Begin typing your search above and press return to search.

చైర్మ‌న్ గిరి.. అంత ఈజీ కాదు ..!

జడ్పీ చైర్మన్ పదవుల కోసం ఉత్తరాంధ్ర నుంచి కాకినాడ వరకు టీడీపీ, జనసేన నేతల మధ్య పోటీ తీవ్రంగా మారింది. పార్వతీపురం మన్యంలో వీరేశ్ చంద్రదేవ్, నిమ్మల నీలిమ ఆశలు పెట్టుకోగా, విశాఖలో టీడీపీ నేతల మధ్యే పోటీ నెలకొంది. అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ ప్రభావం కనిపిస్తుండగా, కాకినాడలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య పీఠం కోసం ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారింది.

By:  Garuda Media   |   17 Nov 2026 6:39 PM IST
చైర్మ‌న్ గిరి..  అంత ఈజీ కాదు ..!
X

ప‌లు జిల్లాల్లో కూటమి పార్టీల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో పోటీ నెల‌కొంది. ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల మ‌ధ్య పోటీ బీభ‌త్సంగానే ఉంద‌ని చెప్పాలి. జ‌డ్పీ చైర్మ‌న్ కోసం.. పార్టీలో సుదీర్ఘ‌కాలం నుంచి ప‌నిచేస్తున్న‌వారు.. వేర్వేరు పార్టీల నుంచి వ‌చ్చిన వారు పోటీ ప‌డుతున్నారు. ఇలా.. అనేక జిల్లాల్లో ప‌రిస్థితి తీవ్రంగానే ఉంది. చివ‌ర‌కు పార్టీ ఆదేశాల‌కు క‌ట్టుబ‌డ‌తారా? లేక సొంత నిర్ణ‌యాలు తీసుకుంటారా? అనేది కూడా ఆస‌క్తిగానే మారింది.

ఉత్త‌రాంధ్ర జిల్లాల విష‌యానికి వ‌స్తే.. పార్వతీపురం మన్యం జ‌డ్పీ పీఠంపై జ‌న‌సేన ఆశలు పెట్టుకుంది. కానీ, ఇక్క‌డ టీడీపీ యువ నేత‌, కురుపాం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న‌ వీరేశ్‌చంద్రదేవ్ కూడా ప‌ద‌విని ఆశిస్తు న్నారు. ఇక‌, జనసేన నుంచి బామిని జడ్పీటీసీలో విజ‌యం ద‌క్కించుకున్న‌ నిమ్మల నీలిమ కూడా పోటీలో ఉన్నారు. ఇది పూర్తిగా ఎస్టీల‌కు కేటాయించారు. ఇక్క‌డ పార్టీ ఆదేశాలే కీల‌కంగా మార‌నున్నాయి. అయితే.. నీలిమ‌కు ఇప్ప‌టికే జ‌న‌సేన నాయ‌కులు హామీ ఇచ్చార‌ని తెలుస్తోంది.

విశాఖ‌లో చిత్రం..

విశాఖ‌ప‌ట్నం జిల్లా ప‌రిష‌త్‌లో నాలుగే స్థానాలు ఉన్నాయి. అంటే.. జిల్లా విభ‌జ‌న త‌ర్వాత‌.. ఇక్క‌డ నాలుగు స్థానాల‌ను మాత్ర‌మే గుర్తించారు. వీటిని టీడీపీ నాయ‌కులే ద‌క్కించుకున్నారు. అయితే.. అంత‌ర్గ‌తంగా జ‌డ్పీ చైర్మ‌న్ కోసం వారు ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డుతున్నారు. భీమిలి నుంచి విజ‌యం ద‌క్కించుకున్న అలివేణికి మాజీ మంత్రి ఒక‌రు అండ‌గా ఉన్నార‌ని అంటున్నారు. అలానే.. పెందుర్తి నుంచి గెలుపు గుర్రం ఎక్కిన సుఖవాసి అజయ్ కు కూడా ఓ కీల‌క నాయకుడి మ‌ద్ద‌తు ఉన్న‌ట్టు చెబుతున్నారు. నిజానికి ఇక్క‌డ చాలా ఈజీగా జ‌డ్పీ చైర్మ‌న్ ఎంపిక పూర్త‌వుతుంద‌ని అనుకున్నారు. కానీ, ఇప్పుడు దానికి భిన్నంగా సాగుతోంది.

ఎంపీ మాటే వేదం..!

అన‌కాప‌ల్లి నుంచి టీడీపీ, జ‌న‌సేన అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకున్నా.. చైర్మ‌న్ పీఠంవిష‌యానికివ స్తే.. బీజేపీ ఎంపీ సీఎం ర‌మేష్ చేతిలోనే ఉంద‌ని టాక్‌వినిపిస్తోంది. ఆయ‌నకు న‌చ్చి, ఆయ‌న మెచ్చిన వారికే ఈ పీఠం ద‌క్కుతుంద‌ని అంటున్నారు. మ‌రోవైపు జ‌న‌సేన అభ్య‌ర్థులు మాత్రం భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. టీడీపీ నుంచి దేవరాపల్లిలో గెలిచిన‌ కిలపర్తి రాజేశ్వరి, జనసేన తరఫున రాంబిల్లిలో గెలిచిన‌ రత్నం మ‌ధ్య పోటీ ఉన్నా.. వేరే వారికి అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంద‌ని ఎంపీ అనుచ‌రులు చెబుతున్నారు. మొత్తంగా ఇక్క‌డ ఎంపీ ప‌ట్టు ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు.

కాకినాడ జిల్లాలో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్య జ‌డ్పీ చైర్మ‌న్ ఎంపిక వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారుతోంది. మాజీ ఎమ్మెల్యే, కాకినాడ రూరల్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కాకినాడ రూరల్‌ జడ్పీటీసీ పిల్లి అనంతలక్ష్మి, జనసేన నుంచి పెద్దాపురం జడ్పీటీసీ బుర్రా దివ్య సునీతారాజ్ చైర్మ‌న్ పీఠం ఆశిస్తున్నారు. ఇక్క‌డ ఎంపీ ఉద‌య్ శ్రీనివాస్ చ‌క్రం తిప్పుతున్నార‌ని టీడీపీ నేత‌లు చెబుతుండ‌గా.. ఇదే సీటు కోసం టీడీపీ ఎమ్మెల్యే ఒక‌రు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని సేన‌లు ఆరోపిస్తున్నాయి.