ఆ అసెంబ్లీ బరిలో నుంచి వీరప్పన్ కుమార్తె పోటీ
కృష్ణగిరి ఎంపీ స్థానానికి నామ్ తమిళర్ కట్చి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.అయినా సానుకూల ఫలితాన్ని సొంతం చేసుకోలేకపోయారు.;
తమిళనాడులో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి. మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లుగా అధికార ప్రకటన వెలువడింది. గడిచిన కొన్నేళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న ఆమె తొలుత పీఎంకే పార్టీలో చేరగా.. తర్వాతి కాలంలో బీజేపీలో చేరటం తెలిసిందే. 2020లో బీజేపీలో చేరిన ఆమె ఆ పార్టీ బీసీ మోర్చా రాష్ట్రస్థాయి పదవిని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆమె నామ్ తమిళర్ కట్చి పార్టీలో చేరారు.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా నిలిచిన వీరప్పన్ 2004లో పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించటం తెలిసిందే. తొలినుంచి ప్రజాజీవితంలో ఉన్న వీరప్పన్ కుమార్తె తన తండ్రి పేరును రాజకీయాల్లో కాకుండా ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగిస్తానని చెబుతుంటారు. తన తండ్రి చేసిన చట్టవిరుద్ధమైన పనులను సమర్థించనని చెబుతుంటారు. ప్రజలకు సేవ చేయటమే తన లక్ష్యమని చెప్పిన ఆమె తొలిసారి 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు.
కృష్ణగిరి ఎంపీ స్థానానికి నామ్ తమిళర్ కట్చి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.అయినా సానుకూల ఫలితాన్ని సొంతం చేసుకోలేకపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కె.గోపీనాథ్ విజయం సాధించారు. అన్నాడీఎంకే అభ్యర్థి జయప్రకాష్ పై ఆయన 1,92,486 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వీరప్పన్ కుమార్తె విద్యారాణి 1,07,083 ఓట్లను సాధించారు. ఆమెకు మొత్తం పోలై ఓట్లలో 9.18 శాతం ఓట్లు రావటం గమనార్హం. ఈ ఎన్నికల్లో ఆమె నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి నిలిచారు.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యా రాణి తాజా ఎన్నికల్లో మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి ఆమె ఆసక్తికర కారణాన్ని ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఆమె అభ్యర్థిత్వాన్ని ఫిబ్రవరిలోనే స్పష్టత వచ్చినప్పటికి అధికారికంగా మాత్రం తాజాగా వెల్లడైంది. తన సొంతూరు మెట్టూరుగా ఆమె చెబుతున్నారు. తన తండ్రి వీరప్పన్ స్మ్రతి చిహ్నం ఉండటంతో ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లుగా ఆమె చెబుతున్నారు. అయితే.. ఇదే నియోజకవర్గం నుంచి ఆమె తల్లి కూడా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా.. ఇప్పటివరకు అధికారికంగా మాత్రం వెల్లడి కాలేదు. ఆమె తల్లి ముత్తులక్ష్మి ప్రస్తుతం టీవీకే (తమిళగ వాల్వూర్ ఇమాయి కట్చి)కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తల్లీ, కూతుళ్లు ఇద్దరు రాజకీయ, సిద్ధాంతపరమైన భిన్న భావజాలంతో ఉండటం కనిపిస్తుంది. వ్యక్తిగతంగా కూడా వీరిద్దరి మధ్య సరైన సంబంధాలు లేవు. గడిచిన కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఎప్పుడైతే కూతురు బీజేపీలో చేరిందో అప్పటి నుంచి అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. భిన్న రాజకీయ భావజాలాలతో వారి ప్రయాణం సాగుతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఈసారి ఎన్నికల్లో ముఖాముఖి తలపడతారన్న ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2006లో ముత్తు లక్ష్మి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే.