'అతి' విశ్వాసం.. కూటమికి ఇబ్బందేనా.. ?
స్థానిక ఎన్నికల్లో విజయాల తర్వాత కూటమి అతివిశ్వాసంతో గ్రామీణ ఎన్నికలపై నిర్లక్ష్యం చేసిందన్న చర్చ జరుగుతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సుమారు 1,100 సర్పంచ్ స్థానాలు దక్కించుకోవడం కూటమికి హెచ్చరికగా మారింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టకపోవడం, ఏకగ్రీవాల ప్రయత్నాలు బెడిసికొట్టడం కారణాలుగా భావిస్తున్నారు. మిగిలిన రెండు విడతల్లో తప్పులు సరిదిద్దుకోవాలని కూటమి భావిస్తోంది.
By: Garuda Media | 29 Nov 2026 7:00 AM ISTఅతి విశ్వాసం.. ఎవరికీ మంచిది కాదు. అంతా బాగుందని అనుకోవడమే ఇప్పుడు కూటమికి గ్రామీణ స్థాయిలో ఇబ్బందులు తెచ్చిందన్న వాదన వినిపిస్తోంది. స్థానిక ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బలమైన ప్రాతి నిధ్యం చూపించిన కూటమి పార్టీలు.. గ్రామీణ స్థాయిలో ఆ రేంజ్‌లో పెరఫార్మెన్స్‌ను చూపించలేక పోయాయనే చర్చ సాగుతోంది. వైసీపీ పుంజుకోవడం.. సుమారు 1100 స్థానాల్లో సర్పంచులను దక్కించుకోవడం వంటివి కూటమికి ఒకరకంగా ఇబ్బందిగానే మారింది.
దీనికి కారణాలపై ఇప్పుడుఅన్వేషణ ప్రారంభించారు. అయితే.. మరో రెండు విడతల పంచాయతీ ఎన్నికలు ఉన్న దరిమిలా తప్పులు సరిచేసుకునేందుకు కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అసలు ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో తప్పులు ఎక్కడ జరిగాయన్నది కీలకం. అతివిశ్వాసమే అసలు సమస్యగా ఉందని పలువురు చెబుతున్నారు. స్థానిక ఎన్నికలు, కార్పొరేషన్లలో విజయం తర్వాత.. ఏకపక్షంగానే గ్రామీణ ఎన్నికలు కూడా ఉంటాయని.. తమ మద్దతు దారులు సంపూర్ణవిజయం దక్కించుకుంటారని పార్టీలు అంచనా వేశాయి.
దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్దగా దృష్టి పెట్టలేదు. పైగా.. గ్రామస్థాయిలో ఎమ్మెల్యేలు వ్యవహరిం చిన తీరుకూడా చర్చనీయాంశం అయింది. ఏకగ్రీవాలను ప్రోత్సహించే పేరిట.. వారు చేసిన రాజకీయాలు చాలా చోట్ల బెడిసి కొట్టాయి. దీంతో టీడీపీ సానుకూల ఓటు బ్యాంకు కూడా.. వైసీపీకి పడిందన్న వాదన వినిపిస్తోంది. ఇక, ప్రభుత్వం అంతా బాగానే చేస్తోందన్న వాదన నగరస్థాయిలో ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇది లేదన్నది తాజాగా తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తేలి పోయింది.
ఇది మంచిదే..
తాజాగా వచ్చిన గ్రామీణ ఎన్నికల ఫలితం తమకు మంచిదేనని కూటమి నాయకులు చెబుతున్నారు. పంచాయతీ ల్లో వచ్చిన ఫలితాన్ని సమీక్షించుకుని వచ్చే ఎన్నికల్లో తప్పులు లేకుండా చేసుకునేందుకు సరిదిద్దుకునేందుకు ఒక అవకాశంగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం.. గ్రామీణ స్థాయిలో కార్యకర్తలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మొత్తంగా కూటమిలో ఈ తొలివిడత ఎన్నికలు తప్పు ఒప్పులను సరిచేసుకునేందుకు అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే మంచిదేనని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితి మారేలాప్రయత్నం చేయాలనిసూచిస్తున్నారు.
