బిగ్ డిబేట్: 40 శాతం ఎల్ నినో ప్రభావం తగ్గించే టెక్నాల‌జీ ఉందా?

ప్రస్తుతం భూమండలంపై సూపర్ ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో దీని తీవ్రతను సాంకేతికత ద్వారా తగ్గించవచ్చా అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

Update: 2026-10-07 07:27 GMT

ప్రస్తుతం భూమండలంపై సూపర్ ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో దీని తీవ్రతను సాంకేతికత ద్వారా తగ్గించవచ్చా అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్ప‌టి నుంచి డిసెంబ‌ర్ జ‌న‌వ‌రి వ‌ర‌కూ భూతాపం అంత‌కంత‌కు పెరుగుతుంద‌ని, పొడి వాతావ‌ర‌ణం ముప్పుగా ప‌రిణ‌మిస్తుంద‌ని రిపోర్టులు వెలువ‌డ్డాయి. అయితే ఈ స‌మ‌యంలోనే ఒక నూత‌న సాంకేతిక‌త గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌ఖ్యాత‌ `సైన్స్ అడ్వాన్సెస్` జర్నల్‌లో ప్రచురితమైన ఒక నూతన అధ్యయనం ప్రకారం.. సముద్రపు మేఘాల ప్రకాశాన్ని కృత్రిమంగా పెంచే `మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్` (MCB) పద్ధతి ద్వారా పసిఫిక్ మహాసముద్రం ఉష్ణోగ్రతలను తగ్గించి సూపర్ ఎల్ నినోను బలహీనపరచడం సాధ్యమని వెల్లడైంది.

ఈ పద్ధతిలో భాగంగా ఆగ్నేయ పసిఫిక్ సముద్రంపై ఉన్న అల్ప మేఘాలలోకి అతి సూక్ష్మమైన సముద్రపు ఉప్పు నీటి బిందువులను స్ప్రే చేస్తారు. దీనివల్ల మేఘాల సాంద్రత పెరిగి, సూర్యరశ్మిని మరింత ఎక్కువగా అంతరిక్షంలోకి పరావర్తనం చెందిస్తాయి. ఆస్ట్రేలియాలో 2019-2020 మధ్య సంభవించిన `బ్లాక్ సమ్మర్` కార్చిచ్చుల సమయంలో వెలువడిన పొగ కణాలు సహజంగానే మేఘాలను ప్రకాశవంతం చేసి `లా నినా` వంటి వాతావరణ పరిస్థితులకు దారితీసిన ఘటన ఈ పరిశోధనకు ప్రధాన స్ఫూర్తిగా నిలిచింది.

ఈ సాంకేతిక జోక్యం ఎల్ నినో చక్రం ప్రారంభ దశలోనే అమలు చేస్తే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని కంప్యూటర్ సిమ్యులేషన్స్ ద్వారా నిరూపితమైంది. ఇది `బియర్క్‌నెస్ ఫీడ్‌బ్యాక్ లూప్` ప్రక్రియను దెబ్బతీస్తుంది. ఒకవేళ దీనిని మధ్య పసిఫిక్ ప్రాంతంలో అమలు చేస్తే.. లా నినా లాంటి శీతలీకరణ, పొడి వాతావరణ పరిస్థితులు 40 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 1997, 2015 నాటి ఎల్ నినో సంఘటనల ఆధారంగా ఈ విషయాన్ని విశ్లేషించారు.

అయితే ఈ సాంకేతికతతో కొన్ని నష్టాలు- పరిమితులు కూడా ముడిపడి ఉన్నాయి. ప్రాంతీయ వాతావరణ నమూనాలను కృత్రిమంగా మార్చడం వల్ల అనుకోని దుష్ప్రభావాలు ఏర్పడే ప్రమాదం ఉంది. దీనివల్ల `మెగా లా నినా` పరిస్థితులు తలెత్తడంతో పాటు ఐరోపా, ఆసియా లాంటి ప్రాంతాలలో ఊహించని వాతావరణ మార్పులు సంభవించే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక వాతావరణ రిస్క్‌లను తగ్గించడానికి ఒకసారి చేసే పరిష్కారం కాకుండా, నిరంతరం భారీ స్థాయిలో ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.

ఇంత‌ భారీ స్థాయి అమలుకు అవసరమైన ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతం పూర్తిగా అందుబాటులో లేదు. దీని ఆచరణలో ఇంజనీరింగ్ పరమైన సవాళ్లతో పాటు... కఠినమైన పాలనాపరమైన అడ్డంకులు కూడా పెద్ద సమస్యగా మారాయి. సాంకేతికత ద్వారా ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించడం సైద్ధాంతికంగా ఆసక్తికరంగా ఉన్నా పర్యావరణంపై దీని దీర్ఘకాలిక ప్రభావాల గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Tags:    

Similar News