అల్పాహార విందు కోసం రాలేదు.. వినతిపత్రం ఇచ్చేందుకే

ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కలిసిన వైనం వివాదంగా మారటం తెలిసిందే.;

Update: 2026-04-20 05:28 GMT

ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కలిసిన వైనం వివాదంగా మారటం తెలిసిందే. 131వ రాజ్యాంగ సవరణ కోసం లోక్ సభలో ప్రవేశ పెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గళం విప్పటం.. అందుకు తగ్గట్లే సీఎం రేవంత్ సైతం తన వ్యతిరేకతను వ్యక్తం చేయటం తెలిసిందే. అనూహ్య రీతిలో బిల్లు వీగిన వైనం ఎన్డీయే పక్షానికి షాక్ కు గురి చేస్తే.. ఇండీ వర్గం తాము సాధించిన విజయంగా పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఇచ్చిన అల్పాహార విందుకు హాజరయ్యారు

ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన రేవంత్ కు విందు ఇవ్వటమా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో.. సీఎం రేవంత్ పైనా ట్రోల్ జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఈ విందు కార్యక్రమం రాజకీయపరంగా కాదని.. పరిపాలనా అవసరాల నేపథ్యంలో జరిగినట్లుచెప్పారు. ఆ మాటకు వస్తే.. జరిగింది విందు కానే కాదన్నారు.

తెలంగాణకు తమ శాఖ నుంచి 2500 ఎలక్ట్రిక్ బస్సుల మంజూరు ఇప్పటికే జరిగిందని.. అందుకు సంబంధించిన బస్సులను త్వరగా తమకు పంపాలన్న విషయాన్ని తమకు తెలియజేందుకు సీఎం రేవంత్ రెడ్డి వినతిపత్రంతో వచ్చారన్నారు. ఈ సందర్భంగా తన ఇంట్లో అల్పాహారం తీసుకున్నారని.. దీనికి అల్పాహార విందు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయేలా చేసిన ఇండి కూటమి చారిత్రక తప్పు చేసిందన్నారు. పార్లమెంట్ లో మహిళల హక్కులకు విరుద్ధంగా జరిగిందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చూస్తుంటే.. సోషల్ మీడియాలో పోస్టు కేంద్రమంత్రిని ఇరుకున పడేలా చేశాయని.. అందుకే వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్న మాట బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News