Begin typing your search above and press return to search.

అనంతపురం వైసీపీ మేయర్.. కూటమి పక్కా ప్లానింగ్, ఆ ఒక్కరినీ లాగేస్తారా?!

అనంతపురం మేయర్ రమేశ్ గౌడ్‌ను టీడీపీలోకి రావాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. మేయర్ ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ ప్రతిపాదన రావడంతో వైసీపీ అప్రమత్తమైంది. మేయర్ స్థానాన్ని కూటమి లక్ష్యంగా చేసుకుందా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

By:  Tupaki Political Desk   |   10 Nov 2026 7:43 PM IST
అనంతపురం వైసీపీ మేయర్.. కూటమి పక్కా ప్లానింగ్, ఆ ఒక్కరినీ లాగేస్తారా?!
X

అనంతపురం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షం వైసీపీ గెల్చుకున్న అనంత మేయర్ స్థానంపై అధికార కూటమి గురిపెట్టిందనే టాక్ నడుస్తోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం గమనిస్తే జిల్లా రాజకీయాల్లో ఏదో జరగబోతోందన్న సంకేతాలు అందుతున్నాయని పరిశీలకులు అనుమానిస్తున్నారు. అనంతపురం మేయర్ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది.

ఈ నేపథ్యంలో జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే ఒక్కరు తిరిగి గెలిచే అవకాశం లేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు తిరిగి గెలిస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని సవాల్ చేశారు. దీనిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. అంతే కాకుండా వైసీపీ మేయర్ రమేశ్ గౌడ్ వెంటనే టీడీపీలోకి రావాలని లేదంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సివస్తుందో చెబుతూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో అనంత మేయర్ పై అధికార పార్టీ గురిపెట్టిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో 13 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే, అనంతపురంలో మాత్రమే వైసీపీ గెలిచింది. మిగిలిన 12 కార్పొరేషన్లను టీడీపీ కూటమి దక్కించుకుంది. అనంతపురం మేయర్ సీటును పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించడం, ఆ పార్టీకి సంస్థాగతంగా బలం లేకపోవడం, ఓటు బదిలీ కాకపోవడం వంటి కారణాలతో కూటమి అభ్యర్థి ఓడిపోయినట్లుగా విశ్లేషిస్తున్నారు. అయితే వైసీపీ గెలవడం జిల్లాలోని కూటమి నేతలకు తలకొట్టేసినట్లుగా ఉందని చెబుతున్నారు. దీంతో వైసీపీ నుంచి గెలిచిన మేయర్ రమేశ్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయకముందే పార్టీలోకి లాగేయాలని టీడీపీ కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దీనికి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు.

అగ్గిరాజేసిన జేసీ

వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు సంచలన రాజకీయ చర్చకు తెరతీసింది. తమ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని అనంత వెంకటరామిరెడ్డి సవాల్ చేయడాన్ని తప్పుబట్టిన ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచిన మేయర్ వెంటనే తమతో చేతులు కలపాలని ఆహ్వానం పలుకుతూ విపక్షాన్ని ఉలికిపాటుకు గురిచేశారని చెబుతున్నారు. వైసీపీ తరఫున గెలిచిన మేయర్ ఒంటరిగా ఏం చేయలేరని, కార్పొరేషన్లలో ఎక్కువ కార్పొరేటర్లను గెలుచుకున్న కూటమికే బలం ఎక్కువగా ఉందని జేసీ తెలిపారు. కార్పొరేటర్ల మద్దతు లేకుండా మేయర్ ఏం చేయలేరని, అధికార పార్టీలోకి వస్తే నగరాభివృద్ధి జరుగుతుందని జేసీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో తాను తాడిపత్రి మున్సిపల్ చైర్మనుగా గెలిస్తే ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురైందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మేయర్ రమేశ్ గౌడ్ టీడీపీలో చేరాలని సలహా ఇచ్చారు.

అయితే జేసీ చేసిన సూచన రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన మేయర్ ను పార్టీలోకి రమ్మంటూ జేసీ పిలుపునివ్వడం వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా? అన్న చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం ప్రోద్బలంతో జేసీ ఈ వ్యాఖ్యలు చేశారా? లేక స్వతహాగా తన అనుభవంతోనే ఇలాంటి ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారా? అన్నది తేలాల్సివుందని అంటున్నారు. ఏదిఏమైనా ప్రమాణ స్వీకారం చేయకముందే మేయర్ ను తమ పార్టీలోకి రమ్మంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునివ్వడం తీవ్ర రాజకీయం చర్చగా మారింది. దీనిపై వైసీపీ స్పందన ఎలా ఉంటుందో చూడాల్సివుందని అంటున్నారు.