క్లైమాక్స్ దిశగా కొలికపూడి ఎపిసోడ్..?
తెలుగుదేశం పార్టీలో అందరి దృష్టి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం పైనే ఉంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు పార్టీ అధిష్టానానికి ఒక పట్టాన మింగుడు పడటం లేదు.;
తెలుగుదేశం పార్టీలో అందరి దృష్టి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం పైనే ఉంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు పార్టీ అధిష్టానానికి ఒక పట్టాన మింగుడు పడటం లేదు. ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో ముందుంటారని భావించి టికెట్ ఇస్తే.. ఇప్పుడు ఆయన సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ, పార్టీ లైన్ దాటుతుండటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన చేస్తున్న ధర్నాలు, సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే ఈ ఎపిసోడ్ త్వరలోనే ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది.
నిజానికి ఎన్నికల గెలుపు తర్వాత ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య సఖ్యత ఉంటుందని అందరూ భావించారు. కానీ రోజులు గడిచేకొద్దీ ఆ గ్యాప్ కాస్తా అగాధంగా మారిపోయింది. నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలోనే కాకుండా, అభివృద్ధి పనుల విషయంలో కూడా ఇద్దరి మధ్య పొసగడం లేదు. ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత పోరుగా మిగిలిపోకుండా, ఏకంగా ప్రభుత్వం ప్రతిష్టకే భంగం కలిగించేలా మారుతుండటంతో పచ్చ తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.
లోకల్ లీడర్స్ అల్టిమేటం!
ఎమ్మెల్యే తీరుతో నియోజకవర్గంలో క్యాడర్ కన్ఫ్యూజన్‌లో ఉందని తిరువూరు స్థానిక నేతలు బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు క్రమశిక్షణా కమిటీ ముందు హాజరైన కొలికపూడి, తన వివరణ ఇచ్చుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని తెలుస్తోంది. ఆయన చేస్తున్న ధర్నాలు ప్రభుత్వ వైఫల్యంగా విపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయని, ఇలాగే వదిలేస్తే వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి కోలుకోలేని నష్టం జరుగుతుందని అధిష్టానంపై స్థానిక నేతలు ఒత్తిడి పెంచుతున్నారు.
అయితే తిరువూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ఏదైనా చర్య తీసుకుంటే అది కుల సమీకరణాలపై ప్రభావం చూపుతుందేమోనన్నది అధిష్టానం భావిస్తోంది. అందుకే చంద్రబాబు నాయుడు స్వయంగా హెచ్చరించినా, కొలికపూడికి మరిన్ని అవకాశాలు ఇస్తూ వచ్చారు. కానీ, ఇటీవల కుల సంఘాల రంగప్రవేశం, మీడియా వేదికగా విమర్శలు పెరగడంతో ఇక ఉపేక్షించే పరిస్థితి లేదని సమాచారం. చర్యలు తీసుకోకపోతే లోకల్ లీడర్స్ చేతులెత్తేసే ప్రమాదం ఉంది, చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యే ఏకంగా రెబల్ జెండా ఎగరేసే అవకాశం ఉంది.
మొత్తంగా చూసుకుంటే తిరువూరు రాజకీయాలు ఇప్పుడు క్లైమాక్స్ సీన్‌ను తలపిస్తున్నాయి. పార్టీ పెద్దలు తీసుకునే తదుపరి నిర్ణయం కొలికపూడి రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాకుండా, నియోజకవర్గంలో టీడీపీ పట్టును కూడా డిసైడ్ చేయబోతోంది. మరి ఈ వివాదానికి చెక్ పడుతుందా లేక కొత్త మలుపు తీసుకుంటుందా అనేది వేచి చూడాలి.