హైదరాబాద్ లో యాపిల్ రోడ్.. గూగుల్ గల్లీ.. అమెజాన్ అడ్డా.. టీసీఎస్ చౌరస్తా
అవును.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ట్రెండ్ కు తెర తీశారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో నాయకుల పేర్లు.. కాలనీలకు.. రోడ్లకు ఉండటం చూశాం.;
అవును.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ట్రెండ్ కు తెర తీశారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో నాయకుల పేర్లు.. కాలనీలకు.. రోడ్లకు ఉండటం చూశాం. ఈ తీరుకు భిన్నంగా కొత్త తరహా ఆలోచనను తెర మీదకు తీసుకొచ్చారు సీఎం రేవంత్. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పలు రోడ్లకు వివిధ సంస్థల పేర్లు పెడతామని పేరకొన్నారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్.. అమెజాన్.. మెటా.. టీసీఎస్.. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల పేర్లు పెట్టనున్నట్లుగా పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని తరచూ చెప్పే తెలంగాణ సీఎం.. తాజాగా ఢిల్లీలో జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు - భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సుకు హాజరై.. ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని గడిచిన 35 ఏళ్లలో కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీలు పాలించాయని పేర్కొంటూ.. ‘‘పెట్టుబడులకు.. పెట్టుబడిదారులకు అన్ని పార్టీలు మద్దతుగా నిలిచాయి. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారం. హైదరాబాద్ లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. గడిచిన 23 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో డెవలప్ మెంట్.. సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టాం. 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే నూతన నగరంగా మారుతుంది’’ అన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
తాము తలపెట్టిన మూసీ ప్రక్షాళన పూర్తి అయితే లండన్.. టోక్యో.. దుబాయ్.. సియోల్ రివర్ ఫ్రంట్ మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కూడా కొత్త దశలోకి ప్రవేశిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సీఎం రేవంత్.. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని పలు రోడ్లకు వివిద సంస్థల పేర్లు పెడతామని ప్రకటించారు. దీంతో.. రానున్న రోజుల్లో వివిధ టెక్ సంస్థల పేర్లు వివిధ ప్రాంతాలకు రానున్నాయన్న మాట. తాము ప్రారంభించిన పలు ప్రాజెక్టులు చైనా ప్లస్ వన్ మోడల్ కు గ్లోబల్ సమాధానంగా తెలంగాణ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సీఎం రేవంత్. మొత్తంగా రోటీన్ కు భిన్నమైన మోడల్ లో వెళుతున్న రేవంత్ తాను అనుకున్న లక్ష్యాల్ని ఎంత మేర పూర్తి చేస్తారో చూడాలి.