అమెరికా వెళ్తున్నారా? రిటర్న్ టికెట్ కంటే ‘రిటర్న్ ప్లాన్’ ముఖ్యం బాసూ..!

అమెరికా పౌరసత్వ , ఇమ్మిగ్రేషన్ సేవలు (యూఎస్.సీఐఎస్) సంస్థ తాజాగా విడుదల చేసిన పాలసీ గైడ్‌లైన్స్ చూస్తుంటే.. గ్రీన్ కార్డ్ కోసం క్యూలో ఉన్న విదేశీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Update: 2026-05-22 17:25 GMT

ఒకప్పుడు "అమెరికా వెళ్లామా.. అక్కడ చదువు లేదా ఉద్యోగంలో జాయిన్ అయ్యామా.. గ్రీన్ కార్డ్ కొట్టేసి సెటిల్ అయిపోయామా!" అన్నట్టు ఉండేది ముచ్చట. కానీ ఇకపై ఆ ముచ్చట్లకు బ్రేకులు పడనున్నాయి. అమెరికా వెళ్లేవారి కలల మీద ట్రంప్ సర్కార్ గట్టి ముద్రే వేసింది. "టెంపరరీగా వచ్చావ్ కదా బాబూ.. నీ పని పూర్తి కాగానే లగేజ్ సర్దుకుని మీ ఊరికి రిటర్న్ టికెట్ బుక్ చేసుకో!" అంటూ కొత్త పాలసీతో షాకిచ్చింది. అమెరికా పౌరసత్వ , ఇమ్మిగ్రేషన్ సేవలు (యూఎస్.సీఐఎస్) సంస్థ తాజాగా విడుదల చేసిన పాలసీ గైడ్‌లైన్స్ చూస్తుంటే.. గ్రీన్ కార్డ్ కోసం క్యూలో ఉన్న విదేశీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

'అడ్జస్ట్‌మెంట్' ఇక కుదరదు.. రూట్ మార్చిన యూఎస్.సీఐఎస్

ఇప్పటివరకు అమెరికాలో ఉంటూనే వీసా స్టేటస్‌ మార్చుకుని.. అక్కడే తిష్టవేసి "అడ్డస్ట్ మెంట్ ఆఫ్ స్టేటస్" (ఏఓఎస్) ద్వారా గ్రీన్ కార్డ్ సంపాదించడం చాలామందికి ఒక లూప్‌హోల్‌లా ఉపయోగపడేది. కానీ ఇకపై ఆ ఆటలు సాగవని యూఎస్.సీఐఎస్ తేల్చిచెప్పింది. "ఏదో అత్యంత అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప.. అమెరికాలో ఉంటూ స్టేటస్ మార్చుకుంటామంటే కుదరదు. రూల్స్ ప్రకారం మీ దేశానికి వెళ్లి, అక్కడి అమెరికన్ కాన్సులేట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి" అని యూఎస్.సీఐఎస్ తాజాగా ఓ నోట్ లో స్పష్టం చేసింది.

అంటే.. అమెరికాలో ఉంటూ  "ఇంకో రెండేళ్లలో ఎలాగోలా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది.. ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు" అని రిలాక్స్ అవుతున్న మన దేశీ విద్యార్థులకు ఇది ఒక రకమైన హెచ్చరికే. అలాగే విజిటర్ లేదా టూరిస్ట్ వీసాతో వెళ్లి "అక్కడికి వెళ్లాక ఏదో ఒక లాయర్‌ని పట్టుకుని రూట్ మారుద్దాం" అనుకునేవారికి ఇది డైరెక్ట్ నో-ఎంట్రీ బోర్డు లాంటిదే. విజిట్ అంటే విజిట్ మాత్రమే.. వీసా గడువు చూసుకుని కలలు కనండి అని పరోక్షంగా చెప్పకనే చెప్పింది వలసల విభాగం.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది: జాక్ కాహ్లర్

ఈ కొత్త పాలసీపై యూఎస్.సీఐఎస్ ప్రతినిధి జాక్ కాహ్లర్ మాట్లాడుతూ.. తమ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. "మేమేదో కొత్త చట్టాలు తేవడం లేదు. అసలు చట్టం మొదట ఎలా రాశారో.. ఇప్పుడు దాన్ని అలాగే కచ్చితంగా అమలు చేస్తున్నాం. అమెరికాకు తాత్కాలికంగా వచ్చిన వారు తమ పని పూర్తి కాగానే స్వదేశానికి తిరిగి వెళ్లాలి. ఇక్కడే ఉండి గ్రీన్ కార్డ్ మార్గాలు వెతకడం.. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మేనేజ్ చేయడం చట్టం ఉద్దేశం కాదు" అని క్లారిటీ ఇచ్చారు.

అమెరికన్ డ్రీమ్‌కు ఇంటర్వెల్.. సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం..

ఈ వార్త బయటకు రావడమే ఆలస్యం.. సోషల్ మీడియాలో నెటిజన్లు, ముఖ్యంగా మన తెలుగు తమ్ముళ్లు మీమ్స్, సెటైర్లతో రెచ్చిపోతున్నారు. "ఇకపై అమెరికా వెళ్లేవారికి రిటర్న్ టికెట్ కంటే.. రిటర్న్ ప్లాన్ ముఖ్యం బాసూ!" అని ఒకరు కామెంట్ చేయగా.. హాలీవుడ్ సినిమా రేంజ్‌లో గ్రాండ్‌గా మొదలైన అమెరికన్ డ్రీమ్.. ఇప్పుడు ఎంబసీ క్యూ లైన్ దగ్గరే ఇంటర్వెల్ పడింది! అంటూ మరికొందరు ట్రోల్స్ వేస్తున్నారు. "అమెరికా వెళ్లాక రూట్ వెతుక్కుందాం అనుకునే రోజులు పోయాయి.. ఇప్పుడు వీసాతో పాటే ఒక లాయర్‌ని కూడా బుక్ చేసుకోవాలేమో!" అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.

భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులపైనే పంజా?

అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని లోపాలను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. విమర్శకులు మాత్రం ఇది వలసదారులను మానసికంగా వేధించడమే అంటున్నారు. ఈ కొత్త పాలసీ వల్ల అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, హెచ్-1బి ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మొత్తానికి "అమెరికా వెళ్లాక చూద్దాంలే" అనుకునే బ్యాచ్‌కి.. "వెళ్లే ముందే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకోండి.. లేదంటే రిటర్న్ టికెట్ రెడీగా ఉంటుంది" అనే గట్టి సందేశాన్ని పంపింది యూఎస్.సీఐఎస్..

Tags:    

Similar News