అమెరికాలోకి మళ్లీ టిక్ టాక్.. ట్రంప్ హింట్? ఏం జరిగింది?
చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్ (TikTok) గత కొన్ని ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆంక్షలను ఎదుర్కొంటూ వచ్చింది.;
చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్ (TikTok) గత కొన్ని ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆంక్షలను ఎదుర్కొంటూ వచ్చింది. 2020లో భారత్ టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించగా, అమెరికా కూడా ఇటీవల డేటా సెక్యూరిటీ కారణంగా కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. యూజర్ల వ్యక్తిగత సమాచారం అనుమతి లేకుండా సేకరిస్తోందనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో స్పష్టంచేసింది.
అయితే, తాజాగా టిక్‌టాక్‌కు మళ్లీ కొత్త ఊపిరి దొరకబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్‌లో టిక్‌టాక్ రీఎంట్రీపై ఊహాగానాలు కొనసాగుతున్న తరుణంలో, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ తన ట్వీట్‌లో “అమెరికా, చైనా మధ్య యూరప్‌లో జరిగిన పెద్ద వాణిజ్య సమావేశం చాలా బాగా జరిగింది. త్వరలో అది ముగుస్తుంది. మన దేశ యువత ఎంతో ఇష్టపడే ఒక కంపెనీపై కూడా ఒక ఒప్పందం కుదిరింది. వారు చాలా సంతోషిస్తారు! నేను శుక్రవారం జిన్‌పింగ్‌తో మాట్లాడతాను” అని పేర్కొన్నారు.
ట్రంప్ తన ట్వీట్‌లో కంపెనీ పేరు ప్రస్తావించకపోయినా, ఆయన సూచన టిక్‌టాక్ గురించేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే, అమెరికాలో యువత ఎక్కువగా ఉపయోగించే చైనా యాప్ అదే.
గతంలో బైడెన్ ప్రభుత్వం టిక్‌టాక్‌పై పరిమితులు విధించినప్పుడు, అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్స్ తమ జీవనోపాధి దానిపైనే ఆధారపడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఇప్పుడు ట్రంప్ పరోక్షంగా ప్రస్తావిస్తూ, టిక్‌టాక్ పునరాగమనానికి బాటలు వేస్తున్నట్టుగా సంకేతం ఇచ్చారు.
సెప్టెంబర్ 17 నాటికి టిక్‌టాక్ యాప్ పగ్గాలు అమెరికాకు దక్కవచ్చని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆ గడువులోపు ఒప్పందం కుదరకపోతే అమెరికా ఆ యాప్‌పై నిషేధం విధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే అమెరికా, చైనా ప్రభుత్వాలు ఇప్పటికే ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చినట్టు సమాచారం. దీన్ని బలపరుస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక కీలక ట్వీట్ చేశారు. అదే సమయంలో, ఈ డీల్ విషయమై ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా త్వరలో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. టిక్‌టాక్ చైనా ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్య స్తంభంగా మారిందని, అంతర్జాతీయ మార్కెట్లోనూ అంచనాలకు మించి పురోగతి సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే అమెరికా కేవలం తమ దేశంలో టిక్‌టాక్ సేవలను మాత్రమే నియంత్రించుకోనుందా? లేక యాప్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటుందా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై అధికారిక ప్రకటన కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది.
ఇకపై అమెరికా–చైనా వాణిజ్య చర్చలు ఎలాంటి మలుపు తిరుగుతాయన్న దానిపైనే టిక్‌టాక్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయినా, ట్రంప్ వ్యాఖ్యలు యువతలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.