ఏఐతో పోటీ పడుతున్న పాలిటిక్స్.. ఇంట్రస్ట్ ఉంటే లక్కు మీదే..!
నేటి యువత ఉద్యోగాలు, ఉపాధి వంటి అవకాశాల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు, జీవితంలో ఉద్యోగం సంపాదించడం లేదా ఉపాధి ఏర్పాటు చేసుకొని పదిమందికి ఉద్యోగ కల్పన చేయటం వంటివి ఒక ఆచరణాత్మక విధానం.;
నేటి యువత ఉద్యోగాలు, ఉపాధి వంటి అవకాశాల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు, జీవితంలో ఉద్యోగం సంపాదించడం లేదా ఉపాధి ఏర్పాటు చేసుకొని పదిమందికి ఉద్యోగ కల్పన చేయటం వంటివి ఒక ఆచరణాత్మక విధానం. వీటిని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే, ఇదే సమయంలో భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఏ విధంగా అయితే భవిష్యత్తును శాసిస్తుంది అని మనం భావిస్తున్నామో.. ఇప్పుడు భవిష్యత్తు రాజకీయాలు కూడా యువతను శాసిస్తాయి అనేది స్పష్టమవుతుంది.
ఏ మాత్రం రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉన్నా.. ఏమాత్రం ప్రజలకు సేవ చేయాలన్న ఆసక్తి ఉన్నా ఇప్పుడు యువతకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలు ఏవైనా, రాజకీయాలు ఎలా ఉన్నా.. యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించేందుకు ప్రస్తుతం రాబోయే రెండు మూడు సంవత్సరాలు ఆశాకిరణంలా అగుపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం నియోజకవర్గాలు పెరుగుతుండడమే. పార్టీలు కూడా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం.
ప్రస్తుతం టిడిపిని తీసుకుంటే మూడు తరాలకు ముందు ఉన్న నాయకులే మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. వీరిని ఇక వచ్చే ఎన్నికల నాటికి పక్కన పెట్టడం ద్వారా కొత్త తరానికి అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తోంది. తద్వారా టిడిపిలో యువతకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే సమయంలో వైసీపీలో కూడా యువతకు అవకాశాలు భారీగా దక్కనున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఆ స్థాయిలో పోటీ చేసేందుకు కానీ ఆ స్థాయిలో రాజకీయంగా పార్టీ తరఫున పని చేసేందుకు కానీ యువత అవసరం చాలా కనిపిస్తోంది. ఇక కమ్యూనిస్టుల్లోనూ కాంగ్రెస్ లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంది.
జెండానే మోయక్కర్లేదు..!
రాజకీయాలంటే కేవలం నియోజకవర్గాల్లో పోటీ చేయడమే కాదు.. ఎన్నికల రణరంగంలో దిగి విమర్శించుకోవడమే కాదు.. రాజకీయం అంటే పార్టీ తరఫున పని చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. వారికి జీతాలు ఉంటాయి. భత్యాలు ఉంటాయి. ఉదాహరణకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏ పార్టీ అయినా ఒక వ్యక్తిని నియమిస్తే అతనికి జీతం ఉంటుంది. అదేవిధంగా అలవెన్సులు కూడా ఇస్తారు. ఇక టీవీల్లో చర్చలు చేసేందుకు, పార్టీ తరఫున ప్రత్యర్థులపై విమర్శలు చేసేందుకు లేదా `సబ్జెక్ట్ టు సబ్జెక్టు` మాట్లాడేందుకు పార్టీ కొంతమందిని నియమిస్తుంది.
వీళ్ళందరూ రాజకీయ నాయకులే. కానీ ప్రత్యక్షంగా ప్రజల మధ్య ఉండకపోవచ్చు. వారికి కూడా పార్టీలు ప్రాధాన్యమిస్తాయి. ఇట్లా యువతకు ఉద్యోగాలు ఉపాధితో పాటు ప్రస్తుతం పెరుగుతున్న రాజకీయ విస్తృతిని(పొలిటికల్ ఎరా) పరిగణలోకి తీసుకుంటే రాజకీయంగా కూడా వారికి మంచి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమాత్రం ఆసక్తి ఉన్నా ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి మంచి పదవులు సాధించుకునేందుకు అవకాశం ఉంటుంది.