారు.
ఉన్నత విద్యావంతులకు కూడా పెద్ద అవకాశం కల్పించామన్నారు. ఐఐటీ, ఎంబీఎ, ఎంబీబీఎస్.. ఇలా పెద్ద పెద్ద చదువులు చదివిన వారిని కూడా స్థానిక ఎన్నికల్లో గెలిపించుకుని అవకాశం ఇచ్చామన్నారు. అలానే.. మహిళలకు ముందు నుంచి చెబుతున్నట్టుగా 50 శాతం రిజర్వేషన్ ఇచ్చి.. అదనంగా మరో 10 శాతం రిజర్వేషన్‌ను కూడా.. వారికి పార్టీ తరఫున కొన్ని జిల్లాల్లో కల్పించామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చదవుకున్న వారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారని.. విశాఖ, గుంటూరు వంటి జిల్లాల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారని తెలిపారు.
డబ్బు దాసాహం కావొద్దని ప్రజలకు చంద్రబాబు సూచించారు. ఎన్నికల సమయంలో డబ్బుల కోసం ప్రలోభానికి గురైతే.. ప్రజలకు సేవ చేసే విషయంలో నాయకులను ప్రశ్నించలేరని ఆయన హెచ్చరించారు. ఇటీవల పలమనేరులో ఓ ఓటరు.. తన ఓటుతో పాటు.. తనకు ఇచ్చిన 1000 రూపాయలను కూడా బ్యాలెట్ బాక్సులో వేసేశారని.. ప్రశంసించారు. ఇలాంటి మార్పుకోసమే తాను తపిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రజలకు ప్రభుత్వం నుంచి అన్ని రూపాల్లో సంక్షేమం అందుతోందని.. అలాంటి సమయంలో ఎన్నికల వేళ పారదర్శకంగా వ్యవహరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
