Begin typing your search above and press return to search.

ఏపీకి వరస తుఫానులు ఎందుకు వస్తున్నాయి ?

కేవలం 20 రోజుల వ్యవధిలో ఏపీని మూడు భారీ తుఫాన్లు వణికించాయి. ఆర్నాబ్, మొరసు తుఫాన్లతో ఇప్పటికే రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు కథనం పేర్కొంది. తాజాగా ఆక్వాన్ తుఫాన్‌తో కోస్తాంధ్రకు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో పెరిగిన సముద్ర ఉష్ణోగ్రతలు, అధిక తేమ, ఈశాన్య రుతుపవనాలు, ఎల్‌నినో ప్రభావం వరుస తుఫాన్లకు కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే పరిస్థితులు కొనసాగితే మరిన్ని తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

By:  Satya P   |   17 Nov 2026 11:12 PM IST
ఏపీకి వరస తుఫానులు ఎందుకు వస్తున్నాయి ?
X

కేవలం ఇరవై రోజుల వ్యవధి మాత్రమే. ఏపీకి మూడు భారీ తుఫాన్లు వచ్చి పడ్డాయి. అవి కూడా ఏ మాత్రం విరామం ఇవ్వకుండా ఒక దానిని మించి మరొకటి రావడం అంటే ఏపీ ఏ విధంగా తట్టుకోగలదు అన్నది ఒక పెద్ద చర్చ. అయితే ఈ తుఫాన్లు వరసగా రావడం వెనక ఏమి జరుగుతోంది అన్నది ఇక్కడ కీలకమైన అంశంగా ఉంది. ఇక చూసుకుంటే ఏపీకి అక్టోబర్ చివరి వారం తొలి తుఫాన్ తో సంక్షోభానికి నాంది పలికింది. దాని పేరు ఆర్నాబ్. చేయాల్సిన విద్వంశం అంతా చేసి వెళ్ళిపోయింది. అది ముగిసీ ముగియక ముందే మొరసు తుఫాన్ ఏపీకి వచ్చింది. ఈ తుఫాన్ నవంబర్ 2-3 తేదీల మధ్య ఏపీని అతలాకుతలం చేసింది. ఈ రెండు భీకర తుఫాన్ల వల్ల ఏపీకి వాటిల్లిన నష్టం అక్షరాలా ఏడు వేల కోట్లు పై మాటగా ఉంది. ఇపుడు ఆక్వాన్ పేరుతో మూడవ తుఫాన్ దూసుకుని వస్తోంది. దాంతో మరోసారి కోస్తాంధ్రా వణికిపోతోంది.

సీజన్ అయినా సరే :

సాధారణంగా అక్టోబర్ నవంబర్ నెలలు ఏపీకి తుఫాన్ల సీజన్ అన్నది తెలిసిందే. ఈ సీజన్లలో ఎక్కువగా తుఫాన్లు వస్తాయి. గత చరిత్ర చూస్తే అదే స్పష్టం అవుతోంది. 1977లో వచ్చిన దివిసీమ ఉప్పెన ఈ రోజుకీ జనాలను భయపెడుతోంది అంటే నవంబర్ 19న వచ్చిన పెను తుఫాన్ ప్రభావమే అది. ఇలా ఎన్నో తుఫాన్లు ఈ సీజన్ లో వచ్చి ఏపీని బీభత్సం చేశాయి. మరి వరస తుఫాన్లు ఇంత తక్కువ సమయంలో రావడం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పాలి. దానికి వాతావరణంలో పరిస్థితులు అనుకూలించడమే అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో పాటు, గాలుల దిశ, వాతావరణ పీడన పరిస్థితులు ఇవన్నీ ఒక్కసారిగా కలిసిరావడం వల్లనే తక్కువ సమయంలో ఎక్కువ తుఫాన్లు వస్తున్నాయని అంటున్నారు.

అధిక ఉష్ణోగ్రతలు :

ఇక చూస్తే ప్రస్తుతం బంగాళాఖాతంలో వేడి వాతావరణం ఉందని చెబుతున్నారు. ఈ వేడి అలాగే తేమ అన్నవే తుఫాన్లకు ఊపిరి పోస్తాయని చెబుతున్నారు. అలాగే సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం నీరు అంతా ఆవిరిగా మారుతుంది. అలా వాతావరణంలోకి తేమ రూపంలో ఇది చేరుతుంది. ఈ తేమ అల్ప పీడన వ్యవస్థలు బలపడడానికి ఎంతగానో సహకరిస్తుంది. ఇపుడు చూస్తే ఎల్ నినో ప్రభావం కూడా ఉంది. దాంతో ఇవన్నీ కలిసి ఏపీలో వరస తుఫాన్లకు కారణం అవుతున్నాయని అంటున్నారు.

ఈశాన్య రుతు పవనాలు :

మరో వైపు చూస్తే ఈశాన్య రుతుపవనాల ప్రభావం కూడా తుఫాన్లకు దోహదపడుతోంది. ఈశాన్య రుతు పవనాలు చురుకుగా ఉండడంతో పాటు బంగాళాఖాతంలో గాలుల కదలికలు, అలాగే అధిక తేమ, అల్పపీడన వ్యవస్థలు బలంగా ఉండడం ఇలా ఒక్కసారిగా అన్నీ కలిసి తుఫాన్లను తీసుకుని వస్తున్నాయి అంటున్నారు. ఇపుడు ఎల్ నినో పాత్ర ఏ మేరకు అన్నది చూస్తే ఎల్ నినో వల్లనే ఈశాన్య రుతు పవనాలు మరింత చురుకుగా మారిపోతున్నాయి. అలా వర్షాలు దక్షిణ భారత దేశంలో అధికంగా కురిసేందుకు వీలు అవుతోంది అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఏర్పడవచ్చు :

వరసగా ఈ మూడు తుఫాన్లే కాదు మరిన్ని కొత్త తుఫాన్లు ఏర్పడవచ్చు అని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో అనుకూలమైన గాలుల కదలికలు ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అలాగే సముద్రంపై అల్పపీడనం ఏర్పడినప్పుడు ఈ గాలుల గమనం, వేగం ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి అని అంటున్నారు. గాలుల మధ్య కోత తక్కువగా ఉంటే తుఫాన్ మరింతగా బలపడటానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. అలా అల్పపీడనాలు తుఫాన్లుగా పరిణామం చెందేందుకు ఈ పరిస్థితులు దోహదపడుతున్నాయని అంటున్నారు. ఇవే పరిస్థితులు మరింత కాలం కొనసాగితే ఆక్వాన్ తరువాత మరిన్ని తుఫాన్లు కూడా రావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.