200 ఏళ్ల నాటి మన్రో సిద్ధాంతాన్ని ట్రంప్ తెర మీదకు ఎందుకు తెచ్చినట్లు?
వెనెజువెలా అధ్యక్షుడ్ని అదుపులోకి తీసుకొని.. బంధించి తమ దేశానికి తీసుకెళ్లిన అమెరికా..జరిగిన మొత్తాన్ని ఎప్పటిలానే సమర్థించుకోవటం తెలిసిందే.;
ప్రపంచం ఏమైనా ఫర్లేదు. తన ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించే అమెరికాకు.. ట్రంప్ లాంటి నేత అధినేతగా మారితే అగ్రరాజ్య మైండ్ సెట్ ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చెప్పేస్తాయి. వాటికి మించినట్లుగా వెనెజువెలా వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు తెర తీసింది. ఏ దేశ పంచాయితీ ఆ దేశానిది. సార్వభౌమత్వానికి సామ్రాజ్యవాదంతో చెక్ పెట్టి.. అదేమంటే.. సదరు దేశాన్ని ఉద్దరించటమే తమ లక్ష్యంగా చెప్పే అగ్రరాజ్యం ఇప్పుడు సరికొత్త సంస్క్రతికి తెర తీసింది.
వెనెజువెలా అధ్యక్షుడ్ని అదుపులోకి తీసుకొని.. బంధించి తమ దేశానికి తీసుకెళ్లిన అమెరికా..జరిగిన మొత్తాన్ని ఎప్పటిలానే సమర్థించుకోవటం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన్రో సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. ఇంతకూ సదరు సిద్ధాంతమేంటి? దీన్ని సాకుగా చూపించి అమెరికా ఇప్పుడేం చేయాలనుకుంటుంది? ఈ తీరు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయనుంది? మన్రో సిద్ధాంతం ప్రపంచానికి సరికొత్త ముప్పు? వాదనలో నిజమెంత? లాంటి అంశాల్లోకి వెళితే..
దాదాపు 200 ఏళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో (అమెరికా ఐదో అధ్యక్షుడు) 1823లో అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అమెరికాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా కొత్త తరహా వాదనను వినిపించారు. తర్వాతి రోజుల్లో దాన్ని మన్రో సిద్ధాంతంగా సూత్రీకరించారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమంటే.. అప్పట్లో బలంగా ఉన్న ఐరోపా దేశాల జోక్యాన్ని నివారించాలన్నదే ఆయన ఉద్దేశం. స్వతంత్ర దేశాల్లో ఐరోపా దేశాల జోక్యాన్ని నివారించేందుకు లాటిన్ అమెరికా దేశాలు సమిష్టిగా ఉండాలన్న వాదనను వినిపించారు.
నిజానికి అప్పుడప్పుడే పలు లాటిన్ దేశాలు ఐరోపా దేశాల నుంచి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాయి. ఆ దేశాలపై ఐరోపా తిరిగి నియంత్రణ సాధించకుండా నిలువరించటమే లక్ష్యంగా ఆయనీ వాదనను వినిపించారు. అదే సమయంలో పశ్చిమార్థ గోళంలో అమెరికా ప్రాబల్యాన్ని చాటుకునేందుకు తన సిద్ధాంతం దోహదపడుతుందన్నది మన్రో భావన. నిజానికి ఆయన వాదన మొత్తం అమెరికా.. దాని చుట్టుపక్కల ఉండే లాటిన్ అమెరికా దేశాల్లో ఐరోపా జోక్యాన్ని నిలువరించటమే.
అయితే.. ఈ వాదనను తర్వాత అమెరికా అధ్యక్షులుగా వ్యవహరించిన అధినేతలు తమకు అనుకూలంగా దాన్ని వాడుకున్నారని చెప్పాలి. మెక్సికో నుంచి ఫ్రాన్స్ ను.. కొలంబియా నుంచి పనామా విడిపోవటానికి.. క్యూబాలో సోవియెట్ యూనియన్ బలాన్ని తగ్గించేందుకు.. నికరాగువాలో తాము కోరుకున్న ప్రభుత్వం కొలువు తీరటానికి.. ఇలా అమెరికా తన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి తీసుకునేందుకు వెనుకాడని తీరు కనిపిస్తుంది.
తాజాగా వెనెజువెలాలో తాము చేపట్టిన ఆపరేషన్ ను ట్రంప్ సమర్థించుకునే సందర్భంలో మున్రో సిద్ధాంతాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. మదురో పాలనతో ప్రాంతీయంగా అమెరికాకు విదేశీ విరోధ శక్తుల ముప్పు పెరుగుతుందని.. అమెరికా ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదకర ఆయుధాలు వాటి చేతుల్లోకి వెళుతున్నాయని ఆరోపించారు. ట్రంప్ చేసే వ్యాఖ్యలన్ని ఎవరిని ఉద్దేశించన్నది తెలిసిందే. వెనెజువెలాకు చైనాకు మధ్య బలపడుతున్న బంధాన్ని దెబ్బ తీయటమే అగ్రరాజ్య లక్ష్యమని చెప్పాలి. చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరెన్ని దేశాలకు అగ్రరాజ్యం వెనెజువెలా మాదిరి షాకిస్తుందన్నది ప్రశ్న.