హ‌నుమంత‌న్న‌ను ఇలా వ‌దిలేశారేంట‌బ్బా!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి స‌ల‌హాదారుగా ఉన్న వీ. హ‌నుమంత‌రావు ఉర‌ఫ్ వీహెచ్‌.. గ‌త రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.;

Update: 2026-05-11 04:08 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి స‌ల‌హాదారుగా ఉన్న వీ. హ‌నుమంత‌రావు ఉర‌ఫ్ వీహెచ్‌.. గ‌త రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని అంబ‌ర్‌పేట‌లో ఉన్న ఆయ‌న సొంత ఇంట్లోనే నిరాహార దీక్ష‌కు దిగారు. అయితే.. రెండు రోజులు అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ.. వీహెచ్ మాత్రం త‌న నిరాహార దీక్ష‌ను కొన‌సాగిస్తున్నారు. తాను ఎన్ని ఇబ్బందులు ప‌డినా త‌న దీక్ష‌ను విర‌మించేది లేద‌ని చెబుతున్నారు.

ఎందుకు?

వీహెచ్ నిరాహార దీక్ష‌కు.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న జ‌న‌గ‌ణ‌నే కార‌ణం. ఈ జ‌న‌గ‌ణ‌నలో ఓబీసీల సంఖ్య ఎంత అనేది తేల్చాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఈ క్ర‌మంలో జ‌న‌గ‌ణ‌న కోసం ఏర్పాటు చేసిన కాల‌మ్స్‌లో ఓబీసీ కులానికి సంబంధించిన కాల‌మ్‌ను కూడా చేర్చాల‌ని వీహెచ్ ప‌ట్టుబ‌డుతున్నారు. రాష్ట్రంలో బీసీలు ఎంత మంది ఉన్నార‌న్న విష‌యం తెలుస్తోంద‌ని.. కానీ, ఓబీసీలు ఎంత మంది ఉన్నార‌న్న‌ది కూడా తెలియాల్సి ఉంద‌ని ఆయ‌న కోరుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓబీసీల సంఖ్య తెలుసుకునేందుకు వీలుగా జ‌న‌గ‌ణ‌న‌లోనే దీనిని కూడా చేర్చాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న దీక్ష‌కు దిగారు.

అయితే.. ఈ వ్య‌వ‌హారం కేంద్రం ప‌రిధిలో ఉండ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం మౌనంగా ఉంది. మ‌రోవైపు.. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున కూడా పెద్ద నాయ‌కులు ఎవ‌రూ వీహెచ్ నిరాహార దీక్ష‌పై స్పందించ‌లేదు. కేవ‌లం.. పీసీసీ ఉపాధ్య‌క్షుడు సురేష్‌కుమార్ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు మాత్ర‌మే వీహెచ్ ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. కాగా.. ప్ర‌స్తుతం వేస‌వి కాలం కావ‌డం.. వీహెచ్ వ‌య‌సు 77 ఏళ్లు కావ‌డంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు నిరాహార దీక్ష‌ను వ్య‌తిరేకిస్తున్నారు. అయితే.. ఓబీసీల కోసం తాను ఆది నుంచి పోరాటం చేస్తున్నాన‌ని.. ఇప్పుడైనా వారికి న్యాయం జ‌రిగితీరాల‌ని వీహెచ్ కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న రెండు రోజులైనా కూడా నిరాహార దీక్ష‌ను కొన‌సాగిస్తున్నారు. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News