UPI MDR క్లారిటీ: పెట్రోల్ బంకుల‌కు మినహాయింపు లేదు.. కస్ట‌మ‌ర్‌ రక్షణే లక్ష్యం!

డిజిటల్ పేమెంట్స్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక స్పష్టత వెలువడింది.

Update: 2026-09-26 06:31 GMT

డిజిటల్ పేమెంట్స్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక స్పష్టత వెలువడింది. యూపీఐ (UPI) మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానంలో ఎలాంటి పునరాలోచన లేదని.. ప్రస్తుతానికి పెట్రోల్ బంకుల్లో జరిగే లావాదేవీలపై ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయ‌ని బిజినెస్ టుడే త‌న క‌థ‌నంలో పేర్కొన‌డం షాకిస్తోంది. ఫ్యూయల్ అవుట్‌లెట్లలో డిజిటల్ చెల్లింపుల నిర్వహణపై వస్తున్న ఊహాగానాలపై ఇప్ప‌టికి ఇంకా ఎలాంటి స్ప‌ష్ఠ‌తా రాలేదు.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. పెట్రోల్ బంకుల్లో యూపీఐ చెల్లింపులపై బంక్ య‌జ‌మానుల‌కు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలనే ప్రతిపాదన ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదు. అయితే, డీలర్లు - వ్యాపారుల నుంచి వస్తున్న డిమాండ్లు, ఆందోళనలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ట్రేడర్ అసోసియేషన్లతో చర్చలు జరిపి.. ప్రస్తుత ఎండీఆర్ ఫ్రేమ్‌వర్క్‌పై పూర్తి స్పష్టతనిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ మొత్తం ప్రక్రియలో వినియోగదారుల ప్రయోజనాలే అత్యంత కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. సామాన్య ప్రజలు లేదా వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు భరించాల్సిన పరిస్థితి రాకుండా చూసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడకుండా ఒక పకడ్బందీ యంత్రాంగాన్ని రూపొందించే పనిలో పడ్డారు.

ఈ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) తో కలిసి సంయుక్తంగా కసరత్తు చేస్తోంది. బ్యాంకులు - ట్రేడర్ల భాగస్వామ్యంతో యూపీఐ లావాదేవీల వ్యయాలను క్రమబద్ధీకరించేందుకు తగిన విధివిధానాలను సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగకుండా సజావుగా సాగే అవకాశం ఉంటుంది.

మొత్తంగా.. డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా యూపీఐ లావాదేవీలు మరింత సులభంగా, ఎలాంటి రుసుముల భారం లేకుండా సాగేలా చూడటమే ప్రభుత్వ ప్రధానోద్దేశంగా కనిపిస్తోంది. వ్యాపారుల ఆందోళనలను పరిష్కరిస్తూనే.. వినియోగదారులకు పూర్తి రక్షణ కల్పించేలా ప్రభుత్వం త్వరలోనే మరిన్ని స్పష్టమైన మార్గదర్శకాలను వెలువరించే అవకాశం ఉందని .. ఆ మేర‌కు బిజినెస్ టుడే ప్రచురించిన క‌థ‌నం వైర‌ల్ గా మారుతోంది.

2000 పైబ‌డిన లావాదేవీల‌పైనే..

డిజిటల్ పేమెంట్స్‌లో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ వర్తింపునకు సంబంధించి పెట్రోల్ బంకుల డీలర్లు చేస్తున్న డిమాండ్లను పరిశీలించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు క‌థ‌నాలు వ‌చ్చినా బిజినెస్ టుడే క‌థ‌నం అందుకు భిన్నంగా ఉండ‌టం విశేషం. ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (ఏఐపీడీఏ) చేసిన విజ్ఞప్తిపై ఆర్థిక శాఖ (డిఎఫ్ఎస్) త్వరలో ప్ర‌భుత్వం స్పందిస్తుందా లేదా? అనేదానిపైనా మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.

పెట్రోల్ బంకుల్లో రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలకు పూర్తి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 16న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు AIPDA అధ్యక్షుడు అజయ్ బన్సాల్ లేఖ రాశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించిన ఫిక్సెడ్ మార్జిన్లపైనే తమ వ్యాపారం ఆధారపడి ఉంటుందని.. విక్రయాల పరిమాణం ఆధారంగా వచ్చే ఈ మార్జిన్లు ట్రాన్సాక్షన్ విలువకు తగినట్లు పెరగవని అసోసియేషన్ వాదిస్తోంది. ఈ అదనపు ఎండీఆర్‌ భారం తమ లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కొత్త MDR ఫ్రేమ్‌వర్క్ అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో పెట్రోల్ బంకుల డీలర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల డీలర్లు మాత్రం అక్టోబర్ 15 నుంచి రూ.2,000 మించిన యూపీఐ చెల్లింపులను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే వినియోగదారులు కార్డ్స్ ద్వారా చెల్లించే ప్రత్యామ్నాయం యథావిధిగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ డీలర్ల విజ్ఞప్తిని ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫార్వర్డ్ చేయడంతో.. దీనిపై ఉన్నతాధికారుల స్థాయిలో సమీక్ష జరుగుతుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే దీనిపై ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాలేదు. ప్ర‌స్తుతానికి జాతీయ మీడియాలు ర‌క‌ర‌కాల క‌థ‌నాల‌తో ఊద‌ర‌గొడుతుంటే సామాన్యులు కొంత క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నారు.

Tags:    

Similar News