జీవీఎంసీలో వైసీపీ బీసీ కార్డు !
మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు.
మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. అయితే వైసీపీ ఇక్కడే వ్యూహాత్మకంగా తన అభ్యర్ధిని ఖరారు చేసింది. ఓసీ మహిళలకు అవకాశం ఉన్నప్పటికీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తమ పార్టీ వారికి పెద్ద పీట వేస్తోంది అన్నది తెలియచేసింది అని అంటున్నారు. ఇక 2021లో కూడా ఓసీ జనరల్ కి ఈ సీటు కేటాయిస్తే బీసీ మహిళకు వైసీపీ ఆనాడు ప్రాధాన్యత ఇచ్చింది అని ఆ పార్టీ నేతలు మరోసారి ప్రచారం చేసుకుంటున్నారు. తాము బీసీ పక్షపాత విధానాలను అమలు చేస్తున్నామని కూడా చెబుతున్నారు.
ధీటైన అభ్యర్థినే :
ఇక విశాఖ మేయర్ సీటు విషయంలో వైసీపీ అనేక రకాలుగా ఆలోచించింది. అయితే అవన్నీ బీసీ వర్గం చుట్టూనే తిరిగాయి. ఒక దశలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సతీమణిని కూడా పోటీకి పెట్టాలని చూశారు. అయితే ఓసీ కంటే బీసీలకే ఇంపార్టెంట్ ఇవ్వడం ద్వారా కూటమి మీద సామాజిక రాజకీయ పరమైన ఒత్తిడి తేవాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. అందుకే అందరికీ పరిచయం ఉన్న ఎమ్మెల్సీ ఏపీ వైసీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అయిన వరుదు కళ్యాణిని తెచ్చి రేసులో నిలబెట్టారని విశ్లేషిస్తున్నారు.
మెట్టిల్లుగానే :
ఇక వరుదు కళ్యాణి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. ఆమె మెట్టిల్లు అనకాపల్లి. ఆ విధంగా ఆమె పక్కా లోకల్ గానే ఉన్నారు. దాంతో లోకల్ కార్డుతో కూడా వైసీపీ కూటమిని సవాల్ విసిరినట్లు అయింది అని అంటున్నారు. ఇక ఆమె కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. జీవీఎంసీ పరిధిలో ఆ సామాజిక వర్గం జనాభా ఎక్కువగానే ఉంది. ప్రత్యేకించి అనకాపల్లిలో ఆరు డివిజన్లలో అధిక బలం ఉంది. దాంతో పాటు విశాఖ ఉత్తర నియోజకవర్గం, పెందుర్తి, పశ్చిమ నియోజకవర్గంలో సామాజిక వర్గం బలం ఉంది. దాంతో సామాజిక సమీకరణలు కూడా సరిపోల్చుకుని మరీ వరుదు కళ్యాణిని రంగంలోకి దించారని అంటున్నారు.
టీడీపీ నుంచి ఎవరు :
ఈ క్రమంలో టీడీపీ నుంచి ఎవరు అన్న చర్చ ముందుకు వస్తోంది. టీడీపీలో అయితే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు బంధువు అయిన పక్కుర్తి మురళి అన్న పారిశ్రామికవేత్త సతీమణిని బరిలోకి దించుతారు అని ప్రచారం సాగుతోంది. ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. అయితే ఆమె భర్త యాదవ సామాజిక వర్గం కాబట్టి బీసీ ప్లస్ కమ్మ రెండు ఈక్వేషన్స్ పనిచేస్తాయని లెక్క వేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం బీసీలకే పెద్ద పీట అంటూ ముందుకు రావడంతో టీడీపీ వైపు నుంచి ఏమైనా మార్పు ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
కలసికట్టుగా నిలిస్తే :
ఇక కూటమి పార్టీలు అన్నీ కలసికట్టుగా నిలిస్తే జీవీఎంసీ కూటమి పరం అవుతుందనడంలో సందేహం లేదు. ఇక ఆశావహులు అనేకమంది మేయర్ సీటు మీద కర్చీఫ్ వేశారు. రిజర్వేషన్ వల్ల వారంతా సైడ్ అయ్యారు. ఇపుడు వారు పూర్తి ఉత్సాహం తెచ్చుకుని సమర భేరీ మోగించాల్సి ఉంటుంది. వైసీపీ అయితే కూటమి రెండేళ్ళ పాలనలో విశాఖలో తాగు నీటి సమస్య కూడా వచ్చిందని నిత్యావసరాల ధరలు పెరిగాయని, విశాఖలో భూ కబ్జాలు వంటివి ఎంచుకుని జనంలోకి వెళ్తోంది. విశాఖ సమగ్ర అభివృద్ధి తమ అజెండా అని టీడీపీ గట్టిగా చెబుతోంది.