డిప్యూటీలలో కూటమి హవా...వైసీపీకి రెండే !
ఏపీలో 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో జరిగిన పరోక్ష ఎన్నికల్లో కూటమి 84 డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ పదవులు దక్కించుకుంది. టీడీపీ 57, జనసేన 19, బీజేపీ 8 స్థానాలు గెలుచుకోగా, వైసీపీకి 2, స్వతంత్ర అభ్యర్థికి ఒకటి దక్కాయి. వాయిదా పడిన 13 స్థానాల్లో మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఖర్చుల వివరాలను 45 రోజుల్లో సమర్పించాలని ఎస్ఈసీ ఆదేశించింది.
By: Satya P | 23 Nov 2026 11:15 PM ISTరాష్ట్రంలో కార్పోరేషన్లు మునిసిపాలిటీలలో డిప్యూటీ మేయర్లు, వైఎస్ చైర్ పర్సన్ పదవులలో కూటమి తన హవా చాటుకుంది. పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలు జరిగాయి. సోమవారం మొత్తం 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో ఈ ప్రక్రియ నిర్వహించారు. రాష్ట్రంలోని మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించగా ఇప్పటివరకు 87 పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
కూటమికే మొత్తం :
ఇదిలా ఉంటే కార్పోరేషనల్లో డిప్యూటీ మేయర్ పదవులు, అలాగే మునిసిపాలిటీలలో వైఎస్ చైర్ పర్సన్ పదవులు కూటమికే 84 దాకా దక్కాయి. రెండు మాత్రమే వైసీపీ గెలుచుకుంది అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఇందులో టీడీపీ 57, జనసేన 19, బీజేపీ 8, వైసీపీ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించడం జరిగింది. కూటమిలో తెలుగుదేశం పార్టీ – 57, జనసేన పార్టీ – 19, బీజేపీ 8 దక్కించుకున్నాయి. దాంతో మిగిలిన 13 పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష ఎన్నికలు మంగళవారం నిర్వహిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.
వాయిదా పడినవి అవే :
ఇదిలా ఉంటే సోమవారం కోరం సరిపోక ఇతర కారణాల వల్ల వాయిదా పడిన 13 పట్టణ స్థానిక సంస్థలను ఎన్నికల సంఘం తెలిపింది. అందులో పలాస-కాశీబుగ్గ, ఎలమంచిలి, నర్సీపట్నం, మాచర్ల, నాయుడుపేట, పుత్తూరు, ధర్మవరం, జమ్మలమడుగు, రాజంపేట, ఎర్రగుంట్ల, ఆళ్లగడ్డ, గూడూరు, ఆత్మకూరు ఉన్నాయి. ఇందులో కొన్ని చోట్ల కూటమిలో మిత్రుల మధ్య ఉప పదవుల విషయంలో కొంత సందిగ్ధత ఉందని అంటున్నారు.
ఎన్నికల వ్యయ వివరాలు ఇవ్వాలి :
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ అంటే ఎన్నికైన, ఓటమి చెందినవారు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, 1955లోని సెక్షన్ 617(సి), ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం, 1965లోని సెక్షన్ 343 జెడ్ డీ ప్రకారం, ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 45 రోజుల్లోగా జిల్లా ఎన్నికల అధికారికి తమ ఎన్నికల వ్యయానికి సంబంధించిన తుది వివరాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
చట్ట ప్రకారం చర్యలు :
ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నిర్దేశిత నమూనాలను, మార్గదర్శకాలను జారీ చేసిందని అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. నిర్ణీత గడువులోగా ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించని అభ్యర్థులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు. ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు గడువులోగా వివరాలు సమర్పించకపోతే మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుందని తెలిపారు. అదే విధంగా ఎన్నికైన అభ్యర్థులు వివరాలు సమర్పించకపోతే తమ పదవులను కోల్పోవడంతో పాటు, మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు.
