రష్యాతో డీల్.. ట్రంప్ కు సెగ రేపుతున్న సెనేటర్లు !
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 9న కుదుర్చుకున్న ఒప్పందం మీద సెనేటర్లు సెగలు రేపుతున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 9న కుదుర్చుకున్న ఒప్పందం మీద సెనేటర్లు సెగలు రేపుతున్నారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ఆరుగురు రిపబ్లికన్లు, ఆరుగురు డెమోక్రాట్లతో కూడిన 12 మంది సెనేటర్లు ట్రంప్ కు నేరుగా లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు అమెరికాలో కలకలం రేపుతున్నది.
రష్యా అమెరికాతో పాటు ఇతర దేశాలకు డీజిల్ సరఫరా గురించి ట్రంప్ ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం రష్యా తక్షణమే 3 లక్షల టన్నులు, నవంబర్ లో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత 10 లక్షల టన్నులు ఇలా మొత్తం వచ్చే 2027 ఏప్రిల్ వరకు 4.8 మిలియన్ మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 36 మిలియన్ బ్యారెల్స్ సరఫరా చేయాలి.
దీనికి అనుగుణంగా అమెరికా ట్రెజరీ డిపార్ట్ మెంట్ జనరల్ లైసెన్స్ 135 జారీ చేసింది. రష్యా డీజిల్ ఎగుమతుల మీద ఉన్న ఆంక్షలను 2027 ఏప్రిల్ 7 వరకు ఎత్తేసింది. అయితే ఇది 2022 చట్టం ఉల్లంఘన అని, దీని ప్రకారం రష్యా ఉత్పత్తుల దిగుమతులు నిషేధించబడ్డాయి అని సెనేటర్లు వాదిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకుని నాటో మిత్రదేశాలకు ముప్పు తగ్గేవరకు ఈ నిషేధం కొనసాగలని పేర్కొన్నారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కాంగ్రెస్ తో సంప్రదింపులు లేకుండా, అవసరమైన జస్టిఫికేషన్ ఇవ్వకుండా ఆంక్షలు ఎత్తేశారని అంటున్నారు.
ఈ నిషేధం ఎత్తివేయడం మూలంగా అమెరికాకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా, మిత్రదేశాలు, ఉక్రెయిన్ కు ద్రోహం చేసినట్లు అవుతుందని, రష్యాకు ఆదాయం పెరిగితే యుద్దం ఇంకా కొనసాగడం మూలంగా అమెరికా భద్రతా ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని వాదిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దీనిని ‘పుతిన్ కు బహుమతి. యుద్దాన్ని పొడిగించే పెట్టుబడిగా’ వర్ణించడం విషేషం.
ఇది ఉక్రెయిన్ ను రక్షించే విధానానికి విరుద్దం అని, నైతిక మరియు వ్యూహాత్మక ద్రోహం అని అంటున్నారు. అమెరికాలో ధరల తగ్గింపు కోసం ఈ ఒప్పందం అని ట్రంప్ వాదించడం తప్పు అని, ఇంత చిన్న పరిమాణం మూలంగా అమెరికాకు పెద్దగా ఉపశమనం కలగదు అని, అమెరికా రవాణ రంగం రోజుకు 2.94 మిలియన్ బారెల్స్ ఉపయోగిస్తుందని, దానితో పోల్చుకుంటే ఈ సరఫరా తక్కువ మొత్తం అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెనేటర్ల లేఖ వ్యవహారం ఏ పరిస్థితులకు దారి తీస్తుందో వేచిచూడాలి.