‘ఒక్క మాట చెబితే సీఎం విజయ్ ఇంటికి వచ్చి డిప్యూటీ సీఎంను చేసేవారు’

‘‘నేను అనుకుంటే సీఎం విజయ్ ను కలవటం పెద్ద విషయమా? నేను కానీ ఒక్క మాట చెప్పి ఉంటే.. విజయ్ స్వయంగా నా ఇంటికి వచ్చి మరీ.. నాకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఉండేవారు.

Update: 2026-06-01 09:30 GMT

‘‘నేను అనుకుంటే సీఎం విజయ్ ను కలవటం పెద్ద విషయమా? నేను కానీ ఒక్క మాట చెప్పి ఉంటే.. విజయ్ స్వయంగా నా ఇంటికి వచ్చి మరీ.. నాకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఉండేవారు. ఇప్పుడు పదవులు కోసం చాలా మంది ఆయన చుట్టూ పరుగులు తీస్తున్నారు. నేను చెప్పింది పచ్చి నిజం. డీఎండీకే ఎప్పుడూ పదవుల కోసమో.. డబ్బుల కోసమో ఆశపడే పార్టీ కాదు. నమ్ముకున్న సిద్ధాంతాలకు.. కూటమి ధర్మానికి కట్టుబడి ఉండే పవిత్రమైన పార్టీ’’ ఈ వ్యాఖ్యలు తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారితే.. తమిళ రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారిలో ఈ వ్యాఖ్యల మీద పలు ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి. ఇవేమీ తెలియని వారు మాత్రం.. ఆమె అడిగతే తమిళనాడు ముఖ్యమంత్రి తన ఇంటికి వచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? అదెలా? అన్న సందేహాలకు గురవుతున్నారు

ఈ సందేహాలు తీరాలంటే కాస్త వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు ఒకప్పుడు తమిళ సినిమాల్లో అగ్ర హీరోల్లో ఒకరిగా వ్యవహరించిన విజయ్ కాంత్ అలియాస్ కెప్టెన్ ఉన్నారు కదా? ఆయన సతీమణే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె పేరు ప్రేమలత. ఆమె విజయ్ కాంత్ స్థాపించిన డీఎండీకే పార్టీకి ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆమె ఒక్కరే. అంటే.. ఆ పార్టీకి సింగిల్ ఎమ్మెల్యే.. అది కూడా ఆమె మాత్రమే ఉన్నారు. అయితే.. ఆమె పార్టీ డీఎంకే కూటమిలో ఉన్నారు.

మరి..ఆమె అడిగితే సీఎం విజయ్ ఇంటికి వెళ్లి మరీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? అంటే.. ఇవ్వొచ్చనే మాటే బలంగా వినిపిస్తుంది. ఎందుకుంటే..విజయ్ కాంత్ కుటుంబంతో సీఎం విజయ్ కు ఉన్న బంధం అలాంటిది. కానీ.. రాజకీయ పరంగా వారి భావజాలాలు వేరు. ఆమె డీఎంకే కూటమిలో ఉంటే.. విజయ్ తన సొంత పార్టీని మరే కూటమిలోనూ భాగస్వామిని చేయలేదు. అధికారానికి అవసరమైన ఎమ్మెల్యేల కోసం కొన్ని పార్టీలతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్.. ఆ తర్వాత తన ప్రభుత్వానికి తగిన బలం ఉందన్న విషయాన్ని అసెంబ్లీలో నిరూపించుకునే సమయంలో.. ప్రేమలత విపక్ష డీఎంకేతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారే తప్పించి.. ఓటింగ్ లో పాల్గొనలేదు. తన వ్యాఖ్యలతో ఇప్పటివరకు వస్తున్న ఊహాగానాలకు ఆమె తెర దించారని చెబుతున్నారు. విజయ్ కాంత్ కుటుంబంతో సీఎం విజయ్ కు ఉన్న అనుబంధం నేపథ్యంలో కెప్టెన్ సతీమణి కం డీఎండీకే ప్రధాన కార్యదర్శి అధికారపక్షంలోకి వెళతారని.. తాను ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఉన్న డీఎంకే కూటమి నుంచి బయటకు వస్తారన్న ప్రచారానికి తెర దించారు. డీఎండీకే మద్దతు ఇవ్వనప్పటికి కాంగ్రెస్.. ఇతర పార్టీల మద్దతుతో తమ ప్రభుత్వానికి తగిన బలం ఉందన్న విషయాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవటం తెలిసిందే.

సీఎం విజయ్ తన సినీ కెరీర్ ప్రారంభంలో విజయ్ కాంత్ ఎంతో సాయం చేశారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయ్ కాంత్ నటించటమే కాదు.. విజయ్ హీరోగా నిలదొక్కుకోవటానికి తన సింథూరపొండి సినిమాలో తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. విజయ్ కాంత్ కుటుంబంపై విజయ్ కు ఎంతో గౌరవం ఉందని చెబుతారు. ఇదే అంశాన్ని తనదైన శైలిలో ప్రేమలత ప్రస్తావించారని చెప్పాలి. ఆమె తాజా వ్యాఖ్యల్లో ఒకఆసక్తికర కోణం ఉంది. అదేమంటే..తమ కుటుంబంతో సీఎం విజయ్ ఎంతో గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తారని చెప్పటమే కాదు.. అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ.. పదవుల కోసం ఆశ పడకుండా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా తాను ఉన్న కూటమిలోనే కొనసాగుతానన్న విషయాన్ని స్పష్టం చేసినట్లైంది.

Tags:    

Similar News