జూపల్లి వర్సెస్ రిజ్వీ.. ఇవేం పంచాయితీలు రేవంత్?

ఆ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న జూపల్లి సీఎంకు లేఖ రావటంతో ఇప్పటివరకు తెర వెనుక జరిగిన వ్యవహారం ఇప్పుడు తెర మీదకు వచ్చింది.;

Update: 2025-10-23 07:30 GMT

ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న పంచాయితీలు రేవంత్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న మంత్రి కొండా సురేఖ వ్యవహారం అయితే.. తాజాగా మరో మంత్రి జూపల్లి క్రిష్ణారావు వ్యవహారం. ఈ రెండు అంశాల్లోనూ కామన్ పాయింట్ ఏమంటే.. మంత్రికి అధికారులకు మధ్య ఉన్న ‘పంచాయితీ’. మంత్రి కొండా విషయంలో ఆమెకు నమ్మకస్తుడైన సంపత్ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్ కావటం ఒక ఎత్తు అయితే.. తాజాగా తెర మీదకు వచ్చిన మంత్రి జూపల్లి ఎపిసోడ్ లో ఎవరూ ఎలాంటి ఫిర్యాదులు చేయకుండానే.. ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవటం సంచలనంగా మారింది.

మరో పదేళ్ల సర్వీసు ఉండటంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాకు చేరుకునే అవకాశం ఉన్న ఆయన వ్యక్తిగత కారణాలతో వీఆర్ఎస్ తీసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో రిజ్వీ ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న జూపల్లి సీఎంకు లేఖ రావటంతో ఇప్పటివరకు తెర వెనుక జరిగిన వ్యవహారం ఇప్పుడు తెర మీదకు వచ్చింది.

మంత్రి హోదాలో తాను ఇచ్చిన ఆదేశాల్ని ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రిజ్వీ పట్టించుకోలేదని.. ఈ అంశంపై చర్య తీసుకోవాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన జూపల్లి వ్యవహారం ఇప్పుడు సీఎం వద్దకు చేరినట్లుగా చెబుతున్నారు. మరోవైపు.. రిజ్వీ తాను వీఆర్ఎస్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పేర్కొంటూ పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. నిజాయితీ అధికారిగా పేరున్నరిజ్వీ మంత్రి జూపల్లి ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఇలాంటి వేళ బీఆర్ఎస్ మీడియా సంస్థలు రేవంత్ సర్కారుపై ఒంటి కాలి మీద విరుచుకుపడుతోంది. మంత్రి మూటల దాహంతోనే ఇలాంటి పరిస్థితి ఉందంటూ మండిపడుతోంది. ఇలాంటి పంచాయితీలతో రేవంత్ సర్కారుకు కొత్త చిక్కులు ఎదురు కావటమే కాదు.. ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. రేవంత్ సర్కారు కొలువు తీరి రెండేళ్లు కావొస్తున్నా.. ఇప్పటికి పాలన మీద పట్టు రాలేదన్న విమర్శ వినిపిస్తున్న వేళలోనే.. మంత్రులకు సంబంధించిన పంచాయితీలు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్న వైనం రేవంత్ సర్కారు ఇమేజ్ ను దెబ్బ తీసేలా మారిందంటున్నారు.

తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ ఒక విధానాన్ని పక్కాగా పాటిస్తున్నారు. తన సహచర మంత్రుల విషయంలో పెద్దగా జోక్యం చేసుకోకుండా ఉండటం.. వారి శాఖకు సంబంధించి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో పాటు.. ఇతర అంశాల్లోనూ కలుగజేసుకోవటం లేదు. కీలక నిర్ణయాలు సైతం వారికే వదిలేస్తున్నారు. ఈ కారణంగా.. మంత్రులకు సంబంధించిన అంశాలు.. పాలనా అంశాలు కేసీఆర్ హయాంలో మాదిరి సింగిల్ విండోగా కాకుండా మల్టిఫుల్ విండోగా మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వటం తప్పు లేదు కానీ.. అపరిమిత స్వేచ్ఛ కూడా అంత మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ తన పద్దతిని మార్చుకునే అంశంపై ఫోకస్ చేయాలంటున్నారు. లేదంటే.. ప్రభుత్వ ఇమేజ్ కు దెబ్బ పడటమే కాదు.. రాజకీయ ప్రత్యర్థులకు బందరు లడ్డూ లాంటి అవకాశాల్ని ఇచ్చినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. రేవంత్ అంత సాహసం చేస్తారా? అన్నది అసలు ప్రశ్న.

Tags:    

Similar News