Begin typing your search above and press return to search.

ఏపీపై కేంద్రం నిఘా : వైసీపీ ప్ర‌చారంలో నిజ‌మెంత‌.. ?

ఏపీ కూటమి ప్రభుత్వంపై కేంద్రం నివేదికలు తెప్పించుకుంటోందంటూ వైసీపీ నేతలు, అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నాయి. అయితే కేంద్రంలో బీజేపీకి టీడీపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రచారంలో వాస్తవం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ పరిస్థితిపై బీజేపీ సమాచారం సేకరించే అవకాశం ఉందని చర్చిస్తున్నారు.

By:  Garuda Media   |   24 Nov 2026 5:55 AM IST
ఏపీపై కేంద్రం నిఘా : వైసీపీ ప్ర‌చారంలో నిజ‌మెంత‌.. ?
X

ఏపీపై కేంద్ర ప్ర‌భుత్వం నిఘా పెట్టింద‌ని.. నివేదిక‌లు కోరింద‌ని.. కూట‌మి స‌ర్కారులో త‌మ‌కు అన్యాయం జ‌రు గుతోంద‌ని బీజేపీ భావిస్తోంద‌ని అందుకే ఇలా స‌మాచారం తెప్పించుకునే ప్ర‌య‌త్నంలో ఉంద‌ని జ‌గ‌న్ మీడియా స‌హా వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి దీనిలో నిజం ఉందా? లేక‌.. బీజేపీ నాయ‌కుల‌ను రెచ్చగొట్టే కార్య‌క్ర‌మం ఏదైనా చేప‌ట్టారా? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది.

వాస్త‌వం ఏంటి.. ?

వాస్త‌వం చూస్తే.. కేంద్ర ప్ర‌భుత్వం నివేదిక‌లు తెప్పించుకునే స్థాయిలో కూట‌మి ప్ర‌భుత్వం లేదు. పైగా.. కేంద్రం లోని బీజేపీ పెద్ద‌ల‌కు ఉన్న ప్ర‌ధాన అల‌వాటు.. విప‌క్షాలు.. లేదా.. త‌మ‌కు ఎదురుతిరిగే నాయ‌కులు ఉన్న రాష్ట్రాల్లో ని ప్ర‌బుత్వాల‌ పైనే క‌న్నేస్తాయి. ప్ర‌స్తుతం ఇలాంటి వాతావ‌ర‌ణం.. మ‌న‌కు తెలంగాణ‌లో క‌నిపిస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని నేరుగా టార్గెట్ చేస్తున్న సీఎం రేవంత్‌తో పాటు.. త‌మ‌కు అత్యంత ప్ర‌త్య‌ర్థి ప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ అధికారంలో ఉంది. దీనికితోడు.. తాము ఒకింత క‌ష్ట‌ప‌డితే.. అధికారం ద‌క్కించుకోవ‌చ్చ‌న ఆశ కూడా బీజేపీకి క‌నిపిస్తోంది. దీంతో తెలంగాణ‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది. నివేదిక‌లు కూడా తెప్పించుకుంటోంది.

కానీ, ఏపీ విష‌యానికి వ‌స్తే.. స్వ‌యంగా కూట‌మిలో బీజేపీ భాగ‌స్వామ్య పార్టీ. అంతే కాదు.. టీడీపీ, జ‌న‌సేన‌ల‌ అండ తోనే కేంద్రంలో ప్ర‌బుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక‌, ఏపీలోనూ త‌మ పార్టీ నాయ‌కులు మంత్రులు గాఉన్నారు. ఇక్క‌డ జ‌రుగుతున్న అభివృద్ధిలో బీజేపీ పాత్ర కూడా ఉంద‌ని చంద్ర‌బాబు స్వ‌యంగా చెబుతున్నారు. ఇక‌, ప‌వ‌న్ సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పే ప‌నేలేదు. ఆయ‌న ఎక్క‌డ ఏమైకు దొరికినా.. ప్ర‌ధాని మోడీపై ప్ర‌శంస‌లు కురిపిస్తూనే ఉన్నారు. సో.. బీజేపీకి అనుమానం వ‌చ్చేటంత రాజ‌కీయాలు కానీ.. ఆ పార్టీ గ్రాఫ్ ను త‌గ్గించే రాజ‌కీయ వ్యూహాలు కానీ లేవు. కాబ‌ట్టి నివేదిక‌లు కోరే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అంతే కాదు.. అయితే గియితే.. వైసీపీ గురించే నివేదిక‌లు తెప్పించుకునే ప‌రిస్థితి ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నా రు. 2024 త‌ర్వాత‌.. వైసీపీ ఏమేర‌కు పుంజుకుంది? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆ పార్టీ ప‌రిస్థితి ఏంటి? అనే విష‌యాల‌పై బీజేపీ దృష్టి పెట్టే అవ‌కాశం ఉందే త‌ప్ప‌.. తాము కూర్చున్న కొమ్మ‌ను నరుక్కోవాల‌నే సాహ‌సానికి ఆ పార్టీ ఎప్ప‌డూ ప్ర‌య‌త్నం చేయ‌ద‌ని చెబుతున్నారు. కానీ వైసీపీ వ్యూహం ఏంటంటే.. బీజేపీ పెద్ద‌లు కూట‌మి పాల‌న‌పై అసంతృప్తిగా ఉన్నార‌ని, త‌మ‌ను తొక్కేస్తున్నార‌న్న భావ‌న‌లో ఉన్నార‌ని ప్ర‌చారం చేయ‌డం ద్వారా.. స్తానిక నాయ‌క‌త్వంలో విభేదాలు తీసుకురావాల‌న్న రాజ‌కీయ వ్యూహం దాగి ఉండి ఉంటుంద‌ని చెబుతున్నారు. అంతేత‌ప్ప‌.. కేంద్రానికి కూట‌మిపై ఎలాంటి సంశ‌యం లేద‌ని చెబుతున్నారు.