అమెరికా నౌకలను ముంచేస్తాం జాగ్రత్త.. రష్యా హెచ్చరిక

ట్రంప్ తో కొరివితో తలగోక్కుంటున్నాడు. అగ్రరాజ్యపు బలుపును ప్రదర్శిస్తున్నారు. ఏకంగా బలమైన రష్యాతో కయ్యానికి కాలుదువ్వుతున్నాడు.;

Update: 2026-01-08 06:31 GMT

ట్రంప్ తో కొరివితో తలగోక్కుంటున్నాడు. అగ్రరాజ్యపు బలుపును ప్రదర్శిస్తున్నారు. ఏకంగా బలమైన రష్యాతో కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. రష్యాకు వెళ్లే చమురు నౌకను సీజ్ చేసేసి సవాల్ చేశారు. దీనికి రష్యా కూడా ధీటుగా స్పందిస్తోంది.

అట్లాంటిక్‌ మహాసముద్రం సాక్షిగా అగ్రరాజ్యం అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. రష్యా జెండాతో ప్రయాణిస్తున్న వెనెజువెలా చమురు నౌకను అమెరికా బలగాలు సీజ్‌ చేయడంతో ఈ వివాదం ఒక్కసారిగా రాజుకుంది. ఈ ఘటనపై వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా రష్యాకు చెందిన కీలక చట్టసభ్యుడు ఏకంగా యుద్ధ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.

ఏం జరిగింది?

ఐస్‌లాండ్‌ దక్షిణ తీరానికి సుమారు 190 మైళ్ల దూరంలో ‘మ్యారినెరా’ (పాత పేరు బెల్లా-1) అనే రష్యా చమురు నౌకను అమెరికా కోస్ట్‌ గార్డ్‌ సీజ్‌ చేసింది. హెలికాప్టర్ల ద్వారా మెరైన్‌ సిబ్బంది నౌకపైకి దిగి, అక్కడి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు బ్రిటన్ కూడా సహకరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను అమెరికా రక్షణ శాఖ విడుదల చేసింది.

రష్యా ఘాటు స్పందన

ఈ పరిణామాలపై రష్యా చట్టసభ్యుడు అలెక్సీ జురావ్లెవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఏం చేసినా శిక్ష పడదు అన్న అతివిశ్వాసంతో అమెరికా ప్రవర్తిస్తోంది. దీనికి తగిన ప్రతీకారం తప్పదు అని హెచ్చరించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే అవసరమైతే టార్పిడోలతో దాడి చేసి అమెరికా కోస్ట్‌ గార్డ్‌ నౌకలను సముద్రంలో ముంచేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం తన పరిధి దాటి ప్రవర్తిస్తోంది. అంతర్జాతీయ జలాల్లో మా నౌకలను అడ్డుకుంటే సహించేది లేదు అంటూ రష్యా ఘాటు వార్నింగ్‌ ఇచ్చింది.

అమెరికా వాదన

తమ జాతీయ భద్రతను కాపాడుకోవడానికే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించడంలో భాగంగానే ‘మ్యారినెరా’తో పాటు జెండా లేని ‘సోఫియా’ అనే మరో నౌకను కూడా సీజ్‌ చేసినట్లు తెలిపింది. రష్యా దళాలు సమీపంలో ఉన్నప్పటికీ ఈ ఆపరేషన్‌ను చేపట్టడం గమనార్హం.

యుద్ధ మేఘాలు… ప్రపంచానికి ఉత్కంఠ

ప్రస్తుతం ఉత్తర అట్లాంటిక్‌ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రష్యా హెచ్చరికల నేపథ్యంలో అమెరికా తన తదుపరి అడుగు ఎలా వేస్తుందన్నది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ వివాదం ఎటు దారి తీస్తుందన్నది అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారింది.




Tags:    

Similar News