Begin typing your search above and press return to search.

అనంతపురంలో మేయర్ రచ్చ : టీడీపీ ఎమ్మెల్యేలకు అనంత వెంకటరామిరెడ్డి బిగ్ సవాల్

అనంతపురం మేయర్ ఎన్నికలో వైసీపీ విజయం తర్వాత జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు. దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముందుగా వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రతిసవాల్ చేశారు.

By:  Tupaki Political Desk   |   10 Nov 2026 2:57 PM IST
అనంతపురంలో మేయర్ రచ్చ : టీడీపీ ఎమ్మెల్యేలకు అనంత వెంకటరామిరెడ్డి బిగ్ సవాల్
X

అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో విజయం ప్రతిపక్షం వైసీపీలో ఆత్మవిశ్వాసం నింపింది. కార్పొరేషన్ లో మేయర్ సీటు దక్కించుకున్న ఉత్సాహంతో అధికార పక్షంపై పైచేయి సాధించే వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి అధికార పార్టీని రెచ్చగొట్టేలా చేసిన చాలెంజ్ విస్తృత చర్చకు దారితీస్తోంది. అనంతపురం కార్పొరేషన్ లో వైసీపీ విజయాన్ని పార్టీ ఘనతగా భావిస్తున్న అనంత వెంటకరామిరెడ్డి జిల్లాలో టీడీపీ ప్రాభవం కోల్పోయిందని ప్రచారం చేస్తున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని, మళ్లీ వారు గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.

అనంతపురం కార్పొరేషనులో సాధించిన విజయాన్ని ఆసరాగా చూసుకుని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. అధికార కూటమి నేతలపై మానిసికంగా పైచేయి సాధించే వ్యూహంతోనే అనంత వెంకటరామిరెడ్డి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థిని పడగొట్టాలంటే వారి మానిసక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే రాజనీతిని పాటిస్తున్న అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం కార్పొరేషన్ లో వైసీపీ విజయంతో టీడీపీ పనైపోయిందన్న భావన కల్పించాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే ఆయన సవాల్ ను వెంటనే స్వీకరించిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఉమ్మడి జిల్లాలో 14 మంది టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాకు డిమాండ్ చేసిన అనంతవెంకటరామిరెడ్డి ముందుగా వైసీపీకి చెందిన 11 మందితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధమవ్వాలని ప్రతిసవాల్ విసిరారు.

దీంతో అనంతపురం రాజకీయాలు వేడెక్కాయని అంటున్నారు. నిజానికి అనంతపురం కార్పొరేషన్ లో టీడీపీ పోటీ చేస్తే ఫలితాలు వేరుగా వచ్చేవని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం కార్పొరేషన్ పరిధిలో మెజార్టీ డివిజన్లను కూటమి దక్కించుకోవడమే అంటున్నారు. కార్పొరేషన్ లో మొత్తం 62 డివిజన్లు ఉండగా కూటమికి 37, వైసీపీకి 21 వచ్చాయి. మిగిలిన 4 స్థానాలను ఇతరులు గెలుచుకున్నారు. కూటమిలో టీడీపీకే 30 సీట్లు రాగా, జనసేన 6, బీజేపీ 1 చోట గెలిచాయి. అయితే పొత్తుల్లో భాగంగా మేయరు సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో ఓటు బదిలీ సక్రమంగా జరగక బీజేపీ అభ్యర్థి కోట్ల అజేష్ బాబు సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మేయరుగా వైసీపీ అభ్యర్థి బీ.సీ.రమేష్ గౌడ్ విజయం సాధించారు. దీంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్నట్లు కనిపించిన వైసీపీలో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది.

ఇదే అదునుగా భావించిన అనంత వెంకటరామిరెడ్డి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాకు డిమాండ్ చేయడం ద్వారా రాజకీయ రచ్చకు తెరలేపారు. నిజానికి కార్పొరేషన్ లో టీడీపీలో రెండు వర్గాల మధ్య విభేదాలు వైసీపీకి కలిసొచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బాబు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య తొలి నుంచి ఆధిపత్య పోరు నడుస్తోందని చెబుతున్నారు. వీటి ప్రభావం కూడా అనంతపురం కార్పొరేషన్ ఎన్నికలపై పడిందని చెబుతున్నారు. టీడీపీలో విభేదాలు వైసీపీకి కలిసిరావడం, బీజేపీ అభ్యర్థి మేయరుగా నిలబడటం వల్ల వైసీపీ అభ్యర్థి విజయావకాశాలు మెరుగుపరుచుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకున్న మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి కూటమిపై మానసిక దాడి చేయడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోందని చెబుతున్నారు.