అమెరికా ‘గ్రీన్ కార్డ్’ గేటు మూసేస్తోందా? 8 టెక్ దిగ్గజాలపై చర్య వెనుక అసలు వ్యూహం ఇదే..

అమెరికా వెళ్లి ఉద్యోగం చేయడం.. అక్కడే స్థిరపడాలని కలలు కనడం.. ఏళ్ల తరబడి కష్టపడి గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురుచూడడం.. ఎన్నో భారతీయ కుటుంబాల జీవితాల్లో ఇది ఒక సాధారణ స్వప్నం.

Update: 2026-10-08 16:48 GMT

అమెరికా వెళ్లి ఉద్యోగం చేయడం.. అక్కడే స్థిరపడాలని కలలు కనడం.. ఏళ్ల తరబడి కష్టపడి గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురుచూడడం.. ఎన్నో భారతీయ కుటుంబాల జీవితాల్లో ఇది ఒక సాధారణ స్వప్నం. కానీ ఇప్పుడు ఆ కలల దారిలోనే అమెరికా కొత్త అడ్డంకులు పెడుతోంది. మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, టాటా, విప్రో వంటి దిగ్గజ సంస్థలపై పెర్మ్ సర్టిఫికేషన్‌ సస్పెన్షన్‌ నిర్ణయం.. కేవలం కంపెనీలకు వచ్చిన షాక్‌ కాదు.. అమెరికాలో తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశపడుతున్న వేలాది మంది భారతీయ టెక్‌ ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టించే పరిణామం. ఉద్యోగం ఉంది.. నైపుణ్యం ఉంది.. కానీ రేపటి శాశ్వత నివాసంపై మాత్రం అనిశ్చితి.. ఇదే ఇప్పుడు అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణుల ముందున్న అసలు ప్రశ్న.

తాజాగా మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌, ఇన్ఫోసిస్‌, టాటా, విప్రో, హెచ్‌సీఎల్‌, కాగ్నిజెంట్‌, క్యాప్‌జెమినీ సంస్థలను అమెరికా పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (పీఈఆర్ఎం) కార్యక్రమం నుంచి సస్పెండ్ చేయడం కేవలం మరో వీసా నిబంధన మార్పుగా చూడలేం. ఇది అమెరికా టెక్‌ ఉద్యోగ మార్కెట్‌, హెచ్1బీ విధానం, భారతీయ ఐటీ రంగం మధ్య ఉన్న సంబంధాన్నే ప్రశ్నించే నిర్ణయం.

అసలు పీఈఆర్ఎం అంటే ఏమిటి?

అమెరికాలో ఒక కంపెనీ విదేశీ ఉద్యోగికి ఎంప్లాయ్‌మెంట్‌ ఆధారిత గ్రీన్ కార్డ్‌ స్పాన్సర్‌ చేయాలంటే పీఈఆర్ఎం ప్రక్రియ కీలకం. ఆ ఉద్యోగానికి అర్హత ఉన్న అమెరికన్‌ ఉద్యోగి అందుబాటులో లేడని కంపెనీ నిరూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే గ్రీన్‌కార్డ్‌ ప్రక్రియలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమెరికా కార్మిక శాఖ ఈ ఎనిమిది సంస్థలకు సంబంధించి కొత్త దరఖాస్తులను మాత్రమే కాకుండా పెండింగ్‌లో ఉన్న పెర్మ్ దరఖాస్తులను కూడా ప్రాసెస్ చేయబోమని ప్రకటించింది. అంటే ప్రభావం భవిష్యత్తులో అమెరికాకు వెళ్లే ఉద్యోగులపైనే కాకుండా ఇప్పటికే ప్రక్రియలో ఉన్న కొంతమంది విదేశీ ఉద్యోగులపై కూడా పడే అవకాశం ఉంది.

ఇది హెచ్1బీపై నేరుగా నిషేధం కాదు.. కానీ ప్రభావం చాలా పెద్దదిగా చెప్పొచ్చు. ఇక్కడే అసలు విషయం ఉంది. అమెరికా హెచ్1బీ వీసాలను ఈ ఎనిమిది కంపెనీలకు పూర్తిగా రద్దు చేయలేదు. కానీ హెచ్1బీ ద్వారా అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాసం పొందే మార్గంలో పెర్మ్ ఒక ముఖ్యమైన దశ. ఆ దశనే ఆపడం ద్వారా అమెరికా ప్రభుత్వం ఉద్యోగులను దీర్ఘకాలికంగా అమెరికాలో స్థిరపడే విషయంలో కంపెనీలపై భారీ ఒత్తిడి తీసుకొస్తోంది. అంటే అమెరికా నుంచి వస్తున్న సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలో ఉద్యోగం చేయాలంటే ముందుగా అమెరికన్‌ ఉద్యోగికి ప్రాధాన్యం ఇవ్వాలి. విదేశీ నిపుణులపై ఆధారపడటం తగ్గించాలన్నది ట్రంప్ సర్కార్ తాజా వ్యూహం

‘అమెరికన్ ఉద్యోగాలు’ వర్సెస్ ‘గ్లోబల్ టాలెంట్’

