అమెరికాలో విదేశీ డ్రైవర్లకు బ్రేక్! వీసాలు కట్!
అయితే.. స్థానికంగా నిరుద్యోగం పెరిగిపోయిందనిపేర్కొంటూ.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ట్రక్కుడ్రైవర్లపై ఆంక్షలు పెడుతున్నారు.;
అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి.. పది రూపాయలు వెనుకేసుకోవాలని భావించే విదేశీయులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వారు వీరు అనే తేడా లేకుండా.. అందరినీ కట్టడి చేస్తూ.. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు.. చిన్న చిన్న ఉద్యోగాల కోసం వెళ్లే వారికి కూడా ప్రాణ సంకటంగా మారుతున్నాయి. తాజాగా వలస విధానం, స్థానికులకే ఉద్యోగాలు పేరుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పుడు విదేశాల నుంచి ట్రక్కులు నడిపేందుకు.. అమెరికాకు వెళ్లాలని భావించే డ్రైవర్లకు బ్రేకులు పడినట్టు అయింది.
విదేశాల నుంచి వచ్చి అమెరికాలో ట్రక్కు డ్రైవర్లుగాపనిచేయాలని అనుకునేవారికి వీసాలు ఇచ్చేదిలేదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి కూడా తెచ్చేసేందుకు అధికారులు ఉత్సా హం చూపారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కీలక ప్రకటన చేశారు. వాస్తవానికి భారత్ సహా.. చైనా, పాకిస్థాన్, ఇతర యూరోపియన్ దేశాల నుంచి కూడా ట్రక్కు డ్రైవర్లు.. అమెరికాలో పనిచేస్తున్నారు. వీరికి రోజు వారి కూలిగా లెక్కించి వేతనం ఇస్తారు.
అయితే.. స్థానికంగా నిరుద్యోగం పెరిగిపోయిందనిపేర్కొంటూ.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ట్రక్కుడ్రైవర్లపై ఆంక్షలు పెడుతున్నారు. ఈ పరంపరలో తాజాగా వీసాలు కట్ చేశారు. దీనికి కారణంగా.. విదేశీ డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ తెలియడం లేదని, దీంతో అమెరికాలో రోడ్లు రక్తం చిందుతున్నాయని.. ప్రమాదాలు పెరుగుతున్నాయని.. ఫలితంగా ప్రపంచం ముందు తమ దేశం పరువు పోతోందని రూబియో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వీసాలను ఇక నుంచి ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
ఇప్పటికే ఉన్న నియమాలు ఇవీ..
+ విదేశాల నుంచి వచ్చి అమెరికాలో ట్రక్కు డ్రైవర్లుగా చేసేవారు.. ఖచ్చితంగా స్థానిక భాషలపై అవగాహన పెంచుకోవాలి.
+ ఇంగ్లీష్, మాండరిన్(అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఉంది) భాషల్లో మెళకువలు నేర్చుకోవాలి.
+ అన్ని సంకేత చిహ్నాలపైనా అవగాహన పెంచుకోవాలి.
+ మద్యం, గుట్కా అలవాట్లు ఉండకూడదు.(సాధారణంగా వాహనాలు నడిపేప్పుడు ఈ నిబంధన ఉంటుంది. కానీ, అమెరికాలో అసలు అలవాట్లే ఉండకూడదట.)
+ డ్రైవర్లు.. ప్రతి మూడు మాసాలకు ఒకసారి వారి ఆరోగ్యానికి సంబంధించి ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఇది అమెరికా డాక్టర్లే ఇవ్వాలి. కానీ, వారిపై ఇవ్వొద్దని ఒత్తిడి ఉంది.
అసలు ఉద్దేశం ఇదీ..
స్థానికంగా ఉన్న ట్రక్కు డ్రైవర్లకే ఉద్యోగాలు ఇవ్వాలన్నది ట్రంప్ నిర్ణయం. ఈ క్రమంలో పొరుగు వారికి ఇలా పొగ పెడుతున్నారన్నది చర్చ.