Begin typing your search above and press return to search.

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

మాజీ మంత్రి, అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. అనకాపల్లి పరిధిలోని ఆరు జీవీఎంసీ వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించారు. విజయం సాధించిన కార్పొరేటర్లను సత్కరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ ఫలితంతో ఏపీ మంత్రివర్గ విస్తరణలో కొణతాలకు అవకాశం దక్కుతుందనే చర్చ మరోసారి మొదలైంది.

By:  Satya P   |   6 Nov 2026 9:20 AM IST
పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్  ?
X

మాజీ మంత్రి అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పట్టు సాధించారు. తాను దాదాపు పదిహేనేళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నా తన పలుకుబడి తగ్గలేదని చాటారు. అనకాపల్లి పరిధిలోకి వచ్చే ఆరు జీవీఎంసీ వార్డులకు గానూ ఆరింటినీ గెలిపించడంలో కొణతాల సక్సెస్ అయ్యారు. కూటమిలో మిగిలిన నాయకులు తోడ్పాటు అంతా ఉన్నా కూడా వ్యూహ రచన చేసి అందరినీ కో ఆర్డినేట్ చేసుకుంటూ కొణతాల సాధించిన ఈ ఫలితం ఎంతో కీలకమైనది అని అంటున్నారు. ఒక విధంగా కొణతాల పాతికేళ్ళ క్రితం నాటి తన రాజకీయ హవాను మళ్లీ సొంతం చేసుకున్నారు అని అంటున్నారు.

నూరు శాతం స్ట్రైక్ రేటు :

అనకాపల్లి లో మొత్తం ఆరు డివిజన్లు ఉంటే అన్నింటికీ గెలిపించి నూరు శాతం స్ట్రైక్ రేటుని ఆయన సాధించారు అని అంటున్నారు. దీంతో విజయం సాధించిన అనకాపల్లి జోన్ పరిధిలో విజయం సాధించిన ఆరుగురు కూటమి కార్పొరేటర్లను కొణతాల రామకృష్ణ స్వయంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడం కేవలం పదవి దక్కించుకోవడం మాత్రమే కాదని, అది ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కొణతాల సూచించారు. అలాగే కార్పొరేటర్లు తమ తమ వార్డుల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

మంత్రి పదవి అంటూ :

ఈ భారీ విజయం నేపథ్యంలో కొణతాల రామక్రిష్ణకు సంబంధించి మంత్రి పదవి గురించి మరోసారి చర్చ సాగుతోంది. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరిగితే కచ్చితంగా కొణతాలకు బెర్ఫ్ ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అనుభవం రాజకీయ చతురత ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఉపయోగపడతాయని అంటున్నారు. జనసేన తరఫున ప్రముఖ బీసీ నేతగా ఉత్తరాంధ్ర ముఖంగా కొణతాల ఉన్నారని కూడా గుర్తు చేస్తున్నారు. దాంతో పాటు సీఎం చంద్రబాబుకు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కూడా కొణతాల సన్నిహితుడు అని అంటున్నారు. విస్తరణ అంటూ జరిగితే కేబినెట్ మంత్రిగా కొణతాలను అంతా చూస్తారు అని కూడా ఆయన అనుచరులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాల్సి ఉంది. సౌమ్యుడు, వివాద రహితుడుగా పేరు ఉండడం ఆయనకు కలసి వచ్చే అంశాలు అని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మంత్రి వర్గ విస్తరణలో మార్పులు చేర్పులు ఉంటాయని వినిపిస్తున్న క్రమంలో కొణతాలకు చాన్స్ దక్కుతుందని అంటున్నారు.