అమెరికా రాజకీయాల్లో 'స్టాక్' ప్రకంపనలు.. డోనాల్డ్ ట్రంప్ చుట్టూ ముసురుతున్న కొత్త వివాదం!

అమెరికా ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్ (ఓజీఈ) వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం.. కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే ట్రంప్ తరపున సుమారు 3,700 స్టాక్ లావాదేవీలు జరిగాయి.

Update: 2026-05-17 07:11 GMT

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వివాదాల కేంద్రబిందువుగా మారారు. ఇప్పటికే పలు రకాల న్యాయ, రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్న ట్రంప్‌కు.. తాజాగా భారీ స్థాయిలో జరిగిన స్టాక్ మార్కెట్ లావాదేవీల వ్యవహారం కొత్త తలనొప్పిగా పరిణమించింది. 2026 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో ట్రంప్ తరపున వేల సంఖ్యలో స్టాక్ ట్రేడింగ్స్ జరిగాయనే వార్త బయటకు రావడంతో అమెరికా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఒక దేశాధ్యక్షుడిగా అధికారంలో ఉంటూ ప్రభుత్వ అంతర్గత నిర్ణయాలను తన వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నారా ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

మూడు నెలలు.. 3,700 లావాదేవీలు!

అమెరికా ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎథిక్స్ (ఓజీఈ) వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం.. కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే ట్రంప్ తరపున సుమారు 3,700 స్టాక్ లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ అక్షరాలా 220 మిలియన్ డాలర్ల నుంచి 750 మిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉండే టెక్నాలజీ, డిఫెన్స్ , ప్రభుత్వ కాంట్రాక్ట్ కంపెనీల షేర్లలోనే ఈ భారీ కొనుగోళ్లు.. అమ్మకాలు జరగడం రాజకీయ వర్గాల్లో పెను అనుమానాలకు తావిస్తోంది.

ఎన్‌విడియా షేర్ల చుట్టూ అనుమానాల వెల్లువ

ఈ మొత్తం వ్యవహారంలో ప్రముఖ సెమీకండక్టర్ దిగ్గజం 'ఎన్‌విడియా' షేర్ల ట్రేడింగ్ అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఫైలింగ్స్ ప్రకారం.. జనవరి 6న ట్రంప్ తరపున దాదాపు ఒక మిలియన్ డాలర్ల విలువైన ఎన్‌విడియా షేర్లను కొనుగోలు చేశారు. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత కేవలం వారం రోజుల్లోనే అమెరికా కామర్స్ డిపార్ట్‌మెంట్ చైనాకు 'ఎన్‌విడియా ఏ200 ఏఐ' చిప్స్ అమ్మకాలకు అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది.

అంతేకాకుండా ఫిబ్రవరి 10న మరోసారి ట్రంప్ ఖాతా ద్వారా భారీగా ఎన్‌విడియా షేర్ల కొనుగోలు జరిగింది. ఆ వెంటనే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'మెటా ప్లాట్‌ఫార్మ్స్' తో ఎన్‌విడియా ఒక కీలకమైన ఒప్పందాన్ని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాలకు, ఈ వ్యాపార లాభాలకు ఎదో బలమైన లింక్ ఉందనడానికి ఇవే నిదర్శనాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు ట్రంప్ తన చైనా పర్యటన సమయంలో ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ను స్వయంగా వెంట తీసుకెళ్లడం కూడా ఈ విమర్శలకు మరింత బల చేకూర్చింది. కేవలం ఎన్‌విడియా మాత్రమే కాకుండా ప్రభుత్వ కాంట్రాక్టులు పొందే 'పాలాంటిర్ టెక్నాలజీస్' వంటి కంపెనీల షేర్లను కూడా కీలక ఒప్పందాలకు ముందే కొనుగోలు చేయడం గమనార్హం.

డెమొక్రాట్ల ఫైర్.. ప్రయోజన సంఘర్షణేనా?

ఈ పరిణామాలపై ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్ ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. "అధ్యక్షుడి స్థానంలో ఉండి ఆ అధికార బలంతో వ్యక్తిగత పెట్టుబడులు పెట్టడం ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. రోజుకు సగటున 40కి పైగా ట్రేడ్లు జరగడం అనేది సాధారణ పెట్టుబడి విధానం ఎంతమాత్రం కాదు. ఇది స్పష్టమైన ప్రయోజన సంఘర్షణ కు సంకేతం.’’ అని ఎలిజబెత్ వారెన్ మండిపడ్డారు.

ట్రంప్ వర్గం కౌంటర్.. అది 'బ్లైండ్ ట్రస్ట్'!

అయితే ఈ ఆరోపణలను ట్రంప్ వర్గం.. ట్రంప్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించాయి. ఈ పెట్టుబడులతో అధ్యక్షుడికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేశాయి. ట్రంప్ ఆస్తులు.. పెట్టుబడులను పూర్తిగా స్వతంత్ర ఫైనాన్షియల్ మేనేజర్లు పర్యవేక్షిస్తున్నారని, ఇది చట్టబద్ధమైన 'బ్లైండ్ ట్రస్ట్' విధానంలోనే జరుగుతోందని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాలన్నీ కేవలం జాతీయ భద్రత, దేశ ఆర్థిక ప్రయోజనాల ఆధారంగానే తీసుకుంటున్నామని, వ్యక్తిగత లాభాల కోసం కాదని ట్రంప్ కుటుంబ సభ్యులు సమర్థించుకుంటున్నారు.

పారదర్శకతపై ప్రశ్నలు.. మారనున్న ఎథిక్స్ చట్టాలు?

గతంలోనూ అమెరికా అధ్యక్షులు పెట్టుబడులు పెట్టిన దాఖలాలు ఉన్నప్పటికీ.. అధికారంలో ఉంటూ ఇంత భారీ స్థాయిలో రోజువారీ ప్రాతిపదికన స్టాక్ ట్రేడింగ్ చేయడం అమెరికా చరిత్రలోనే అరుదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ నిఘా, నియంత్రణలు ఎక్కువగా ఉండే టెక్, డిఫెన్స్ రంగాల్లో ఈ తరహా ట్రేడింగ్ జరగడం పారదర్శకతను ప్రశ్నిస్తోంది.

ఈ వ్యవహారం అమెరికాలో 'ప్రభుత్వ ఎథిక్స్ చట్టాలు', ఉన్నతాధికారుల పెట్టుబడులపై ఉన్న నిబంధనలను పునఃసమీక్షించాలనే డిమాండ్‌కు దారితీసింది. ఇది నిజంగా అధికార దుర్వినియోగమా లేక సాధారణ మార్కెట్ లావాదేవీలా అనేది స్వతంత్ర సంస్థల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ సరికొత్త 'స్టాక్ మార్కెట్ వివాదం' రాబోయే రోజుల్లో అమెరికా రాజకీయాలను మరింత హీటెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News