భారత కంపెనీల టాప్ ఆఫీసర్ల వీసాలు రద్దు.. కారణం ఇదే!
ఓవైపు స్నేహహస్తం చాస్తూనే.. మరోవైపు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం అమెరికా.;
ఓవైపు స్నేహహస్తం చాస్తూనే.. మరోవైపు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. ట్రంప్ 2.0 నుంచి భారత్ తో వ్యవహరించే తీరుపై ఆ దేశంలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకురావటం.. ఆందోళనకు గురి చేయటం.. మార్కెట్ల మీద ప్రభావం చూపటం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. మొత్తంగా భారత్ మీద తన అసంత్రప్తిని డైలీ బేసిస్ లో.. వివిద అంశాల మీద చూపిస్తున్న అమెరికా తాజాగా మరో అనూహ్య చర్యను చేపట్టింది.
భారత్ కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు.. కార్పొరేట్ ఉన్నతాధికారులు వీసాల్ని రద్దు చేసినట్లుగా న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన ప్రకటనే దీనికి సాక్ష్యంగా చెప్పాలి. ప్రమాదకర ఫెంటానిల్ మాదకద్రవ్యం తయారీలో ఉపయోగించే రసాయనాల అక్రమరవాణాతో ప్రమేయం ఉన్న భారత కంపెనీ ఉన్నతాధికారులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టినట్లుగా చెబుతున్నారు.
ట్రంప్ పాలనా విధానాల్లో భాగంగా అమెరికన్లను ప్రమాకరమైన సింథటిక్ నార్కోటికర్స్ నుంచి రక్షించే ప్రయత్నంలో ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా అమెరికా ఎంబసీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటనలోనే పలు కంపెనీల ఎగ్జిక్యూటివ్ లతో పాటు.. వారి కుటుంబసభ్యులను అమెరికాకు ప్రయాణించటానికి అనర్హులుగా ప్రకటించింది. ఇప్పటికే యూఎస్ వీసా కోసం వారు చేసుకున్న దరఖాస్తుల్ని రిజెక్టు చేసినట్లు తెలిపింది.
భవిష్యత్తులోనూ ఫెంటానిల్ కెమికల్ స్మగ్లింగ్ చేసే కంపెనీలకు చెందిన ఇతర ఎగ్జిక్యూటివ్ లను ఫ్యూచర్ లో వీసా కోసం అప్లై చేస్తే.. లోతైన పరిశీలన.. అధ్యయనం తప్పదని రాయబారకార్యాలయం స్పష్టం చేసింది. ఇదంతా చూసినప్పుడు.. ఒకవేళ బలమైన ఆధారాలు.. సాక్ష్యాలు ఉంటే వాటిని భారత ప్రభుత్వానికి పంపి.. చర్యలు తీసుకోవాలని చెప్పటంతో పాటు.. సదరు కంపెనీల వివరాల్ని వెల్లడిస్తే బాగుండేది కదా? అన్న మాట వినిపిస్తోంది.