టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. తొలి రాజకీయ అరెస్టు, నెక్ట్స్ బిగ్ వికేటేనా?

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరమైంది.;

Update: 2025-10-30 09:42 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నెయ్యి సరఫరాదారులను అరెస్టు చేసిన సిట్ అధికారులు తొలిసారిగా రాజకీయ ప్రమేయంపై ఫోకస్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు కడూరు చిన్న అప్పన్నను బుధవారం హైదరాబాదులో అరెస్టు చేసింది. దీంతో కల్తీ నెయ్యికేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టు అయిన వారిలో ఏ ఒక్కరికీ రాజకీయ నేపథ్యం లేదు. కానీ, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పీఏ అరెస్టుతో ఇకపై రాజకీయ నాయకుల అరెస్టులు ఉంటాయా? అన్న చర్చ మొదలైంది.

నిందితుడు చిన్న అప్పన్న స్వస్థలం విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాములవలసగా చెబుతున్నారు. ఆయన గత కొన్నేళ్లుగా వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారు. హైదరాబాదులో ఉంటూ వైవీ వ్యక్తిగత, వ్యాపార లావాదేవీలను పర్యవేక్షిస్తుంటారని సిట్ పోలీసులు వెల్లడించారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన డీలర్లకు చిన్న అప్పన్న సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గత జూన్ 4వ తేదీన నిందితుడు చిన్న అప్పన్నను తిరుపతిలో సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించారు.

అప్పట్లోనే ఈ కేసులో రాజకీయ ప్రమేయంపై సిట్ ఫోకస్ చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ పరిణామం తర్వాత సిట్ లో దర్యాప్తు అధికారిగా తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావును కొనసాగించడాన్ని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, కేసు దర్యాప్తుపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీంతో కేసు దర్యాప్తు మూడు నెలలుగా నిలిచిపోయింది. ఇక తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు మళ్లీ మొదలైంది. ఇదే సమయంలో మాజీ చైర్మన్ వైవీ పీఏ చిన్న అప్పన్నను సిట్ అరెస్టు చేసింది.

ఈ అరెస్టుతో సిట్ కీలక స్టెప్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. సుప్రీం తాజా ఆదేశాలతో నిందితుడు చిన్న అప్పన్నను బుధవారం విచారణకు పిలిచిన సిట్ అధికారులు రాత్రి 8 గంటల సమయంలో అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఈ కేసులో అప్పన్నను ఏ24గా పేర్కొన్నారు. కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి ఇంతవరకు సిట్ 15 మందిని అరెస్టు చేసింది. అప్పన్న అరెస్టు తర్వాత ఈ సంఖ్య 16కు చేరింది. మరోవైపు ఈ వ్యవహారంలో తొలిసారి రాజకీయ సంబంధాలపై సిట్ దృష్టి పెట్టడంతో ఏం జరుగుతుందనే టెన్షన్ ప్రతిపక్షం వైసీపీలో కనిపిస్తోంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏను అరెస్టు చేయడంతో ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News