Begin typing your search above and press return to search.

ఏపీలో జ‌డ్పీ పీఠాల‌పై చిక్కుముడులు.. రీజ‌నేంటి.. ?

జడ్పీ, మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపిక కూటమి పార్టీలకు సవాల్‌గా మారింది. టీడీపీ, జనసేనల్లో ఆశావహులు, నేతల లాబీయింగ్ పెరగడంతో పదవుల పంపకంపై చర్చలు కొనసాగుతున్నాయి. జనసేన ఆరు జడ్పీ చైర్మన్ పదవులు ఆశిస్తుండగా, పది కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20లోగా 28 జిల్లాల జడ్పీ పీఠాల ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది.

By:  Garuda Media   |   17 Nov 2026 6:37 PM IST
ఏపీలో జ‌డ్పీ పీఠాల‌పై చిక్కుముడులు.. రీజ‌నేంటి.. ?
X

659 మండ‌లాలు, 28 జిల్లా ప‌రిష‌త్ స్థానాల్లో చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్ల ఎంపిక‌.. కూట‌మి పార్టీల‌కు చిక్కుగా మారిందా? ఎవ‌రిని ఎంపిక చేస్తే.. ఎవ‌రికి కోపం వ‌స్తుందో.. అనే మీమాంస‌లో ప‌డ్డారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. కీల‌క‌మైన జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ స్థానాల‌తోపాటు.. మండ‌ల ప‌రిష‌త్‌ల‌లో చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ పీఠాల వ్య‌వ‌హారం టీడీపీ, జ‌న‌సేన‌ల్లో ఆస‌క్తిగా మారింది. పదవుల పంపకంపై మూడు పార్టీలు ముఖ్యంగా టీడీపీ-జ‌న‌సేన పార్టీల మ‌ధ్య‌ చర్చలు జరుగుతున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఆశావ‌హులు.. ఎక్కువ‌గా ఉండ‌డమే కాదు.. బ‌ల‌మైన నాయ‌కులు, లాబీయింగ్‌లు కూడా పార్టీల‌కు ఇర‌కాటంగా మారాయి.

శ్రీకాకుళం జిల్లా జడ్పీ పీఠం విషయంలో మూడు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. జనసేనకు రాష్ట్రవ్యా ప్తంగా ఆరు జడ్పీ ఛైర్మన్ పదవులు దక్కవచ్చని అంటున్నా.. ఆ పార్టీ 10 వ‌ర‌కు కోరుతోంద‌ని మ‌రోవైపు నాయ‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు.. పార్టీల అంతర్గత పోటీతో పాటు నాయ‌కుల‌ లాబీయింగ్ ఎక్కువ‌గా కొన‌సాగుతోంది. కూటమికి పూర్తి మెజారిటీ ఉన్న జిల్లాల్లో సైతం అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారింది. ఉదాహ‌ర‌ణ‌కు పల్నాడు జిల్లాలోని మొత్తం 28 జడ్పీటీసీ స్థానాలను కూట‌మి గెలుచుకుంది. మహిళలకు రిజర్వ్ అయిన ఛైర్‌పర్సన్ పదవి కోసం టీడీపీ నుంచి నాగోతు వెంకట లక్ష్మీ సరోజ, ఉన్నం దీపిక, కొండపల్లి శివకుమారి, అలాగే జనసేన నుంచి బొర్రా అనిత తీవ్రంగా పోటీ పడుతున్నారు.

పలు జిల్లాల్లోని ప్రముఖ రాజకీయ నాయకులు తమ కుటుంబ సభ్యులను లేదా బంధువులను జడ్పీ ఛైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తుండటం మ‌రో విశేషం. పరోక్ష ఎన్నికల విధానం, రిజర్వేషన్లు రెండూ అమ‌లు చేస్తున్నా.. నాయ‌కుల‌కు సర్దిచెప్ప‌లేక పోతున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. గెలిచిన సభ్యులు చేతులెత్తే పద్ధతి ద్వారా ఛైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు. రిజర్వేషన్ల సమీకరణాలు, సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానాలు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మండ‌ల ప‌రిష‌త్ పీఠాల‌కు సంబంధించి స‌మ‌యం చేరువ అయింది. మ‌రో రెండు రోజుల్లో చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ పీఠాల‌కు నాయ‌కుల‌ను ఎంపిక చేయాల్సి ఉంది. దీనిపై టీడీపీ, జ‌న‌సేన క‌స‌ర‌త్తు ప్రారంభించాయి. అలానే.. ఈ నెల 20లోగా 28 జిల్లా ప్రజా పరిషత్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ల ఎంపిక కూడా కీల‌కంగా మార‌నుంది. ఈ నేప‌థ్యంలో పార్టీల‌కు స్థానికంగా ఉన్న నాయ‌క‌త్వానికి మ‌ధ్య‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో మంత్రుల సిఫార‌సులు, మాజీ ఎంపీల నుంచి ప్ర‌స్తుత ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ర‌కు కూడా చాలా మంది నాయ‌కులు త‌మ‌వారికి అవకాశం ఇవ్వాలంటే త‌మ వారికే ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.