ఏపీ లోక‌ల్ వార్‌... స్నేహ‌పూర్వ‌క పోటీ త‌ప్ప‌ట్లేదే... !

ముఖ్యంగా విజయనగరం కార్పొరేషన్ మేయ‌ర్‌ పదవికి టీడీపీ, జ‌న‌సేన పోటీ ప‌డుతున్నాయి. వాస్త‌వానికి టీడీపీకే కేటాయించినా.. జ‌న‌సేన మాత్రం త‌గ్గేది లేదంటూ పోటీకి దిగింది.

Update: 2026-10-19 09:31 GMT

రాష్ట్రంలో కూట‌మి పార్టీల మ‌ధ్య స‌ఖ్య‌త బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. స్థానిక ఎన్నిక‌ల్లో మాత్రం స్నేహ పూర్వ‌క పోటీ త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ఉత్త‌రాంధ్ర నుంచి సీమ వ‌ర‌కు జ‌న‌సేన నాయ‌కులు ఎక్క‌డా త‌గ్గ‌లేదు. అధికారికంగా పార్టీకి 4 కార్పొరేష‌న్లు, 21 మునిసిపాలిటీలే ద‌క్కినా.. క్షేత్ర‌స్థాయి నాయ‌కులు, పార్టీ కోసం ప‌నిచేసిన వారు మాత్రం సై అంటూ ఈ ఎన్నిక‌ల్లో సీట్ల కేటాయింపుతో సంబంధం లేకుండానే రంగంలోకి దిగారు. దీంతో ఆయా స్థానాల్లో మిత్ర బేధం రాకుండా.. స్నేహ పూర్వ‌క పోటీ చేయ‌డ‌మే మంచిద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఎక్క‌డెక్క‌డ ?

మూడుచోట్ల మేయర్‌ స్థానాలకు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్‌ స్థానాలకు.. టీడీపీ-జ‌న‌సేన‌, బీజేపీ-జ‌న‌సేన‌, టీడీపీ-బీజేపీల మ‌ధ్యే పోరు సాగ‌నుంది. ఆయా పార్టీల‌నేతలు కాదు కాదంటూనే నామినేష‌న్లు వేసేశారు. అదేమంటే త‌మ‌కు బలం ఉన్న స్థానాల‌ను వేరే పార్టీల‌కు కేటాయించార‌ని కూడా చెబుతున్నారు. ఇక‌,ఒక‌టి రెండు స్థానాల్లో అయితే.. ఒకే పార్టీకి చెందిన నాయ‌కులు ఇద్ద‌రి నుంచి ముగ్గ‌రు వ‌ర‌కు పోటీ ప‌డుతున్నా రు. ఈ ప‌రిణామాలు.. ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. నాయ‌కుల మ‌ధ్య ఉన్న ఆకాంక్ష‌కు అద్దం ప‌డుతున్నాయి.

ముఖ్యంగా విజయనగరం కార్పొరేషన్ మేయ‌ర్‌ పదవికి టీడీపీ, జ‌న‌సేన పోటీ ప‌డుతున్నాయి. వాస్త‌వానికి టీడీపీకే కేటాయించినా.. జ‌న‌సేన మాత్రం త‌గ్గేది లేదంటూ పోటీకి దిగింది. ఇక‌, డివిజ‌న్ల‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ప‌ది డివిజ‌న్ల‌లో జ‌న‌సేన నామినేష‌న్ వేసింది. ఏలూరు కార్పొరేషన్‌ జనసేనకు కేటాయించగా టీడీపీ అభ్య‌ర్థి కూడా మేయ‌ర్ పీఠానికి నామినేష‌న్ వేశారు. విశాఖ కార్పొరేషన్‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రో కీల‌క‌మైన‌ విజయవాడ కార్పొరేష‌న్ ప‌రిధిలోనూ జ‌న‌సేన‌, టీడీపీలు వార్డుల వారీగా నామినేష‌న్లు వేశాయి.

ఏం చేయాలి ..?

ఇలా కూట‌మి పార్టీల నాయ‌కులే విరివిగా నామినేష‌న్లు వేయ‌డంతో అనివార్యంగా పోటీ త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఇలాంటి స‌మ‌యంలో నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకునేలా నాయ‌కుల‌ను బుజ్జ‌గించ‌డం తొలి మార్గం. అప్ప‌టికీ సాధ్యం కాక‌పోతే.. పార్టీ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించ‌డం. అది కూడావ‌ర్క‌వుట్ అవ‌క‌పోతే.. స్నేహ‌పూర్వ కంగానే ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంది. మంచి-చెడుల‌ను ప్ర‌జ‌లే తేలుస్తారు. మొత్తంగా.. ఆయా ప్రాంతాల్లో స్నేహ పూర్వ‌క పోటీ త‌ప్ప‌ద‌న్న సంకేతాలు అయితే వ‌స్తున్నాయి. అయితే.. ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉన్న నేప‌థ్యంలో ఏం చేస్తార‌న్న‌ది చూడాలి.

Tags:    

Similar News