బీజేపీ ఫైర్... పార్లమెంటుకు రేణుకా చౌదరి పెంపుడు కుక్క!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా... ఉదయం 11 గంటలకు ఉభయ సభలూ సమావేశమవ్వగా.. ఇటీవల మృతి చెందిన సభ్యులకు లోక్ సభ సంతాపం ప్రకటించింది.;

Update: 2025-12-01 08:41 GMT

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా... ఉదయం 11 గంటలకు ఉభయ సభలూ సమావేశమవ్వగా.. ఇటీవల మృతి చెందిన సభ్యులకు లోక్ సభ సంతాపం ప్రకటించింది. ఇదే సమయంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు సభ్యులు అభినందనలు తెలియజేశారు. మరోవైపు.. రేణుకా చౌదరి వ్యవహారం ఈ సందర్భంగా హాట్ టాపిక్ గా మారింది.

అవును... పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజునే హాట్ హాట్ కామెంట్స్ తో వేడెక్కిపోగా.. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా... పార్లమెంట్ సమావేశాల తొలి రోజున ఆమె తన పెంపుడు కుక్కతో కారులో పార్లమెంట్ భవనానికి వచ్చారు. దీంతో ఈ వ్యవహారం కొత్త వివాదానికి దారీ తీసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.

ఈ వ్యవహారంపై రేణుకా చౌదరిని జాతీయ మీడియా ప్రశ్నించగా.. ఆమె తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా... తాను తన పెంపుడు జంతువును తీసుకురావడంలో సమస్య ఏమిటి? ఒక మూగ జంతువు లోపలికి వస్తే సమస్య ఏమిటి? అని ప్రశ్నించిన రేణుకా చౌదరి.. అది చాలా చిన్నదని.. అది కరవదని.. పార్లమెంటు లోపల కరిచే ఇతరులు ఉన్నారని ఆమె జవాబిచ్చారు. ఈ సమాధానం మరింత హాట్ టాపిక్ గా మారింది!

బీజేపీ ఫైర్!:

ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇందులో భాగంగా... రేణుకా చౌదరిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ డిమాండ్ చేశారు. ఈ సభ జాతీయ విధానాలను చర్చించడానికి ఒక స్థలమని.. ఆమె తన కుక్కను ఇక్కడికి తీసుకొచ్చి దాని గురించి ప్రకటనలు చేయడం అంటే.. దేశానికి అవమానం కలిగించడమేనని అన్నారు. ఈ సందర్భంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఒక ఎంపీకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయని, అలా కల్పించబడిన హక్కులను దుర్వినియోగం చేయకూడదని సూచించారు.

ప్రధాని ప్రకటనపై రేణుకా ప్రశ్నలు!:

మరోవైపు... పార్లమెంటు వెలుపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటనపైనా రేణుకా చౌదరి స్పందించారు. ఇందులో భాగంగా... ప్రభుత్వం ఒక నెల సమావేశాలను పదిహేను రోజులకు ఎందుకు తగ్గించిందని ఆమె ప్రశ్నించారు. నెల రోజుల సమావేశాలను 15 రోజులకే తగ్గించడానికి కారణం.. ఏమైనా తక్కువ సమస్యలు ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు!




Tags:    

Similar News