అమరావతి భవిష్యత్తుకు అంతర్జాతీయ విద్యా బాట.. రూ.100 కోట్లతో ఇంగ్లండ్ దిగ్గజ పాఠశాల
ఇంగ్లండ్‌కు చెందిన 474 ఏళ్ల చరిత్ర కలిగిన బెడ్ఫోర్డ్ స్కూల్ అమరావతిలో అంతర్జాతీయ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఎడ్యుకేషన్ అకాడమీ, మల్లిక్ గ్రూప్ భాగస్వామ్యంతో 8 ఎకరాల్లో సుమారు రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 2028 ఏప్రిల్ నాటికి తరగతులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తిస్థాయిలో 1,500 మంది విద్యార్థులకు విద్య అందించనున్నారు.
By: A.N.Kumar | 29 Nov 2026 6:28 PM ISTఒక నగరానికి ప్రాణం పోసేవి కేవలం ఆకాశాన్ని తాకే భవనాలు.. విశాలమైన రహదారులు మాత్రమే కాదు.. ఆ నేలపై అడుగుపెట్టి.. రేపటి భవిష్యత్తును నిర్మించుకునే చిన్నారుల అడుగులు.. ఒక రాజధాని నిజమైన వైభవాన్ని సంతరించుకోవాలంటే.. అక్కడ జ్ఞాన జ్యోతి వెలగాలి.. సరిగ్గా అలాంటి ఒక అపురూప ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నేడు వేదికవుతోంది. దాదాపు నాలుగున్నర శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఇంగ్లండ్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక బెడ్ఫోర్డ్ స్కూల్ సుమారు రూ.100 కోట్ల భారీ పెట్టుబడితో అమరావతి గడ్డపై అడుగుపెట్టడం కేవలం ఒక వార్త మాత్రమే కాదు.. అది కోట్లాది మంది తెలుగు తల్లిదండ్రుల కలలకు దొరికిన ఒక అందమైన రూపం..
బెడ్ఫోర్డ్ స్కూల్ అంటే సాధారణ విద్యా సంస్థ కాదు. 1552లో ఇంగ్లండ్ రాజు ఎడ్వర్డ్-6 పాలన కాలంలో పురుడు పోసుకున్న ఈ విద్యా కుసుమం.. 474 ఏళ్లుగా ప్రపంచానికి ఎందరో మేధావులను, నాయకులను అందించింది. అంతటి సుదీర్ఘ చరిత్ర.. విశ్వవ్యాప్త గుర్తింపు ఉన్న ఒక దిగ్గజ సంస్థ.. నేడు మన అమరావతిలో తన కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్ ఎడ్యుకేషన్ అకాడమీ, మల్లిక్ గ్రూప్ భాగస్వామ్యంతో సుమారు 8 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ అంతర్జాతీయ క్యాంపస్ రూపుదిద్దుకోనుంది. నేడు ఈ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన జరగడం అమరావతి ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది.
రెండు దశల్లో నిర్మించనున్న ఈ విద్యా ప్రాజెక్టు మొదటి దశను 2028 ఏప్రిల్ నాటికి పూర్తి చేసి తరగతులను ప్రారంభించాలని ప్రమోటర్లు సంకల్పించారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఇక్కడ సుమారు 1,200 నుంచి 1,500 మంది విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కేంబ్రిడ్జ్ / ఐజీసీఎస్ఈ విద్యాభ్యాసం చేయనున్నారు.
తమ పిల్లలకు ప్రపంచ స్థాయి చదువు చెప్పించాలంటే విదేశాలకు పంపాలి లేదా మెట్రో నగరాలకు వలస వెళ్లాలి అనే తల్లిదండ్రుల ఆవేదనకు ఈ క్యాంపస్ ఒక భరోసాను ఇవ్వబోతోంది. మన పిల్లలు మన కళ్లముందే ఉంటూ విశ్వవిజేతలుగా ఎదిగే అవకాశం ఇప్పుడు అమరావతిలోనే సాకారమవుతోంది.
ఈ ప్రాజెక్టును కేవలం రూ.100 కోట్ల ఆర్థిక పెట్టుబడిగా మాత్రమే చూడలేం.. ఇది అమరావతి భవిష్యత్తుపై ప్రపంచానికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఒక అంతర్జాతీయ విద్యా సంస్థ ఒక నగరంలో అడుగుపెడుతోందంటే ఆ ప్రాంతం సురక్షితమైనదని ఉజ్వలమైన భవిష్యత్తుకు చిరునామా అని ప్రపంచానికి ఒక బలమైన సంకేతం వెళ్తుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ల దార్శనికత, పట్టుదల అమరావతిని ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రాజధాని నిర్మాణంలో మౌలిక సదుపాయాలతో పాటు.. మానవ వనరుల అభివృద్ధికి వారు ఇస్తున్న ప్రాధాన్యతకు బెడ్ఫోర్డ్ స్కూల్ రాక ఒక నిలువెత్తు నిదర్శనం.
