తండ్రి కాంస్యం.. కొడుకు రజతం.. స్వర్ణానికి చిన్న "స్క్రాచ్"

ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాకు చెందిన ఈ 22 ఏళ్ల యువ వెయిట్‌లిఫ్టర్.. 79 కిలోల విభాగంలో రజత పతకం సాధించి గట్టి షాకే ఇచ్చాడు.

Update: 2026-07-28 10:10 GMT

మనం ఇంట్లో బియ్యం బస్తా ఎత్తడానికే నడుము పట్టుకుని హడావుడి చేస్తాం. అలాంటిది ఏకంగా 330 కిలోల బరువును అవలీలగా ఎత్తేసి కామన్వెల్త్ వేదికపై భారత్ పేరును నిలబెట్టేశాడు మన తెలుగు కుర్రాడు వల్లూరి అజయ్ బాబు. ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాకు చెందిన ఈ 22 ఏళ్ల యువ వెయిట్‌లిఫ్టర్.. 79 కిలోల విభాగంలో రజత పతకం సాధించి గట్టి షాకే ఇచ్చాడు.

తండ్రి రికార్డుకు "అప్‌గ్రేడ్" వేరియంట్!

ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఇది కేవలం పతకం కథ కాదు, పక్కా "ఫ్యామిలీ బిజినెస్".. 2010 కామన్వెల్త్ గేమ్స్ లో తండ్రి వల్లూరి శ్రీనివాసరావుగారు కాంస్య పతకం ఎత్తుకొచ్చారు. ఇప్పుడు కొడుకు అజయ్ బాబు ఏకంగా రజత పతకం సాధించాడు. అంటే ఇంట్లో మెడల్ రంగు మారింది గురూ ఒకే క్రీడలో తండ్రి కొడుకు ఇద్దరూ కామన్వెల్త్ పతకాలు కొట్టడం చూస్తుంటే, వీళ్ళ ఇంట్లో ఏమైనా టిఫిన్‌తో పాటు వెయిట్లు ఎత్తే ప్రాక్టీస్ కూడా చేపిస్తారేమో అని క్రీడా పండితులకు అనుమానం వస్తోంది.

లెక్కలు గట్టిగా ఉన్నాయి కానీ..!

అజయ్ బాబు చేసిన ఈ "వెయిట్" విన్యాసాలు చూస్తే స్నాచ్ విభాగంలో 149 కిలోలు.. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 181 కిలోలు.. మొత్తం 330 కిలోలు ఎత్తిపడేశాడు. బంగారు పతకం కొద్దిలో మిస్ అయ్యిందని మనోడికి చిన్న నిరాశ ఉందట. "అయ్యో స్వర్ణం పోయిందే" అని అజయ్ బాబు బాధపడుతుంటే.. మనం మాత్రం "నాయనా! 330 కిలోలు ఎత్తి రజతం తెచ్చావ్.. అంతకంటే ఏం కావాలి సామీ?" అని మురిసిపోతున్నాం.

విజయం ఎవరికి అంకితం?

పతకం సాధించాక అజయ్ బాబు మాట్లాడుతూ.. ఈ విజయాన్ని తన తండ్రికి, కోచ్‌లకు, దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. "కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించడానికి విజయనగరం నుంచి కామన్వెల్త్ దాకా వెళ్లక్కర్లేదు, అజయ్ బాబులా బరువులు ఎత్తితే చాలు" అని సోషల్ మీడియాలో యువత కామెంట్లు పెడుతున్నారు.

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ నుంచి మరో ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టర్ తయారైపోయాడోచ్! తదుపరి టార్గెట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా.. నెక్స్ట్ టైమ్ 'గోల్డ్' కొట్టి తండ్రి రికార్డును పూర్తిగా అప్‌డేట్ చేయడమే..

Tags:    

Similar News