మానవ మెదడు రహస్యాలను ఛేదించేందుకు 'మినీ మెదళ్ల' రూపకల్పన

వైద్య రంగంలో శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు రోజురోజుకూ కొత్త అద్భుతాలకు తెరతీస్తున్నాయి. మానవ శరీరంలో అత్యంత సంక్లిష్టమైన.. ఇప్పటికీ లొంగని అనేక రహస్యాలు దాగి ఉన్న అవయవం మెదడు.

Update: 2026-08-12 23:30 GMT

వైద్య రంగంలో శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు రోజురోజుకూ కొత్త అద్భుతాలకు తెరతీస్తున్నాయి. మానవ శరీరంలో అత్యంత సంక్లిష్టమైన.. ఇప్పటికీ లొంగని అనేక రహస్యాలు దాగి ఉన్న అవయవం మెదడు. అటువంటి మానవ మెదడును మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో 'మినీ మెదళ్లను' తయారు చేస్తున్నారు. వీటిని వైద్య పరిభాషలో 'సెరెబ్రల్ ఆర్గానాయిడ్స్' అని పిలుస్తారు. ఇవి మనిషి మెదడుకు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయాలు లేదా ప్రతిరూపాలు కాకపోయినప్పటికీ మెదడులోని కొన్ని ముఖ్యమైన నిర్మాణాలు, నాడీ కణాల ప్రవర్తనను ప్రయోగశాల వాతావరణంలో సమగ్రంగా అధ్యయనం చేసేందుకు పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ఈ మినీ మెదళ్ల తయారీ వెనుక ఒక ఆసక్తికరమైన సాంకేతిక ప్రక్రియ దాగి ఉంది. శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన స్టెమ్ కణాలను లేదా మూలకణాలను ఉపయోగించి ఈ ఆర్గానాయిడ్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రయోగశాలలో తగిన ఉష్ణోగ్రత, అనుకూల పరిస్థితులను కల్పిస్తూ స్టెమ్ కణాలను పెంచుతారు. ఈ క్రమంలో అవి సహజంగానే మనిషి మెదడులో కనిపించే వివిధ రకాల కణాలుగా మారేలా ప్రేరేపిస్తారు. కొంతకాలం తర్వాత ఈ కణాలన్నీ కలిసి ఒక చిన్నపాటి త్రీడీ నిర్మాణంగా ఏర్పడతాయి. ఈ నిర్మాణాలలో నిజమైన మెదడు కణాల మాదిరిగానే పనిచేసే న్యూరాన్లు రూపాంతరం చెంది, కొన్ని రకాల నాడీ సంబంధిత విద్యుత్ సంకేతాలను, కార్యకలాపాలను ప్రదర్శిస్తాయి.

అయితే ఈ ఆర్గానాయిడ్స్‌ను నిజమైన మానవ మెదడుతో సమానంగా చూడటం సరికాదు. మినీ మెదళ్లకు సంపూర్ణమైన మెదడు ఆకారం కానీ, రక్త ప్రసరణ వ్యవస్థ కానీ, సమాచారాన్ని స్వీకరించే ఇంద్రియ వ్యవస్థలు కానీ ఉండవు. అందువల్ల ఇవి మనుషుల మాదిరిగా ఆలోచించడం, మాట్లాడటం, అనుభూతులను గ్రహించడం లేదా స్వయంప్రతిపత్తితో స్పందించడం వంటివి చేయలేవు. ఇవి కేవలం మెదడు కణాల పెరుగుదల, పనితీరును గమనించడానికి రూపొందించిన ఒక జీవసంబంధిత అధ్యయన నమూనాలు మాత్రమే.

శాస్త్రవేత్తలు ఈ సవాలుతో కూడిన పరిశోధనలు చేపట్టడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం మానసిక, నాడీ సంబంధిత వ్యాధులు ఎలా మొదలవుతాయో స్పష్టంగా తెలుసుకోవడమే. ఆటిజం, స్కిజోఫ్రెనియా, ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి , అల్జీమర్స్ వంటి వ్యాధులు రావడానికి గల కారణాలను అర్థం చేసుకోవడంలో ఈ ఆర్గానాయిడ్స్ కీలకమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. మనిషి మెదడు అభివృద్ధి చెందే ప్రారంభ దశలోనే వ్యాధి ఏ విధంగా మొదలవుతోంది.. ఏయే కణాలలో అసాధారణ మార్పులు జరుగుతున్నాయి.. అలాగే జన్యుపరమైన లోపాలు మెదడు పరిణామంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనే సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

దీంతో పాటు నూతన ఔషధాల పరిశోధన, పరీక్షల ప్రక్రియలో కూడా మినీ మెదళ్లు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. సాధారణంగా ఒక కొత్త మందును తయారు చేసినప్పుడు అది మెదడు కణాలపై ఎలా పనిచేస్తుంది.. దాని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందనేది ముందే తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ఈ మినీ మెదళ్లపై ప్రయోగాలు చేయడం ద్వారా ఔషధాల ప్రభావాన్ని చాలా త్వరగా ఖచ్చితత్వంతో అంచనా వేయవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రతి వ్యక్తి యొక్క జన్యుపరమైన ప్రత్యేకతలకు అనుగుణంగా వారి స్టెమ్ కణాల నుంచే ఆర్గానాయిడ్స్‌ను తయారు చేసి వారికి ఏ రకమైన వైద్యం సరిపోతుందో నిర్ణయించే 'పర్సనల్ వైద్యం' దిశగా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి.

మొత్తంగా చూస్తే ప్రయోగశాలల్లో మినీ మెదళ్ల తయారీ అనేది మానవ మెదడుకు సంపూర్ణ ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ వైద్య విజ్ఞాన రంగంలో ఇది ఒక అద్భుతమైన సాంకేతిక మైలురాయి. ఇప్పటివరకు పరిశోధకులకు చిక్కుముడిగా మారిన మెదడు రహస్యాలను ఛేదించడానికి భవిష్యత్తులో భయంకరమైన నాడీ సంబంధిత వ్యాధులకు సత్వర చికిత్సలు.. అత్యంత సమర్థవంతమైన మందులను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ 'సెరెబ్రల్ ఆర్గానాయిడ్స్' ఒక కీలకమైన ఆయుధంగా ఉపయోగపడుతున్నాయి.

Tags:    

Similar News