దీర్ఘాయుష్షు రహస్యం తిమింగలాల్లో ఉందా? వైరల్ క్లెయిమ్స్‌పై శాస్త్రీయ విశ్లేషణ
వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ ముచ్చట నిజమేనా? సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది? అసలు తిమింగలాల ఆయుష్షు రహస్యం ఏంటి? ఈ వైరల్ వార్తల వెనుక ఉన్న అసలు నిజానిజాలు, ఇప్పుడు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
"తిమింగలాల్లో ఉండే ఒక ప్రత్యేక ప్రోటీన్ వల్ల మనుషులు ఏకంగా 200 ఏళ్లు బతికేయొచ్చు" అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ ముచ్చట నిజమేనా? సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది? అసలు తిమింగలాల ఆయుష్షు రహస్యం ఏంటి? ఈ వైరల్ వార్తల వెనుక ఉన్న అసలు నిజానిజాలు, ఇప్పుడు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
తిమింగలాలపై సైంటిస్టుల కన్ను ఎందుకు?:
ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం బతికే జీవుల్లో 'బౌహెడ్ వేల్' అనే తిమింగలం ఒకటి. ఇది దాదాపు 200 ఏళ్లకు పైగా జీవిస్తుందని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. వీటికి క్యాన్సర్ రాకపోవడం, వీటి శరీరంలోని కణాలు చాలా నెమ్మదిగా ముసలితనానికి చేరడం, సొంతంగా DNA ను రిపేర్ చేసుకోవడం లాంటి అద్భుత శక్తులు ఉన్నాయి. ఇక అందుకే సైంటిస్టులు వీటిపై తెగ పరిశోధనలు చేస్తున్నారు.
నిజంగానే మనుషులు 200 ఏళ్లు బతుకుతారా?:
వైరల్ అవుతున్న వార్తలకు ముక్తసరిగా సమాధానం చెప్పాలంటే.. ప్రస్తుతానికి "లేదు" అనే అనాలి. ఇక తిమింగలాల ప్రోటీన్‌ను వాడి మనిషి ఆయుష్షును 200 ఏళ్లకు పెంచవచ్చని ఎక్కడా నిరూపణ కాలేదు. ఈ రీసెర్చ్‌లు అన్నీ ఇంకా ల్యాబ్‌లల్లో, ప్రారంభ దశలోనే ఉన్నాయి. కాబట్టి "వేల్ ప్రోటీన్ 200 ఏళ్ల లైఫ్" అనేది ప్రస్తుతానికి కేవలం ఒక పుకారు మాత్రమే.
ఇలాంటి వార్తలు ఎందుకు వైరల్ అవుతాయి?:
సైన్స్ ల్యాబ్‌లో జరిగే చిన్న చిన్న విషయాలను కొన్ని మీడియా సంస్థలు క్లిక్‌బైట్ హెడ్‌లైన్స్‌తో, కాస్త ఎక్కువ గా ప్రచారం చేస్తుంటాయి.ఇక భవిష్యత్తులో వచ్చే అవకాశాలను ఇప్పుడే జరిగిపోయినట్టుగా చూపించడం వల్లే ఇలాంటి తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతుంటాయి.
వృద్ధాప్యాన్ని ఆపడానికి జరుగుతున్న ప్రయత్నాలు:
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఎక్కువ కాలం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. సెల్ రీప్రోగ్రామింగ్ ద్వారా పాత కణాలను మళ్లీ కొత్తగా మార్చడం, బాడీలో పాడైపోయిన కణాలను సెనోలిటిక్స్ మందులతో తొలగించడం, DNA డ్యామేజ్‌ను తగ్గించే 'జీన్ థెరపీ' లాంటి వాటిపై శాస్త్రవేత్తలు గట్టిగానే కష్టపడుతున్నారు.
మనిషి గరిష్ట ఆయుష్షు ఎంత?:
అధికారిక రికార్డుల ప్రకారం భూమిపై అత్యంత ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఫ్రాన్స్‌కు చెందిన జీన్ కాల్మెంట్ 122 సంవత్సరాలు.ఇక మరి సైన్స్ ప్రకారం మనిషి సాధారణ బయోలాజికల్ పరిమితి 115 నుండి 125 ఏళ్లు మాత్రమే. ప్రస్తుతం సైన్స్ లక్ష్యం ఎప్పటికీ బతికే 'అమరత్వం' కాదు, బతికినంత కాలం రోగాలు లేకుండా 'ఆరోగ్యంగా' ఉంచడమే.
వందేళ్లు బతికేసే 'బ్లూ జోన్స్' సీక్రెట్:
జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సర్డీనియా వంటి కొన్ని ప్రాంతాల్లో జనాలు ఇప్పటికీ 100 ఏళ్లు ఈజీగా బతుకుతున్నారు. వీరి రహస్యం తిమింగలాల ప్రోటీన్ కాదు! ఎక్కువ కూరగాయలు తినడం, తక్కువ చక్కెర వాడటం, రోజువారీ నడక, తక్కువ ఒత్తిడి మరియు కుటుంబంతో సంతోషంగా గడపడమే వీరి దీర్ఘాయుష్షుకు అసలైన కారణాలు.
తిమింగలాలపై జరుగుతున్న పరిశోధనలు భవిష్యత్తులో వైద్య రంగానికి హెల్ప్ అవ్వచ్చు. కానీ, ప్రస్తుతానికి దీర్ఘాయుష్షుకు మించిన షార్ట్‌కట్ మందు లేదు. వందేళ్లు చురుగ్గా బతకాలి అంటే మనం తినే మంచి ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ప్రశాంతమైన నిద్ర మరియు హ్యాపీ లైఫ్ స్టైల్ మాత్రమే అసలైన రహస్యాలు.