టెలికాం ఆపరేటర్లకు రూ.150 కోట్లు కాదు.. అంతకు మించి షాకివ్వాల్సిందే
2020 నుంచి మూడేళ్ల కాలానికి విధించిన ఈ జరిమానాల్ని చూస్తే.. టెలికాం సంస్థలపై మరింత ఫైన్లు విధించాల్సిన అవసరం ఉందని చెప్పాలి.;
దేశంలోని టెలికాం ఆపరేటర్లకు షాకిచ్చింది ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా). స్పామ్ కాల్స్.. మెసేజ్ లను నియంత్రించే విషయంలో ఫెయిల్ అయిన తీరుపై పలు సంస్థలపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ట్రాయ్ పై భారీ ఫైన్లు వేసింది ట్రాయ్. 2020 నుంచి మూడేళ్ల కాలానికి విధించిన ఈ జరిమానాల్ని చూస్తే.. టెలికాం సంస్థలపై మరింత ఫైన్లు విధించాల్సిన అవసరం ఉందని చెప్పాలి. అయితే.. ఈ జరిమానాల్ని టెలికాం ఆపరేటర్లు సవాలు విసిరారు.
స్పామ్ కాల్స్ పై వినియోగదారులు కంప్లైంట్ చేస్తే.. టెలికాం ఆపరేటర్లు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వారి ఫిర్యాదుల్ని పరిష్కరించకుండా వాటిని క్లోజ్ చేసిన వైనాన్ని ట్రాయ్ గుర్తించినట్లుగా చెబుతున్నారు. రూల్స్ కు అనుగుణంగా స్పామ్ కాల్స్.. మెసేజ్ లు వచ్చిన కనెక్షన్లపై కంపెనీలు చర్యలు తీసుకోని నేపథ్యంలోనే ట్రాయ్ వాటిపై ఫైన్లు విధించినట్లుగా చెబుతున్నారు.
నిబంధనల ప్రకారం చూస్తే.. లైసెన్స్ పొందిన సేవా ప్రాంతానికి ఒక టెలికాం ఆపరేటర్ పై నెలకు రూ.50 లక్షల వరకు ఫైన్లు విధించే వీలుంది. గత ఏడాది కాలంలో 21 లక్షలకు పైగా స్పామర్ల కనెక్షన్ లను ట్రాయ్ తొలగించింది. లక్షకు పైగా సంస్థల్ని బ్లాక్ లిస్ట్ చేసింది. 2024 ఆగస్టులో జారీ చేసిన ఆదేశాలతో ఆ సంవత్సరం సెప్టెంబరులో 18.8 లక్షల స్పామర్ల కనెక్షన్లను తొలగించగా.. 1150 సంస్థల్ని బ్లాక్ లిస్ట్ చేసినట్లుగా గుర్తించారు.
టెలీ మార్కెటింగ్ సంస్థలకు ట్రాయ్ నిబంధనల ప్రకారం కాల్స్ చేసుకునే వీలుంది. అందుకు ప్రత్యేకంగా నమోదు కావాల్సి ఉంటుంది. బ్యాంకింగ్.. ఆర్థిక సేవలు.. బీమా రంగాలకు చెందిన కాల్స్.. లావాదేవీ మెసేజ్ లు 1600తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచే రావాలి. వాణిజ్య ప్రచారం కోసం వాడే సందేశాలకు ముందు "P", సేవలకు సంబంధించి అయితే "S", లావాదేవీలకు సంబంధించిన సందేశాలకు "T", ప్రభుత్వ సందేశాలకైతే "S" అనే అక్షరంతో ప్రారంభం కావాల్సి ఉంది. అంతే తప్పించి సాధారణ మొబైల్ నంబర్లు (పది అంకెలు) మాదిరి నెంబర్లతో ఎలాంటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టకూడదు. నిబంధనల్ని పాటించని టెలికాం సంస్థలపై భారీగా ఫైన్లు విధించటం ద్వారా కోట్లాది మంది వినియోగదారులకు అవాంఛిత కాల్స్ నుంచి ఉపశమనాన్ని కలిగించే వీలుంది.