అమెరికాకు షాక్.. డబ్బుంటే సరిపోదు.. ఆర్థిక ధీమా ఉండాలి! ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఆర్థిక దేశాలు ఇవే..
అసలు ఈ ఆర్థిక స్థిరత్వానికి కొలమానం ఏమిటి? జెయింట్ ఎకానమీగా ఎదిగిన భారత్ ఎందుకు వెనుకబడింది? అన్నది ఆసక్తిరేపుతోంది..
ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం మారుతోంది. అగ్రరాజ్యం అమెరికాకు షాక్ ఇస్తూ అపరిమిత సంపదకు నిలయమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక స్థిరత్వం కలిగిన దేశంగా అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది. యూఎస్ న్యూస్ మరియు వరల్డ్ రిపోర్ట్ తాజాగా విడుదల చేసిన ఈ సంచలన ర్యాంకింగ్స్‌లో భారత్ తన ఉనికిని చాటుకున్నప్పటికీ.. అగ్రరాజ్యాలనే వెనక్కి నెట్టి అరబ్ దేశాలు సాధించిన ఈ వృద్ధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ ఆర్థిక స్థిరత్వానికి కొలమానం ఏమిటి? జెయింట్ ఎకానమీగా ఎదిగిన భారత్ ఎందుకు వెనుకబడింది? అన్నది ఆసక్తిరేపుతోంది..
నేటి మారుతున్న ప్రపంచ పరిణామాల మధ్య ఒక దేశం యొక్క ఆర్థిక బలం కేవలం దాని జీడీపీపైనే కాకుండా.. ఆ దేశం సంక్షోభాలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కోగలదు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. తాజాగా యూఎస్ న్యూస్ మరియు వరల్డ్ రిపోర్ట్ సంస్థ ప్రకటించిన "ప్రపంచ ఆర్థికంగా అత్యంత స్థిరమైన దేశాల-2024" నివేదికలో ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం వెనుకబడిన ఈ జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
టాప్-5లో నిలిచిన దేశాలు ఇవే!
ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం సంపద ఆధారంగా కాకుండా.. తక్కువ అప్పులు, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ, నిరుద్యోగ నియంత్రణ, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి వంటి కీలక అంశాల ప్రాతిపదికన రూపొందించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)
సుమారు 504 బిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఈ దేశం.. కేవలం 95 లక్షల జనాభాతో అద్భుతాలు చేస్తోంది. ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవలలో వేగం ,వ్యాపార అనుకూల విధానాలు యూఏఈను నంబర్ 1 స్థానంలో నిలబెట్టాయి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి నగరాలు గ్లోబల్ బిజినెస్ హబ్‌లుగా మారడం దీనికి ప్రధాన కారణం.
స్విట్జర్లాండ్
885 బిలియన్ డాలర్ల జీడీపీతో రెండో స్థానంలో నిలిచింది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన బ్యాంకింగ్ వ్యవస్థ స్విట్జర్లాండ్ సొంతం.
జర్మనీ:
యూరప్ ఖండపు ఆర్థిక ఇంజిన్‌గా పిలవబడే జర్మనీ మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆటోమొబైల్. భారీ పారిశ్రామిక ఎగుమతులే ఈ దేశ బలం.
కెనడా
నిలకడైన ఉపాధి అవకాశాలు.. మెరుగైన జీవన ప్రమాణాలతో కెనడా నాలుగో స్థానంలో నిలిచింది.
జపాన్
సాంకేతిక పరిజ్ఞానం, క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాలతో జపాన్ ఐదో స్థానాన్ని ఆక్రమించింది.
అమెరికాకు షాక్.. ఆరవ స్థానం నుంచి పదో స్థానం వరకు..
ప్రపంచ ఆర్థిక శక్తిగా విర్రవీగే అమెరికా ఈ జాబితాలో టాప్-10లో చోటు సంపాదించలేకపోవడం గమనార్హం. అమెరికా 13వ స్థానానికి పరిమితమైంది. ఇక 6 నుంచి 10 స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్స్ ,సౌదీ అరేబియా నిలిచాయి.
భారత్ పరిస్థితి ఏమిటి?
ప్రస్తుతం 4.15 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారతదేశం.. ఈ జాబితాలో 47వ స్థానంలో నిలిచింది. భారీ జనాభా ఉండటం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య , ఆదాయ అసమానతలు భారత్ ర్యాంకింగ్ వెనుకబడటానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన భవిష్యత్తులో భారత్ మెరుగైన స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పొరుగు దేశం పాకిస్తాన్ ఈ జాబితాలో కనీసం చోటు కూడా దక్కించుకోలేకపోయింది.
పర్యాటకంపై ఆర్థిక స్థిరత్వ ప్రభావం
ఆర్థికంగా స్థిరంగా ఉన్న దేశాలను సందర్శించేందుకు పర్యాటకులు ఇప్పుడు మక్కువ చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయా దేశాల్లో ఉండే భద్రత, మెరుగైన రవాణా సౌకర్యాలు, సులభతరమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. ఒక దేశం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే అక్కడ ఆరోగ్య సేవలు, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని, ఇది పర్యాటకులకు పరోక్షంగా భరోసానిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నివేదిక ప్రకారం కేవలం భారీ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండటమే కాకుండా దాన్ని స్థిరంగా నిర్వహించగల సామర్థ్యం ఉన్న దేశాలే భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసిస్తాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఆసియా నుంచి యూఏఈ , సౌదీ అరేబియా వంటి దేశాలు దూసుకుపోవడం గమనార్హం.