అమెరికాను కలవరపెడుతున్న 'తోమహాక్'
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికా వినియోగిస్తున్న ‘తోమహాక్’ క్రూజ్ క్షిపణులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.;
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికా వినియోగిస్తున్న ‘తోమహాక్’ క్రూజ్ క్షిపణులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల యుద్ధ పరిస్థితుల్లో భాగంగా అమెరికా దాదాపు 850 తోమహాక్ క్షిపణులను ప్రయోగించిందన్న సమాచారం వెలుగులోకి రావడంతో రక్షణ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఒక ఏడాదిలో కొనుగోలు చేసే క్షిపణుల కంటే ఇది తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ , ఇంటర్నేషనల్ స్టడీస్ గణాంకాల ప్రకారం.. అమెరికా ప్రతి ఏడాది సుమారు 90 తోమహాక్ క్షిపణులను మాత్రమే కొనుగోలు చేస్తుంది. 2026 సంవత్సరానికి యూఎస్ నేవీ కేవలం 57 క్షిపణులకే రిక్వెస్ట్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారీ స్థాయిలో వీటి వినియోగం జరగడంతో నిల్వలు తగ్గిపోతున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ అప్పటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఈ ఆందోళనలను ఖండిస్తోంది. యుద్ధ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన ఆయుధ సంపత్తి సమృద్ధిగా ఉందని ఉత్పత్తి వేగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైట్‌హౌస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అసలేంటీ ఈ తోమహాక్ క్షిపణి అంటే?
తోమహాక్ క్షిపణి ఒక అధునాతన క్రూజ్ మిస్సైల్. ప్రధానంగా సుదూర లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించేందుకు రూపొందించబడింది. సుమారు 1000 మైళ్లు (1600 కిలోమీటర్లకు పైగా) దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఇది సమర్థంగా తాకగలదు. ముఖ్యంగా నౌకలు, జలాంతర్గాములు (సబ్‌మరైన్లు) నుంచి వీటిని ప్రయోగిస్తారు. గగనతల రక్షణ వ్యవస్థలను తప్పించుకుంటూ టార్గెట్‌ను చేరుకోవడం దీని ప్రత్యేకత. అందుకే ఇరాన్ లక్ష్యాలపై దాడుల్లో అమెరికా వీటిని విస్తృతంగా వినియోగిస్తోంది.
ఈ క్షిపణుల ధర కూడా భారీగానే ఉంటుంది. ఒక సాధారణ తోమహాక్ క్షిపణి ధర సుమారు 2.2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 కోట్లు) వరకు ఉంటుంది. ప్రత్యేక లక్ష్యాలను ఛేదించేందుకు రూపొందించిన వెర్షన్లు 4 నుంచి 6 మిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా వద్ద దాదాపు 3,100 తోమహాక్ క్షిపణులు ఉన్నట్లు అంచనా.
అయితే వీటి వినియోగం వేగంగా పెరుగుతుండగా ఉత్పత్తి అదే స్థాయిలో జరగకపోవడం మరో ఆందోళనగా మారింది. ఒక సంవత్సరంలో గరిష్ఠంగా 2,330 క్షిపణులను మాత్రమే తయారు చేసే సామర్థ్యం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో జాక్ రీడ్ వంటి నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధునాతన ఆయుధాల నిల్వలు తగ్గిపోతే భవిష్యత్తులో రక్షణ వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇక ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అమెరికా రక్షణ శాఖ ఆయుధ తయారీ సంస్థలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఉత్పత్తి సమయాన్ని తగ్గించి వేగంగా క్షిపణులను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తానికి తోమహాక్ క్షిపణుల విస్తృత వినియోగం ఇప్పుడు యుద్ధ వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తూనే అమెరికా రక్షణ విధానాలపై కొత్త చర్చలకు దారితీస్తోంది.