అభ్యర్థుల ఎంపికలో జగన్ కొత్త వ్యూహం !

వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత ప్రధానమో గత కొన్ని నెలల నుంచి జగన్ పార్టీ నేతలకు విడమరచి చెబుతున్నారు.

Update: 2026-10-16 07:22 GMT

వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత ప్రధానమో గత కొన్ని నెలల నుంచి జగన్ పార్టీ నేతలకు విడమరచి చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ లేచి కూర్చునే అవకాశం ఉంటుందని పార్టీ గ్రాఫ్ ఏ మాత్రం పెరిగినా అది బూస్టప్ అయి 2029 నాటికి ఫ్యాన్ గిర్రున తిరిగేందుకు ఆస్కారం కల్పిస్తుందని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. అంతే కాదు 2024 ఎన్నికల్లో వైసీపీ 40 శాతం ఓటు షేర్ సాధించిందని అందువల్ల పార్టీకి జనాదరణ ఉందని కూడా జగన్ అంచనా వేస్తున్నారు. ఇక గడచిన రెండున్నరేళలో కూటమి ప్రభుత్వం పట్ల జనాలలో అసంతృప్తి పెరిగిందని అది కూడా వైసీపీకి ప్లస్ అయి తీరుతుందని కూడా లెక్క వేస్తున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండా పోటీ చేయలాని జగన్ సూచిస్తున్నారు.

ఈ సారి కొత్త రూట్ :

అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ ఈసారి ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేరుగా తానే ఈ ప్రక్రియలో పాలు పంచుకుంటున్నారు. ప్రతీ జిల్లా నుంచి ప్రతీ సీటుకూ ఆశా వహులు అయిన ముగ్గురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసి తమకు పంపించాలని ఆయన కోరడం ఇందుకు కారణం. అదే సమయంలో పార్టీ తరఫున స్వయంగా చేయించుకున్న సర్వే నివేదికను దగ్గర ఉంచుకుని మరీ ఈ షార్ట్ లిస్ట్ లోని అభ్యర్ధులతో సరిపోల్చుతూ అంగ బలం అర్ధ బలంతో పాటు ప్రజా బలాన్ని బేరీజు వేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్ధులుగా ఈసారి వారికి ఉండాల్సిన అదనపు లక్షణాలను కూడా జత చేరుస్తూ అలాంటి వారినే బరిలోకి దించుతున్నారు.

అసలైన క్వాలిఫికేషన్ :

వైసీపీ అభ్యర్ధులకు అసలైన క్వాలిఫికేషన్ ఏమిటి అన్నది కూడా జగన్ తన చర్యల ద్వారా తెలియచేస్తున్నారు అని అంటున్నారు అది విధేయత. వైసీపీ తరఫున గెలిచిన వారు రేపు పార్టీని వీడి ఉండకుండా అట్టేబెట్టుకుని ఉండాలంటే వారు పార్టీకి కట్టుబడి ఉండాలని ఆ విధంగా ఎమోషన్ బాండేజ్ వారికి ఉందా లేదా అన్నది తరచి చూస్తున్నారు అని అంటున్నారు. అందుకే చాలా చోట్ల వైసీపీ ఇంచార్జిల బంధువులకు, అలాగే పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన వారికి వైసీపీ తప్ప మరో పార్టీ రాజకీయ భావజాలాన్ని ఇష్టపడని నేతలను ఏరి కోరి మరీ ఎంపిక చేస్తున్నారు. ఇలా ఎంపిక చేసిన వారికే బీ ఫారాలు దక్కుతున్నాయి.

గ్రౌండ్ లెవెల్ లో వర్కౌట్ :

ఎందుకంటే ఏపీలో రాజకీయం అయితే రెండుగా చీలిపోయింది. రెండు శిబిరాలు అయ్యాయి. ఇక 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన వారు అంతా కూటమికి జై కొట్టి ఫిరాయించారు. అందుకే ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ రకంగా ఎంపిక చేస్తున్నారు అని అంటున్నారు. దీని వల్ల భవిష్యత్తులో పార్టీకి మేలు జరుగుతుందని అంటున్నారు. కేవలం అంగబలం అర్ధ బలం ఉంటే సరిపోదని కూడా ఇపుడు వైసీపీలో అభ్యర్ధుల ఎంపిక తీరు చూస్తే అర్ధం అవుతోంది అని విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా స్థానిక సంస్థల విషయంలో వైసీపీ అధినాయకత్వం సీరియస్ గానే ఉంది. క్యాడర్ కూడా ఇపుడు దానిని అర్ధం చేసుకుని ఎంత మేరకు గ్రౌండ్ లెవెల్ లో వర్కౌట్ చేస్తుందన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News