Begin typing your search above and press return to search.

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టే బాధ్యత పూర్తిగా పెద్దలదేనని బాలీవుడ్ నటి విద్యాబాలన్ స్పష్టం చేశారు. చైల్డ్ సేఫ్టీ వీక్ సందర్భంగా మాట్లాడిన ఆమె.. పిల్లలు తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా చెప్పినప్పుడు నమ్మాలని, కుటుంబ పరువు పేరుతో ఘటనలను దాచిపెట్టకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలిసిన వ్యక్తులే నేరాలకు పాల్పడినా ప్రశ్నించాలని, పోక్సో చట్టంపై అవగాహన పెంచి నేరగాళ్లకు శిక్ష భయం కల్పించాలని అన్నారు. సినిమాలు చర్చకు దోహదపడతాయని, బాధితులకు న్యాయం జరిగేలా క్షేత్రస్థాయిలో పనిచేయడం సమాజం బాధ్యతని పేర్కొన్నారు.

By:  Tupaki Political Desk   |   20 Nov 2026 1:58 PM IST
వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని
X

రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 5న జడ్పీటీసీ పోలింగ్ జరిగింది. 7న ఫలితాలు వచ్చాయి. శుక్రవారం జడ్పీ చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులకు ఎన్నిక జరిగింది. దీంతో పరిషత్ ఎన్నికల కోలాహలం ముగిసినట్లైంది. ఎన్నికైన జడ్పీటీసీల పదవీ కాలం ఈ రోజుతో మొదలుకానుంది. రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉండగా, కూటమి పార్టీలు 27 జిల్లాలను కైవసం చేసుకున్నాయి. ఇందులో టీడీపీ 22 జిల్లాల్లో చైర్మన్ పదవులను తీసుకోగా, జనసేనకు 4 జిల్లా, బీజేపీకి ఒకటి చొప్పున కేటాయించారు. ఇక గురువారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చల్లో టీడీపీ తరఫున 22 మంది జాబితాను ప్రకటించారు. సామాజిక, రాజకీయ సమీకరణాలను చూసుకుని విడుదల చేసిన ఈ జాబితాలో పలువురు వారసులు, మాజీ ఎమ్మెల్యేలు పేర్లు ఉన్నాయి. కాకినాడ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశించిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మికి నిరాశ ఎదురైంది. జడ్పీ పీఠం ఆశించి ఆమె కాకినాడ రూరల్ నుంచి నామినేషన్ వేశారు. అయితే అనూహ్యంగా ఈ స్థానాన్ని జనసేన తీసుకోవడంతో మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి జడ్పీటీసీగా మిగిలిపోయారు.

వారసులకు అందలం

టీడీపీ తరఫున 22 జిల్లాలకు చైర్మన్లను ఎంపిక చేయగా, ఇందులో నాలుగో వంతు జిల్లాలకు వారసులే సారథులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తీవ్ర ఉత్కంఠ రేపిన జిల్లాల్లో ఒకటైన విజయనగరం జిల్లాకు మజ్జి సిరిసహస్రను ఎంపిక చేశారు. ఈమె జడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె. అయితే సిరి సహాస్ర కులానికి సంబంధించిన వివాదం కోర్టులో పెండింగులో ఉండటంతో ఆమెకు అవకాశం ఇస్తారా? లేదా? అనే చర్చ ఎక్కువగా జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముందుగా ఇచ్చిన మాట ప్రకారం, న్యాయ సలహా తీసుకుని సిరిసహస్రను చైర్మనుగా ఎంపిక చేశారు. దీంతో రాష్ట్రంలో అతిచిన్న వయసులో జడ్పీ చైర్ పర్సను అవుతున్న రికార్డును సిరిసహస్ర నమోదు చేశారు.

ఇక ఈ లిస్టులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ పేరు ప్రముఖంగా ఉంది. శ్రీసత్యసాయి జిల్లా తొలి చైర్మనుగా శ్రీరామ్ ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయ కుటుంబానికి చెందిన శ్రీరామ్ ఎమ్మెల్యే కావాలని కలలు కన్నారు. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూడగా, 2024లో పొత్తుల్లో భాగంగా ధర్మవరం సీటును త్యాగం చేశారు. అదే సమయంలో శ్రీరామ్ తల్లి సునీతకు సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రిగా అవకాశం దక్కలేదు. దీంతో శ్రీరామ్ కు జడ్పీ చైర్మన్ పదవిని కేటాయించారని అంటున్నారు. అదేవిధంగా ఏలూరు జడ్పీ చైర్ పర్సన్ గా చింతమనేని సాయి నవ్యశ్రీ ఎంపికయ్యారు. ఈమె దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె. గత ఎన్నికల్లో నవ్యశ్రీకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది. అయితే కార్యకర్తల ఒత్తిడితో చివరి నిమిషంలో ప్రభాకర్ కు వదలేసింది. మరోవైపు ఆయనను మంత్రిగా చేయాలని కేడర్ నుంచి డిమాండ్ రాగా, సామాజిక సమీకరణాలతో చాన్స్ ఇవ్వలేకపోయారు. ఫలితంగా ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీకి జడ్పీ పీఠం అప్పగించారని అంటున్నారు.

అదేవిధంగా వారసుల కోటాలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్య డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ చైర్ పర్సనుగా, మాజీ ఎమ్మెల్యే, ఎంపీ పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి ప్రసాద్ బాబు అన్నమయ్య జిల్లా పరిషత్ చైర్మనుగా అవకాశం దక్కించుకున్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ప్రస్తుతం వైసీపీలో ఉండగా, ఆయన కుమార్తె అమూల్య పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జిగా ఉంటూ ఇప్పుడు జడ్పీ పీఠం ఎగరేసుకుపోయారని అంటున్నారు. ఇక అన్నమయ్య జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబుకు సుదీర్ఘ నిరీక్షణ తరువాత పదవీయోగం పట్టిందని చెబుతున్నారు.

టీడీపీ తరఫున మొత్తం 22 మంది జడ్పీ చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించారు. ఇందులో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్సీ ఉండటం గమనార్హం. పోలవరం జిల్లాకు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, నెల్లూరు జిల్లాకు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరావు, కడప జడ్పీ చైర్మనుగా మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి ప్రమాణం చేశారు. ఆయా జిల్లాల్లో కూటమి పార్టీలకు సంపూర్ణ ఆధిక్యం ఉండటంతో ఎన్నిక ప్రక్రియసాఫీగా సాగిపోయింది. కాగా, టీడీపీ తరఫున జడ్పీ చైర్మన్లుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది విద్యావంతులే ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ జిల్లా పరిషత్ చైర్మనుగా ప్రమాణం చేసిన కోట పుల్లమ్మ ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్నాళ్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేశారు. అదేవిధంగా సిరిసహాస్ర, సాయినవ్యశ్రీ, కూడా ఇంజనీరింగ్ పట్టభద్రులు కావడం విశేషం.