‘రప్పా.. రప్పా’ ఇష్యూ.. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం
వైసీపీ కార్యకర్తలపై నమోదు అవుతున్న కేసులపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.;
వైసీపీ కార్యకర్తలపై నమోదు అవుతున్న కేసులపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కార్యకర్తలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నమోదు చేస్తున్న అన్ని కేసులకు పార్టీ తరఫున న్యాయ సహాయం చేయాలని నిర్ణయించారు. బుధవారం మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో తనను కలిసిన పార్టీ కార్యకర్తలకు మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలపై నమోదైన కేసులకు సంబంధించి పార్టీ తరఫున లీగల్ టీం సహాయం చేస్తుందని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.
ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన కొందరు కార్యకర్తలు గత నెలలో మాజీ సీఎం జగన్మోహనరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీల్లో 2029లో అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడికి రప్పా.. రప్పా అంటూ రాశారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు నమోదు చేసింది. ప్లెక్సీ ముద్రించిన వైసీపీ కార్యకర్తల అరెస్టుతోపాటు, ప్రింట్ చేసిన షాపును సీజ్ చేసింది. అంతేకాకుండా రప్పా.. రప్పా.. అంటూ హెచ్చరించిన వారిని నడిరోడ్డుపై నడిపించి తీవ్రంగా అవమానించారని పోలీసులపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో నాలుగైదు చోటుచుకున్నాయని చెబుతున్నారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో కొందరు కార్యకర్తలు కత్తులు ప్రదర్శించడం, బహిరంగ ప్రదేశాల్లో జంతు బలులు ఇచ్చి జగన్ పోస్టర్ కు రక్తాభిషేకం చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. జంతు సంరక్షణ చట్టాల కింద కొందరిపై ఆయుధాల చట్టం కింద మరికొందరిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. అంతేకాకుండా గోపాలపురం నియోజకవర్గ కార్యకర్తలను రోడ్ షో చేయించినట్లే మిగతా చోట్ల నిందితులను కోర్టుకు తరలించడంలో భాగంగా రోడ్డుపై నడిపించినట్లు చెబుతున్నారు. దీనిని వైసీపీ శ్రేణులు తీవ్ర అవమానంగా భావిస్తూ అధినేత జగన్మోహనరెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఇక తనను కలిసిన కార్యకర్తలకు జగన్ భరోసా ఇవ్వడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆయన తీసుకున్న నిర్ణయంపై పార్టీ కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ పై అభిమానంతో తాము వైసీపీ ఉంటే, కూటమి ప్రభుత్వం అణచివేస్తోందని, ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించేలా అధినేత జగన్ నిర్ణయం తీసుకోవడంతో ధైర్యం వచ్చిందని కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ‘రప్పా.. రప్పా..’ అంటూ బెదిరింపులు ప్రజాస్వామ్య రాజకీయాలకు విఘాతంగా వ్యాఖ్యానిస్తున్న ప్రభుత్వ అనుకూల వర్గాలు, హింసను ప్రేరేపించేలా ప్రతిపక్ష నేత వ్యవహరిస్తున్నారని విమర్శిస్తోంది. ఏదిఏమైనా ‘రప్పా.. రప్పా..’ కేసుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం పెద్ద చర్చకు దారితీసిందని చెబుతున్నారు.