అమెరికా ప్రభుత్వం మాత్రం దీనిని ఉద్యోగ రక్షణ చర్యగా వివరిస్తోంది. కార్మిక శాఖ ప్రకారం 2009 నుంచి ఈ సంస్థలు కలిపి దాదాపు 30 లక్షల మంది విదేశీ ఉద్యోగుల కోసం అభ్యర్థనలు చేశాయి. 2.3 లక్షలకు పైగా హెచ్1బీ ఆమోదాలు, 1 లక్షకు పైగా శాశ్వత లేబర్ సర్టిఫికేషన్లు పొందాయని అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్యలను చూపిస్తూ అమెరికన్‌ ఉద్యోగాలు విదేశీ కార్మికులకు మళ్లిపోయాయని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే దీనికి మరో కోణం కూడా ఉంది. అమెరికా టెక్‌ పరిశ్రమ దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ ఎదిగింది. సాఫ్ట్‌వేర్‌, క్లౌడ్‌, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత ఉన్నప్పుడు విదేశీ టాలెంట్‌ అమెరికా కంపెనీలకు కీలకంగా మారింది. అందువల్ల ఇది కేవలం “విదేశీయులను పంపించాలా? వద్దా?” అనే ప్రశ్న కాదు. అమెరికా టెక్‌ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం, స్థానిక ఉద్యోగాల రక్షణ ఈ రెండింటి మధ్య సమతుల్యతపై జరుగుతున్న పోరాటం.

భారతీయ ఐటీ ఉద్యోగులపై ఎందుకు ఎక్కువ ప్రభావం?

ఈ నిర్ణయంలో భారతీయ ఐటీ రంగంపై ఇప్పుడు నేరుగా పడింది.. ఇన్ఫోసిస్‌, టాటా, విప్రో, హెచ్‌సీఎల్‌, కాగ్నిజెంట్‌ వంటి సంస్థలు అమెరికా మార్కెట్‌లో భారీ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. హెచ్1బీ వ్యవస్థలో కూడా భారతీయ ప్రొఫెషనల్స్‌ పెద్ద భాగాన్ని కలిగి ఉన్నారు. అందువల్ల పెర్మ్ పై పరిమితులు పెరిగితే అమెరికాలో దీర్ఘకాలికంగా స్థిరపడాలని చూస్తున్న భారతీయ ఉద్యోగులపై ప్రత్యేక ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హెచ్1బీ పై ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్నవారు ఇప్పుడు “అమెరికాలో ఉద్యోగం కొనసాగించగలమా?” కంటే “అమెరికాలో శాశ్వతంగా ఉండే మార్గం ఎంతవరకు భద్రంగా ఉంది?” అన్నది పునరాలోచించాలి.

కంపెనీలకు ఇది ఎంత పెద్ద షాక్

ఇది కేవలం ఉద్యోగుల సమస్య కాదు. అమెరికాలో విదేశీ టాలెంట్‌పై ఆధారపడే కంపెనీల వ్యాపార వ్యూహాలపైనా ప్రభావం పడవచ్చు. కంపెనీలు ఇకపై అమెరికన్‌ ఉద్యోగుల నియామకాన్ని పెంచడం, విదేశీ ఉద్యోగుల పాత్రను పునఃపరిశీలించడం.. జీతాల నిర్మాణాన్ని మార్చడం, అమెరికాలోనే టాలెంట్‌ డెవలప్‌మెంట్‌ చేయడం వంటి మార్గాల వైపు వెళ్లాల్సి రావచ్చు.అమెరికా కార్మిక శాఖ ఇప్పటికే విదేశీ ఉద్యోగుల వేతనాలు, అమెరికన్‌ ఉద్యోగులతో సమాన పోటీ వంటి అంశాలపై మరింత కఠిన విధానాలను ప్రతిపాదించింది.

ట్రంప్‌ ప్రభుత్వం దీన్ని అమెరికన్‌ ఉద్యోగుల విజయంగా చూపిస్తోంది. కానీ దీర్ఘకాలంలో ఫలితం అంత సులభంగా ఉండకపోవచ్చు. విదేశీ టాలెంట్‌పై నియంత్రణలు పెంచితే అమెరికన్‌ ఉద్యోగులకు అవకాశాలు పెరగవచ్చు. అదే సమయంలో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత పెరిగితే కంపెనీల ఖర్చులు కూడా పెరగవచ్చు. ఆ ఖర్చు చివరికి సేవల ధరలు, పెట్టుబడులు, ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది ప్రపంచ టెక్‌ టాలెంట్‌ మార్కెట్‌లో అమెరికా తన నియమాలను తిరిగి రాసుకునే ప్రయత్నానికి సంకేతంగా కనిపిస్తోంది.

భారతీయ ఐటీ నిపుణులకు అసలు సందేశం ఒక్కటే అమెరికా ఉద్యోగ మార్కెట్‌ ఇకపై కేవలం నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా ఇమిగ్రేషన్‌ పాలసీని కూడా నిర్ణయాత్మక అంశంగా మార్చుకుంటోంది. సో అమెరికా వెళ్లాలనుకునే వృత్తి నిపుణులు ఇకపై అక్కడి నిబంధనలు తెలుసుకొని మలుచుకొని వెళితేనే బెటర్. లేదంటే అమెరికా ప్రభుత్వం నుంచి ఇలా ఇబ్బందులు పడక తప్పదు.




Tags:    

Similar News