‘అమెరికాకు ఒక న్యాయం.. భారత్‌కు మరొకటా? మస్క్‌ వ్యాఖ్యలపై భారత నెటిజన్ల ఫైర్

అమెరికన్స్ చేస్తే సంసారం.. అదే ఇతర దేశాలు చేస్తే వ్యభిచారం.. అగ్రరాజ్యంలో ట్రంప్ కే కాదు.. అక్కడి వ్యాపార దిగ్గజాలకు కూడా ఇదే సూత్రం కనిపిస్తుంది.

Update: 2026-10-08 15:30 GMT

అమెరికన్స్ చేస్తే సంసారం.. అదే ఇతర దేశాలు చేస్తే వ్యభిచారం.. అగ్రరాజ్యంలో ట్రంప్ కే కాదు.. అక్కడి వ్యాపార దిగ్గజాలకు కూడా ఇదే సూత్రం కనిపిస్తుంది. వాళ్లు వేరే దేశాల మీదపడొచ్చు. రానీయకపోతే అన్యాయం అంటూ గగ్గోలు పెడుతారు. అదే సమయంలో వారి మార్కెట్లో ఇతర దేశాల వారికి నిషేధాజ్ఞలు.. ఇదేం వ్యాపారం.. “మీ దేశంలో చైనా ఈవీలు, హువావే ఫోన్లు కనిపిస్తే ‘అమ్మో.. జాతీయ భద్రత ప్రమాదంలో పడింది’ అని రోడ్లన్నీ బ్లాక్ చేస్తారు... అదే భారత్ తన భద్రత కోసం నాలుగు రూల్స్ మాట్లాడితే మాత్రం ‘ఇది టెలికాం మోనోపలీ, ఒలిగార్క్స్‌ల కుట్ర’ అని క్లాసులు పీకుతారు.. బాగుందయ్యా మస్క్ భయ్యా మీ ద్వంద్వ ప్రమాణాల లాజిక్” స్టార్‌లింక్ వివాదంపై అమెరికా టెక్ మొఘల్ ఎలాన్ మస్క్‌కి మనోళ్లు పీకిన సెటైరికల్ ‘ఎక్స్ ’ క్లాస్ వైరల్ అవుతోంది.

స్టార్‌లింక్‌ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లోకి అడుగుపెట్టకుండా కొందరు వ్యాపార దిగ్గజాలు అడ్డుకుంటున్నారంటూ స్పేస్‌ఎక్స్ అధినేతి ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత టెలికాం మార్కెట్‌లో తమ గుత్తాధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందోనన్న భయంతోనే శక్తివంతమైన వ్యాపారవేత్తలు తన సంస్థను నిరోధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై భారత నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మస్క్‌కు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు.

భారత్ పెడితే మోనోపలీ.. అమెరికా పెడితే జాతీయ భద్రతా?

అమెరికా మార్కెట్‌లో విదేశీ కంపెనీలపై ఆంక్షలు విధించినప్పుడు అది ‘జాతీయ భద్రత’ అయినప్పుడు.. భారత్ తన నిబంధనలు అమలు చేస్తే అది ‘గుత్తాధిపత్యం’ ఎలా అవుతుందంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చైనా ఈవీ దిగ్గజం బీవైడీపై అమెరికా 100 శాతం టారిఫ్‌లు విధించడంతో పాటు కనెక్టెడ్ వాహనాలపై కఠిన పరిమితులు విధించడాన్ని వీరు ఉదాహరణగా చూపుతున్నారు. అలాగే చైనా మిలిటరీతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో బీవైడీని అమెరికా రక్షణ శాఖ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

మరోవైపు టెలికాం రంగంలో హవాయి, జెడ్.టీఈ వంటి సంస్థలపై జాతీయ భద్రతా కారణాలతో అమెరికా అనేక ఏళ్లుగా నిషేధాలు కొనసాగిస్తోంది. సొంత దేశం భద్రత కోసం విదేశీ కంపెనీలను కట్టడి చేయడం అమెరికాకు హక్కు అయినప్పుడు భారత్ తన భద్రతా ప్రమాణాలను పాటించమనడం తప్పెలా అవుతుందని మస్క్ ద్వంద్వ ప్రమాణాలను నెటిజన్లు ఎండగడుతున్నారు.

అసలు స్టార్‌లింక్‌ను భారత్ బ్యాన్ చేసిందా?

వాస్తవానికి భారత్ స్టార్‌లింక్ సేవలను నిలిపివేయలేదు. ఇప్పటికే ఆ సంస్థకు జీఎంపీసీఎస్ లైసెన్స్ సహా స్పేస్ రెగ్యులేటర్ అనుమతులు లభించాయి. దేశీయంగా 20 గేట్‌వే సైట్లను కూడా ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ద్వారా భారత వినియోగదారుల డేటా దేశంలోనే ఉంచడం.. చట్టబద్ధమైన నెట్‌వర్క్ పర్యవేక్షణ, అత్యవసర సమయాల్లో నిరోధించే వెసులుబాటు వంటి కీలక భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియలు ప్రొసెసింగ్‌లో ఉన్నాయి. స్టార్‌లింక్‌తో పాటు మరో రెండు సంస్థలు కూడా ఇదే భద్రతా సమీక్షల దశలో ఉన్నాయి.

భారత టెలికాం దిగ్గజాలను పరోక్షంగా టార్గెట్ చేస్తూ మస్క్ చేసిన వ్యాఖ్యలు వ్యాపార ప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించే కొత్త సాంకేతికత భారత్‌కు అవసరమే అయినప్పటికీ జాతీయ భద్రత, డేటా సార్వభౌమత్వాన్ని పక్కనపెట్టి ఏ విదేశీ సంస్థకూ అనుమతులు ఇవ్వడం సాధ్యపడదు. "మా మార్కెట్‌లోకి రావాలంటే మా దేశ నిబంధనలు పాటించాల్సిందే.. భారత్‌ను ప్రశ్నించే ముందు మీ దేశ వైఖరిని సరిచూసుకోండి" అని భారత నెటిజన్లు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట మారుమోగుతోంది.

Tags:    

Similar News