నీకు ఎంతమంది భార్యలు.. అధ్యక్షుడిని అడిగి మళ్లీ పరువు తీసుకున్న ట్రంప్

అమెరికా అంటే ప్రపంచ దేశాలకు “పెద్దన్న”గా భావించే శక్తివంతమైన దేశం. ప్రపంచ రాజకీయ సమీకరణల్లో అమెరికా అధ్యక్షుడి మాటలు, నిర్ణయాలు ఏ దేశానికైనా ప్రభావం చూపే స్థాయి కలిగి ఉంటాయి.;

Update: 2025-11-13 05:01 GMT

అమెరికా అంటే ప్రపంచ దేశాలకు “పెద్దన్న”గా భావించే శక్తివంతమైన దేశం. ప్రపంచ రాజకీయ సమీకరణల్లో అమెరికా అధ్యక్షుడి మాటలు, నిర్ణయాలు ఏ దేశానికైనా ప్రభావం చూపే స్థాయి కలిగి ఉంటాయి. ముఖ్యంగా రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలు ప్రపంచ దేశాలకు నేరుగా ఎదురుదెబ్బలుగా మారుతున్నాయి. టారీఫ్‌లు, ఆంక్షలు, వ్యాపార నియంత్రణలు.. ఇవన్నీ అనేక దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయి.

కేవలం నిర్ణయాలే కాదు… ట్రంప్ మాట్లాడే మాటలు కూడా తరచూ వివాదాలకే దారితీస్తుంటాయి. తాజాగా ఇతని వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయ మాధ్యమాల్లో దుమారం రేపాయి.

* సిరియా అధ్యక్షుడి అరుదైన అమెరికా పర్యటన

1946లో సిరియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అక్కడి అధ్యక్షుడు అమెరికా పర్యటించడం అత్యంత అరుదైన ఘటన. ఈ నేపథ్యంలో సిరియా ప్రస్తుత అధ్యక్షుడు ఆల్ షరా అమెరికాకు రావడం, ట్రంప్‌తో సమావేశం కావడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమైంది. సిరియాలో నిరంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇటీవల అమెరికా సహకారం పెరిగిన నేపథ్యంలో ఈ భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్రంప్–షరా భేటీ అనంతరం జరిగిన అధికారిక విలేకరుల సమావేశంలో ఒక ఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది. సమావేశం మధ్యలో ట్రంప్ సిరియా అధ్యక్షుడిపై పెర్ఫ్యూమ్ స్ప్రే చేసి, ఆ పెర్ఫ్యూమ్‌ను ఆయనకు బహుమతిగా ఇచ్చాడు. అంతటితో ఆగకుండా “ఇది చాలా మంచి వాసన ఇస్తుంది… మీరు వాడండి. ఇంకొకటి మీ భార్యకు. అలాగే… మీకు ఎంత మంది భార్యలు ఉన్నారు?” అంటూ ప్రశ్నించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు.

* ట్రంప్ వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ

అమెరికా మీడియా ట్రంప్ శైలిని పెద్దగా పట్టించుకోకపోయినా, ప్రపంచ దేశాల మీడియా మాత్రం ఈ వ్యాఖ్యలపై మండిపడుతోంది. ఒక దేశాధ్యక్షుడితో భేటీ సమయంలో బహు భార్యత్వంపై ఇలా వ్యాఖ్యానించడం అమెరికా అధ్యక్షుడికి తగదని పలువురు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

ఇస్లామిక్ దేశాల్లో బహు భార్యత్వం ఉన్నట్టే, ట్రంప్‌ వ్యక్తిగత జీవితంలో కూడా పలుమార్లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంతోనే ఆయన ఆ వ్యాఖ్య చేసినట్లుగా కొందరు అమెరికా విశ్లేషకులు అంటుంటే, ఇతర దేశాలు మాత్రం దీనిని "అనుచిత రాజకీయ ప్రవర్తన"గా అభివర్ణిస్తున్నాయి.

రాజకీయ ప్రయోజనాలకే ఈ భేటీలు?

విమర్శకులు ట్రంప్‌ ఇటీవల చేపట్టిన అంతర్జాతీయ సమావేశాలన్నీ వ్యాపార ప్రాధాన్యతలతోనే జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. కొద్దికాలం క్రితం పాకిస్తాన్ సర్వసేనాధ్యక్షుడు అసిఫ్ మునీర్‌తో జరిగిన భేటీలోనూ ఖనిజ అన్వేషణ కాంట్రాక్టులు అమెరికా సంస్థలకు అప్పగించారని సమాచారం. ఇప్పుడు సిరియా అధ్యక్షుడితో కూడా వ్యాపార ఒప్పందాలే అసలు లక్ష్యమో అనేది చర్చగా మారింది.

సిరియాతో అమెరికా మధ్య కొత్త ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు ఏ దిశగా సాగుతాయో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం ప్రపంచ రాజకీయ చర్చల్లో మళ్లీ కేంద్రబిందువయ్యాయి.




Tags:    

Similar News