Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పీఆర్పీ ఆవిర్భావ కార్యక్రమానికి నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి హాజరుకావడం చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డికి ఆమె వరుసకు కూతురు కావడంతో కుటుంబ అనుబంధంతోనే వచ్చారా? లేక రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచన ఉందా? అనే ఆసక్తి నెలకొంది. అయితే ఆమె రాజకీయ పాత్రపై స్పష్టత లేదు.

By:  A.N.Kumar   |   11 Nov 2026 3:11 PM IST
హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య
X

విజయసాయిరెడ్డి పార్టీ ప్రకటించడం తెలుగునాట ఓ సంచలనమైంది. ఏపీలో ఇన్నాళ్లు కులాల వారీగా విడిపోయిన పార్టీలకు విజయసాయిరెడ్డి పార్టీతో మరో కాంపిటీషన్ ఎదురైనట్టైంది. ఏపీ రాజకీయాల్లో తాను మార్పు తెస్తానని.. యువత, జెన్ జెడ్, బడుగు బలహీన వర్గాల ఏజెండాతో ముందుకెళ్లనున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ) అంటూ ప్రకటించి తన కొత్త రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. పనిలో పనిగా తాను గతంలో పనిచేసిన వైసీపీ నుంచి నేతలందరినీ తన పార్టీలోకి ఆహ్వానించేసి ఓ రకంగా తన మాజీ బాస్ వైఎస్ జగన్ కు షాకిచ్చారనే చెప్పాలి.

రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్మాయ పార్టీగా ఎదుగుతానని ప్రకటించిన విజయసాయిరెడ్డి తన పార్టీకి వెన్నుదన్నుగా కొత్త తరానికి బదులు మిగతా పార్టీల్లోని నేతలనే ముందుగా ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వైసీపీ అసంతృప్తులకు భారీ ఆఫర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి టీడీపీని వదులుతాడా? అన్న చర్చ కూడా సాగింది. కానీ టీడీపీకి సన్నిహితంగా ఉన్న కుటుంబాలను కూడా తన వైపు లాగడంలో విజయవంతమయ్యాడని తాజాగా ఆ వేడుకకు హాజరైన వారిని బట్టి మనకు అర్థమవుతోంది.

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి ప్రత్యక్షం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన కంటే అలేఖ్యరెడ్డి హాజరు వెనుక కారణాలపైనే ఇప్పుడు ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ఆమె విజయసాయిరెడ్డి పార్టీలో ఏదైనా కీలక పాత్ర పోషించబోతున్నారా? లేక బంధువు అయిన విజయసాయిరెడ్డి వెంట ఈ కార్యక్రమానికి హాజరయ్యారా? విజయ సాయిరెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే తారకరత్న పక్కా టీడీపీ వారసుడే.. ఎన్టీఆర్ కుటుంబంలోని సభ్యుడే. నారా లోకేష్ పాదయాత్రకు వెళ్లి అనూహ్యంగా గుండెపోటుతో మరణించారు. టీడీపీతో మమేకమైన తారకరత్న చనిపోయే వరకూ ఆ పార్టీ కోసమే పనిచేశారు. అయితే ఆయన భార్య ఇప్పుడు విజయసాయిరెడ్డి వెంట నడవడం హాట్ టాపిక్ గా మారింది. ఇది టీడీపీకి షాక్ అనే వారు ఉన్నారు. కానీ బాబాయి కావడంతోనే విజయసాయిరెడ్డి వెంట అలేఖ వెళ్లారని తెలుస్తోంది.

అయితే అలేఖ్య రెడ్డికి వరుసకు విజయసాయిరెడ్డి బాబాయి అవుతాడు. కుటుంబ పరంగా వీరిద్దరి మధ్య అనుబంధం ఉంది. తారకరత్నకు పిల్లనిచ్చి చేయడంలో విజయసాయిరెడ్డి అప్పట్లో కీలక పాత్ర పోషించారు. తారకరత్న పిల్లలతోనూ కొన్ని వీడియోలను ఇటీవల విజయసాయిరెడ్డి చేశారు. అప్పుడప్పుడూ కుటుంబ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.

తారకరత్న మరణం తర్వాత తన కూతురు వరుస అయిన అలేఖ్యరెడ్డికి అండగా విజయసాయిరెడ్డి నిలబడ్డారని సమాచారం. తారకరత్న మరణం తర్వాత అలేఖ్యరెడ్డికి విజయసాయిరెడ్డి కుటుంబం అండగా ఉంటోంది. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టడంతో అందులో అలేఖ్యరెడ్డి పాల్గొనడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బాబాయి కొత్త పార్టీ వేళ కుటుంబ సభ్యురాలిగా అలేఖ్య హాజరయ్యారా? లేక భవిష్యత్తులో ఆమె కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచన చేస్తున్నారా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.