బానిసత్వపు శాంతి మాకు అక్కర్లేదు... ట్రంప్ కి వెనిజులా అధ్యక్షుడి స్ట్రాంగ్ రిప్లై

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్.. తనను తాను ప్రపంచ శాంతి దూతగా అభివర్ణించుకుంటున్నారనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-12-02 05:27 GMT

మాకు శాంతి అవసరమే...కాని ఆంక్షలతో బెదిరింపులతో కూడిన శాంతి మాత్రం అక్కర్లేదు. అది మన హక్కుగా ఉండాలి, మన ఆత్మగౌరవానికి సంకేతంగా ఉండాలి అంటూ వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మధురో కార్కస్ లో తన వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో ప్రకటించారు. దేశంలో కొన్నివారాలుగా యూఎస్ సైనిక చర్యల నేపథ్యంలో మధురో సైనిక కవాతు అనంతరం మాట్లాడుతూ...బలవంతపు రాజకీయ మార్పును దేశం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టీకరించారు. ఉన్నఫళాన పదవికి రాజీనామా చేసి ,దేశం వదలని వెళ్లిపోవాలి...అలాగైతే నీకు నీ కుటుంబానికి క్షేమం...అంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు మధురోకు వారం రోజుల గడువుతో . పవర్ ఫుల్ అల్టిమేటం జారీ చేశారు. శుక్రవారంతో ఆ గడువు ముగుస్తున్న నేపథ్యంలో దేశప్రజల సమూహాన్ని ఉద్దేశించి మధురో భావోద్వేగంతో ప్రసంగించారు..

మధురోతో ట్రంప్ ఫోన్ లో చాలా కఠినంగా సంభాషించినట్లు తెలుస్తోంది. నేను నా కుటుంబం దేశం వదలి పోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇవీ నా డిమాండ్లు అని కొన్నింటిని ట్రంప్ ముందుంచినా...అతను నిర్దాక్షిణ్యంగా వాటిని ఖాతరు చేయక...ఖాళీ చేసి వెళ్ళిపోతే నీకు నీ కుటుంబానికి మంచిది అని వార్నింగ్ ఇచ్చారు. అయితే మధురో దీనికి తలొగ్గక తమ డిమాండ్లను తెలిపారు. అధికార పదవి నుంచి తప్పుకున్నా తనకు ఆర్మీపై నియంత్రణ ఉండితీరాలన్నది మధురో ప్రధాన డిమాండ్. అలాగే అవినీతి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణ, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి వందమందికి పైగా వెనిజులా అధికారులపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలని కోరారు. అయితే దీనికి ట్రంప్ ఏమాత్రం స్పందించలేదు. వెనిజులియన్ గగన స్థలాన్ని మూసివేసినట్లు ట్రంప్ ప్రకటించిన తర్వాత మరోసారి మధురో కాల్ చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు..

అయితే వైట్ హౌస్ ట్రంప్ ఫోన్ బెదిరింపును ఔననలేదు అలాగని కాదనలేదు. మరోపక్క ట్రంప్ మిలటరీ ఒత్తిడిని పెంచుతున్నట్లు తెలుస్తోంది. వెనిజులా నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న నౌకలు వాషింగ్టన్ లోని బైపార్టిసన్ సెక్యూరిటీ వద్ద ఆగిపోయిన నేపథ్యంలో సముద్ర మార్గం, గగనతలపు రాకపోకలకు సంబంధించి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ లేథల్ ఆపరేషన్ దాడుల్లో దాదాపు 80 మంది మరణించినట్లు సమాచారం..

తనను అధికారం నుంచి తొలగించి..అపారమైన వెనిజుల చమురు నిల్వల్ని చేజిక్కించుకునేందుకే ట్రంప్ పన్నాగం పన్నుతున్నట్లు వెనిజులా అధ్యక్షుడు మధురో ప్రకటించారు. ఒపెక్ కు రాసిన ఉత్తరంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ...ప్రపంచంలో కల్లా అతి పెద్ద చమురు నిల్వలున్న వెనిజులాను సైనిక దాడుల ద్వారా, అధికార మార్పిడి ద్వారా హస్తగతం చేసుకోవాలని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వెనిజులా నేషనల్ అసెంబ్లీ అమెరికా సైనిక దాడులపై సొంతంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సైనిక దాడుల్లో వెనిజులా పౌరుడు మరణించినట్లు ప్రకటించింది. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కార్టగినాలో రాజకీయ చర్చలు నిర్వహించాల్సిందిగా ఆహ్వానించారు. అయితే కార్కస్ నుంచి గానీ, వాషింగ్టన్ నుంచి గానీ ఎలాంటి స్పందన వెలువడలేదు.

Tags:    

Similar News