జగన్ వెనకాలే షర్మిల ఉండేది కానీ...సోము హాట్ కామెంట్స్ !

చాలా కాలానికి బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉగ్ర రూపం చూపించారు సిసలైన ఫైర్ బ్రాండ్ ని అని కూడా అనిపించారు.;

Update: 2025-09-10 17:12 GMT

చాలా కాలానికి బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉగ్ర రూపం చూపించారు సిసలైన ఫైర్ బ్రాండ్ ని అని కూడా అనిపించారు. ఆయనలో ఈ తరహా ఫైర్ చూసి చాలా రోజులు అయింది. ఆయన తన ఫైర్ ని అంతా ఒక ఇద్దరి మీద తీవ్ర స్థాయిలో చూపించారు. అందులో ఒకరు మాజీ ఎంపీ మాజీ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్. రెండవ వారు ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల. ఈ ఇద్దరి మీద సోము వీర్రాజు ఇంతలా ఫైర్ కావడానికి కారణం ఏంటి అంటే ఉంది చాలానే అని చెప్పాలి.

ఆర్ఎస్ఎస్ ని అన్నందుకే :

ఆర్ఎస్ఎస్ ని తీవ్రంగా విమర్శించే వారిలో మాజీ ఎంపీ ఉండవల్లి ముందు వరసలో ఉంటారు. ఆయన ఆర్ఎస్ఎస్ వ్యతిరేక భావజాలం కలిగిన వారు అని అంటారు. తాజాగా ఇండియా కూటమికి నుంచి ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయమని ఉండవల్లి ఒక మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వారు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్ది సీపీ రాధాక్రిష్ణన్ అన్నారు. ఆయనకు ఓటేస్తే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అంగీకరించినట్లే అని కూడా అన్నారు. తెలుగు రాష్ట్రాల పార్టీలు ఎన్డీయేకు ఓటు వేయవద్దు అని కూడా ఆయన కోరారు. ఇక వైఎస్ షర్మిల కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తికి ఓటు వేశారు అని జగన్ మీద గట్టిగానే విరుచుకుపడ్డారు. దాంతో ఈ ఇద్దరి మీద సోము వీర్రాజు ఘాటు విమర్శలు చేశారు.

ఉండవల్లితో చర్చకు సిద్ధం :

ఆర్ఎస్ఎస్ గురించి ఉండవల్లితో బహిరంగ చర్చకు తాను సిద్ధం అని సోము వీర్రాజు సవాల్ చేశారు. ఇష్టం వచ్చినట్లుగా ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రమాదకరం అని ఉండవల్లి అనడం మీద ఆయన ఫైర్ అయ్యారు. దాంతో రాజమండ్రిలో సుబ్రమణ్య మైదానంలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నాను అని తన సవాల్ ని స్వీకరించి ఉండవల్లి చర్చకు రావాలని ఆయన కోరారు.

షర్మిల మీదా అదే ఫైర్ :

మరో వైపు వైఎస్ షర్మిల మీద కూడా ఆయన అదే రకమైన ఫైర్ ని చూపించారు. షర్మిల ఎన్డీయే అభ్యర్ధికి ఓటేసినందుకు జగన్ ని విమర్శిస్తున్నారు అని ఆర్ఎస్ఎస్ ని కూడా విమర్శిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. ఆమె ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో కానీ జగన్ ఆమెకు ఆస్తిలో వాటా ఇస్తే ఆయన వెనకాలే ఉండేది అని సెటైర్లు వేశారు. అంటే షర్మిల రాజకీయం అంతా అన్న మీద కోపంతోనే అన్నట్లుగా సోము వీర్రాజు తేల్చారు అన్న మాట.

జగన్ ని వెనకేసుకొచ్చారా :

బీజేపీ నిలబెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్ధికి ఓటేసినందుకు ఇండియా కూటమి పక్షాలు సహా అంతా జగన్ ని విమర్శిస్తున్నారు. అయితే బీజేపీ నుంచి ఇప్పటిదాకా ఎవరూ ఆయనకు కనీసం మాట సాయంగా కూడా ఆయన వైపు నిలబడలేదు అని అంటారు కానీ సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్ అన్నారనో లేక ఎన్ డీయే అభ్యర్ధిని అన్నారనో మొత్తానికి బయటకు వచ్చి తమ వ్యతిరేక పార్టీలను విమర్శించారు. పనిలో పనిగా జగన్ ఓటేస్తే విమర్శిస్తారా అని షర్మిల మీద కూడా కస్సుమన్నారు. అలా ఏపీ బీజేపీ నుంచి జగన్ ని ఇండైరెక్ట్ గా అయినా కాసిన ఏకైక నాయకుడిగా సోము వీర్రాజు ఇప్పటికి అయితే కనిపించారు అని అంటున్నారు.

Tags:    

Similar News