ప్రపంచంలోనే ఖరీదైన ట్రిప్.. టికెట్ ధర 7 కోట్లు.. ప్రత్యేకత ఏంటంటే?

మనలో కూడా చాలామంది సముద్ర విహారం చేస్తూ.. ప్రకృతిని ఆస్వాదించాలని ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు.;

Update: 2025-09-18 06:43 GMT

మనలో కూడా చాలామంది సముద్ర విహారం చేస్తూ.. ప్రకృతిని ఆస్వాదించాలని ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. అయితే ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడం వల్ల సామాన్యులు కాస్త వెనకడుగు వేస్తారు. కానీ ధనవంతులు, వ్యాపారవేత్తలుగా పేరుపొందిన వారు మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ.. తమ జీవితాన్ని విలాసవంతంగా గడిపేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ సముద్ర ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇందుకోసమే కొన్ని కంపెనీలు క్రూయిజ్ షిప్ అంటూ కొన్ని టూర్లను కూడా వేస్తూ ఉంటారు. అలా షిప్పులలో ప్రయాణించాలి అంటే ఒక్కొక్క టికెట్ ధర కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. పైగా ఇలాంటి లగ్జరీ షిప్పులలో అన్ని సౌకర్యాలు ఉంటాయి.

ఇప్పుడు తాజాగా అత్యంత ఖరీదైన లగ్జరీ క్రూయిజ్ నౌక.. ట్రిప్ కి సంబంధించి తమ ప్యాకేజీలను ప్రకటించింది. రీజెంట్ సెవెన్ సిస్ అనే సంస్థ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి లగ్జరీ క్రూయిజ్ యాత్రకు సంబంధించిన అన్ని వివరాలను తాజాగా తెలియజేసింది. వరల్డ్ ఆఫ్ స్ప్లెండర్ అనే పేరుతో ఈ లగ్జరీ యాత్రను 2027లో ప్రారంభించబోతున్నట్లు తెలియజేసింది. అయితే ఈ యాత్రలో ఒక్కో టికెట్ ధర సుమారు రూ .80 లక్షల నుంచి 7.3 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ క్రూయిజ్ షిప్ యాత్ర 140 రాత్రులు కొనసాగుతుందని.. అలాగే 45 దేశాల మీద వెళుతుందని.. 71 పోర్టులను కవర్ చేస్తూ ఈ ప్రయాణం ఉంటుందని తెలియజేసింది. ఈ లగ్జరీ సూట్ లో ప్రయాణించే వారికి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తామంటూ ఆ సంస్థ తెలియజేసింది. ప్రతి పోర్టులో కూడా ప్రయాణికుల కోసం ఒక స్పెషల్ గా కారు సిద్ధంగా ఉంటుందని, అందుకు ఒక డ్రైవర్ ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సూట్ లోపలే స్పా సహా అన్ని సదుపాయాలు కూడా కలవని, 4000 చదరపు అడుగుల విశాలమైన ప్రైవేట్ స్పేస్ కూడా కలదని తెలియజేసింది. అలాగే ఇందులో విమాన ప్రయాణం, లగ్జరీ హోటల్స్ లలో బస చేసేటువంటి సేవలు డ్రింక్స్, వైఫై, 24 గంటలు సర్వీస్ వంటి సేవలు కూడా ఉంటాయట.

ఈ క్రూయిజ్ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉండే మాయామి నుంచి న్యూయార్క్ వరకు ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణిస్తున్న క్రూయిజ్ ఆరు ఖండాలను దాటుతుంది. మాయామీ నుంచి బయలుదేరి.. లాస్ ఏంజెల్స్, సిడ్ని, సింగపూర్, భారత్ లోని కొన్ని ప్రముఖమైన నగరాలు (ముంబై, కొచ్చి, గోవా, మంగళూరు) వంటి ప్రాంతాల మీదుగా సాగనుంది. ఏది ఏమైనా ఈ యాత్ర ఖరీదు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది అని చెప్పవచ్చు.

Tags:    

Similar News