బీసీ బిల్లు గవర్నర్ దగ్గర ఉంది.. మీరెలా జీవో ఇస్తారు: హైకోర్టు షాక్
తెలంగాణలో కుల గణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. సమాజంలో 42 శాతం మంది బీసీలే ఉన్నారని గుర్తించింది.;
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. తాజాగా శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్ జీవోను సవాల్ చేస్తూ.. మల్కాజిగిరి జిల్లాకు చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి.. హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిష న్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని ఆయన కోరారు. దీంతో శనివారం సాయంత్రం అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించింది. ``బీసీ రిజర్వేషన్ బిల్లు.. ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉందని మీరే చెబుతున్నారు. అలాంటప్పుడు.. అదే బిల్లుపై మీరు జీవో ఎలా తీసుకువస్తారు?`` అని ఘాటుగా ప్రశ్నించింది.
విషయం ఏంటి?
తెలంగాణలో కుల గణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. సమాజంలో 42 శాతం మంది బీసీలే ఉన్నారని గుర్తించింది. ఆ వెంటనే వారందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలని పేర్కొంటూ.. 42 శాతం మేరకు బీసీలకు రిజర్వేషన్ కల్పించేలా .. అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించింది. అనంతరం.. దీనిని గవర్నర్ జిష్టుదేవ్ వర్మకు పంపించింది. అయితే.. ఆయన దగ్గర ఇది ఆమోదానికి నోచుకోలేదు. దీంతో రాష్ట్రపతి పంపించారు. అక్కడ కూడా ఆమోదం పొందలేదు. ఆ వెంటనే సీఎం సహా మంత్రులు ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. రాష్ట్రపతిఆమోదించాలని డిమాండ్ చేశారు. అయినా.. దీనికి మోక్షం కలగలేదు.
ఇది జరిగి నెల రోజులు అయింది. అయితే.. మరోవైపు రాష్ట్ర హైకోర్టు స్థానిక ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను సెప్టెంబరు 30వ తేదీ నాటికి చేపట్టాలని ఆదేశించింది. దీనిని తుదిగడువుగా పేర్కొంది. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణకు గడువు సమీపించింది. తొలుత వీటిని మరోసారి వాయిదా వేయించేందుకు ప్రభుత్వం సిద్ధమైనా.. న్యాయనిపుణుల సూచనలతో ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. అంటే.. ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రిజర్వేషన్లు అమలు చేయాలని భావించి.. శుక్రవారం రాత్రి హడావుడిగా.. జీవోను పాస్ చేశారు.
ఈ పరిణామాలపై మాధవ్ రెడ్డి శనివారం మధ్యాహ్నం హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఇప్పటికే తమిళనా డులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలువుతన్నాయని తెలిపారు. పిటిషనర్ మాధవరెడ్డి తరఫున మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లకు సీలింగ్ ఉందని.. 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న హైకోర్టు.. గతంలో చేసిన బిల్లు ఏ దశలో ఉందని ప్రశ్నించింది. ప్రస్తుతం గవర్నర్ దగ్గరే బిల్లు ఉందని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. గవర్నర్ ఈ బిల్లును పరిశీలించేందుకు గరిష్ఠంగా మూడు మాసాల సమయం ఉందని, ఇప్పటికి కేవలం నెల రోజులు మాత్రమే సమయం అయిందని.. అలాంటప్పుడు జీవో ఎలా పాస్ చేస్తారని నిలదీసింది.